Oct 03,2020 13:02
ఇక్కడ టాప్‌లో ఈ స్టార్లే!

పదిహేనేళ్ల క్రితం... సామాజిక మాధ్యమాలు లేని ఆ కాలంలో సినిమా స్టార్లంటే అభిమానం ఇప్పటి కంటే ఎక్కువే ఉండేది. వారి అభిమాన కళాకారులకు ప్రజలు ఉత్తరాలు రాసేవారు. స్టార్ల ఇంటి ముందుకు వెళ్లి, వారిని కలవాలని తాపత్రయపడేవారు. పోటీపడి ఆటోగ్రాఫ్‌లు తీసుకునేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితుల్లో ఎంతో మార్పు... ఇప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమాన స్టార్లను డిజిటల్‌గా పలకరించవచ్చు. ఈ వేదికలపై వారు పోస్ట్‌ చేసే సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత, కుటుంబ విషయాలనూ తెలుసుకోవచ్చు. లైక్‌లు, షేర్‌లతో ఆనందాన్నీ పంచుకోవచ్చు. అందుకే ప్రస్తుతం ఒక స్టార్‌కి ఎంత ఫాలోయింగ్‌ ఉంది అనేది సామాజిక మాధ్యమాల ద్వారా లెక్కకడుతున్నారు. కొందరు ఆర్టిస్టులైతే తమ సోషల్‌ మీడియా అకౌంట్‌లను నిర్వహించే విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ రికార్డులు సృష్టిస్తున్నారు. అయితే, ఈ తరహా మీడియా ప్రచారం ప్రజల్లో ఈ స్టార్‌లకు ఉండే నిజమైన ఫాలోయింగ్‌ను ప్రతిబింబిస్తుందా అన్నది సందేహాస్పదమే!
సెలబ్రిటీలంతా ఎక్కువగా ట్విట్టర్‌నే వినియోగిస్తుంటారు. కొంతకాలం క్రితం వరకూ మన తెలుగు సూపర్‌స్టార్లను గమనిస్తే సినిమా షూటింగ్‌లు, ఫంక్షన్లకు, విదేశీ పర్యటనలో తప్ప బహిరంగ వేదికలపై కనిపించడం అరుదుగానే ఉండేది. అయితే ఈ డిజిటల్‌ ప్రపంచంలో వారివారి అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండటం స్టార్‌ హీరోలకు తప్పనిసరి అయ్యింది. వారివారికున్న మార్కెట్‌ను బట్టి వారి పరిధిని మరింత పెంచుకోవడానికి సామాజిక మాధ్యమాలు అత్యవసరమయ్యాయి. దీనికి ఉదాహరణగా 'బాహుబలి' సినిమా తర్వాత ప్రభాస్‌కి ఫాలోవర్స్‌ అనూహ్యంగా పెరగడాన్ని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే సామాజిక మాధ్యమాల్లో మన తెలుగు సినిమా స్టార్లకు ఉన్న ఫాలోవర్స్‌ని గమనిస్తే ఇటీవల మహేష్‌బాబుకే ఎక్కువ మంది ఫాలోవర్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో టాప్‌ 5 స్థానాల్లో ఉన్న మన స్టార్ల వివరాలు చూద్దాం.

అల్లు అర్జున్‌
ట్విట్టర్‌ : 10 మిలియన్స్‌
ఇన్‌స్టాగ్రామ్‌ : 7.6 మిలియన్స్‌
ఫేస్‌బుక్‌ : 4.8 మిలియన్స్‌

అల్లు అర్జున్‌ తెరపైన నటన పరంగా కానీ, తెర వెనుక స్టేల్‌ సింబల్‌గా కానీ తరచుగా హెడ్‌లైన్స్‌లో ఉండే నటుడు. ముఖ్యంగా ఈ హీరో డ్యాన్స్‌ స్కిల్స్‌తో అభిమానుల మనసుల్ని అమితంగా దోచుకున్న వ్యక్తి. ఈ స్టైలిష్‌ స్టార్‌ ఆకర్షణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కేరళలో ఎక్కువగా ఉంటుంది. కొన్ని ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లోనూ అల్లు అర్జున్‌కి అభిమానం బాగానే ఉంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో 22.5 మిలియన్‌ ఫాలోవర్లతో దూసుకుపోతున్నాడు.

