Nov 22,2020 19:22

ముంబయి : ప్రయివేటు బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు బడుగు జీవుల డిపాజిట్లను కొల్లగొట్టిన ఉదంతాలు కోకొల్లలు. గత కొద్ది మాసాలలోనే ప్రయివేటు ఆర్థిక సంస్థలు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌, పియంసి బ్యాంకు, యస్‌ బ్యాంకు, లక్ష్మీ విలాస్‌ బ్యాంకులు దివాలా తీశాయి. డబ్బు దాచుకున్న పెన్షనర్లు, సామాన్య ప్రజానీకం రోడ్డునపడ్డారు. ఈ అనుభవాల నుంచి ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా కార్పొరేటు కంపెనీలు బ్యాంకులు పెట్టటానికి మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వరంగంలోని బ్యాంకుల నుంచి ప్రయివేటు, కార్పొరేట్లకు వేల, లక్షల కోట్ల రుణాలిప్పించి, వారు ఎగవేయడంతో వాటిని నష్టాల్లోకి నెట్టడం చూస్తున్నాం. ఇప్పుడు మునిగిపోతున్న ఆ బ్యాంకులను తిరిగి కాపాడటానికి ప్రయివేటు రంగంలో బ్యాంకులు నడపడమే శరణ్యమని చెబుతోంది.
'ప్రయివేటు బ్యాంకుల యాజమాన్యం ా కార్పొరేట్‌ నిర్మాణం' అనే అంశాన్ని అధ్యయనం చేసి తగిన సూచనలివ్వటానికి డాక్టర్‌ ప్రసన్న కుమార్‌ మహంతి (రిజర్వ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌) నాయకత్వంలో ఒక అంతర్గత కమిటీని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బిఐ) నియమించింది. ఆ కమిటి గత శుక్రవారం తన నివేదికను రిజర్వ్‌ బ్యాంకుకు సమర్పించింది. ఆ నివేదిక అంబానీ, అదానీ, బిర్లా లాంటి బడా కార్పొరేట్లు సొంత బ్యాంకులు ప్రారంభించటానికి మార్గ దర్శకాలను రూపొందించింది. ఇది అత్యంత ప్రమాదకరమైన చర్య అని, ప్రపంచ దేశాల అనుభవాలను పెడచెవిన పెట్టి తీసుకుంటున్న చర్య అని ఆర్థిక రంగ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ కమిటీ సిఫారసుల ప్రకారం కార్పొరేట్‌ కంపెనీలు నేరుగా బ్యాంక్‌ పెట్టటానికి లైసెన్స్‌ పొందొచ్చు. అప్పటికే వున్న, ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న కంపెనీలను బ్యాంకులుగా మార్చవచ్చు. కొత్తగా బ్యాంకు ప్రారంభించడానికి రూ.1000 కోట్లు పెట్టుబడి, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రూ.50,000 కోట్ల ఆస్తులు కలిగి వుండి పదేళ్లు కనీస అనుభవం వుంటే ఆ సంస్థను బ్యాంకింగ్‌ సంస్థగా మార్చుకోవచ్చు. పదేళ్లు నిండిన చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు, పేమెంట్‌ బ్యాంకులు రూ.500 కోట్ల పెట్టుబడితో బ్యాంకులు ప్రారంభించవచ్చు. బ్యాంకులను స్థాపిస్తున్న ప్రమోటర్లు 15 సంవత్సరాల్లో మూలధనంలో తమ వాటాను 26 శాతానికి పెంచుకొనే వీలు కల్పించింది. ప్రయివేటు బ్యాంకులతో డైరెక్టర్లు తమ సొంత వ్యాపారాలకు ఈ బ్యాంకు నిధులను వినియోగించుకోకుండా బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టాన్ని సవరించాలని కమిటీ సూచించింది.
బ్యాంకులు పెట్టాలని 2012 నుంచి బజాబ్‌ ఫైనాన్స్‌, మహేంద్ర అండ్‌ మహేంద్ర ఫైనాన్స్‌, టాటా కాపిటల్‌, ఆదిత్య బిర్లా కాపిటల్‌, శ్రీరాం ట్రాన్స్‌పోర్ట్‌, ఎల్‌ అండ్‌ టి ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీలు ఎదురుస్తున్నాయి. ఈ కమిటీ సిఫారసులను ప్రభుత్వం అంగీకరించి, బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టానికి అవసరమైన మార్పులు చేస్తే కార్పొరేట్‌ ప్రయివేటు బ్యాంకులు రంగ ప్రవేశం చేస్తాయి.
అన్ని రంగాలనూ, ప్రత్యేకించి బ్యాంకింగ్‌ రంగాన్ని కార్పొరేట్ల సొంతం చేయాలని మోడీ సర్కార్‌ తొందరపడుతున్నది. దీనికోసం బ్యాంకింగ్‌ సంస్కరణలను వేగవంతం చేసింది. విలీనాల పేరు మీద 27 ప్రభుత్వ రంగ బ్యాంకులను 12 బ్యాంకులుగా కుదించింది. వాటిలో సగం బ్యాంకులను ప్రయివేటీకరించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే ప్రయివేటు పరమౌతున్న బ్యాంకులను బడా కార్పొరేట్లకూ, విదేశీ బ్యాంకింగ్‌ సంస్థలకు అప్పజెప్పడానికి చర్యలను వేగవంతం చేస్తున్నది. దివాలా తీసిన లక్ష్మీవిలాస్‌ బ్యాంకును సింగపూర్‌ బ్యాంక్‌ (డిబియస్‌) హస్తగతం చేసింది. ప్రపంచ దేశాలు బ్యాంకింగ్‌ రంగంలోకి కార్పొరేట్లను అనుమతించటానికి ఆచితూచి అడుగులేస్తున్న సమయంలో మనదేశంలో తలుపులు బార్లా తెరిచి ఆహ్వానించటం ఎటువంటి అనర్థాలకు దారితీస్తుందో చూడాలి. బ్యాంకుల్లో వున్న ప్రజల సొమ్మును కాపాడుకోవటం ఇక ప్రజల బాధ్యతే కాబోతుందా?

బ్యాంకుల జాతీయీకరణకు విఘాతం
సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

మోడీ ప్రభుత్వ చర్య బ్యాంకుల జాతీయీకరణకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది. కోట్లాదిమంది భారతీయులు కష్టపడి సంపాదించిన జీవిత కాల పొదుపు ప్రయివేటు కార్పొరేట్ల లాభాల కోసం దోచిపెట్టడమే. మోడీ ప్రభుత్వంలో మరింత పేదరికం, కష్టాలు పెరగనున్నాయి. ఈ చర్యను గట్టిగా నిరోధించాలి.