ప్రభాస్‌
ఇన్‌స్టాగ్రామ్‌ : 4.8 మిలియన్స్‌
ఫేస్‌బుక్‌ : 16.2 మిలియన్స్‌

ఇటీవల కాలంలో దక్షిణ భారతదేశం నుంచి ఎదిగిన టాప్‌ హీరో ప్రభాస్‌. ఫేస్‌బుక్‌లో 15 మిలియన్ల ఫాలోవర్స్‌ని దాటేసిన మొట్టమొదటి సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ కూడా ప్రభాసే కావడం విశేషం. ఇప్పటివరకూ అల్లు అర్జున్‌కి వచ్చిన లైక్స్‌ రికార్డుని బద్దలు కొట్టి, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ వేదికల్లో అత్యధికమంది ఫాలో అయ్యే సౌత్‌ యాక్టర్‌గా పేరు సాధించాడు. 'బాహుబలి' సినిమాతో ఖండాంతరాల్లో తన సత్తా చాటి, తన పరిధిని అమాంతంగా పెంచుకున్నాడు ఈ రెబల్‌ స్టార్‌. ఇప్పుడు పాన్‌ ఇండియన్‌ యాక్టర్‌గా పేరు సాధించి, సామాజిక మాధ్యమాల్లో 21 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు.

రానా దగ్గుబాటి
ట్విట్టర్‌ : 6 మిలియన్స్‌
ఇన్‌స్టాగ్రామ్‌ : 4 మిలియన్స్‌
ఫేస్‌బుక్‌ : 4.2 మిలియన్స్‌

వివిధ బాషల్లో నటిస్తూ ఎప్పుడూ బిజీగా ఉండే నటుడిగా రానాకు సినీ పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక 'బాహుబలి' తర్వాత రాణా ఇమేజ్‌ మరింత పెరిగింది. ట్విట్టర్‌లో అంత యాక్టివ్‌గా లేనప్పటికీ రాణాకి ఉన్న చార్మింగ్‌ పర్సనాలిటీతో చాలామంది అభిమానులయ్యారు. సామాజిక మాధ్యమాల్లో మొత్తంగా 14.2 మిలియన్ల ఫాలోవర్స్‌ని సంపాదించుకున్నాడు.

విజయ్ దేవరకొండ
ట్విట్టర్‌ : 1.7 మిలియన్స్‌
ఇన్‌స్టాగ్రామ్‌ : 8 మిలియన్స్‌
ఫేస్‌బుక్‌ 3.7 మిలియన్స్‌

దక్షిణ భారతదేశం నుంచి ఇన్‌స్టాగ్రామ్‌లో 8 మిలియన్‌ ఫాలోవర్స్‌ని దాటేసిన నటుడిగా విజయ్ దేవరకొండ రికార్డు సాధించాడు. వైవిధ్యమైన తన సినిమాలు, మాటతీరునే స్టైల్‌ సింబల్‌గా మార్చుకున్న విధానం, తెరవెనుక వ్యక్తిగత జీవితంలో కనిపించే ప్రత్యేకతలు ఈ హీరోని అతి తక్కువ కాలంలోనే అగ్రహీరోగా నిలపడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ హీరోగా నిలబెట్టాయి. అలాగే కరోనా కాలంలో 17,723 కుటుంబాలకు తన ఫౌండేషన్‌ ద్వారా సహాయం అందించి హెడ్‌లైన్స్‌లో నిలిచాడు. 'అర్జున్‌రెడ్డి' సినిమాతో దేశమంతటికీ పరిచయమైన విజయ్ దేవరకొండ పూరీజగన్నాద్‌ దర్శకత్వంలో రాబోయే సినిమాతో పాన్‌ ఇండియన్‌ స్టార్‌గా ఎదగనున్నాడు. మొత్తానికి సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికే 13.4 మిలియన్ల ఫాలోవర్లతో టాప్‌ 5లో నిలిచాడు.