Jan 14,2021 06:55

సుప్రీంకోర్టు వ్యవసాయ చట్టాలపై ఇచ్చిన మధ్యంతర స్టే రైతాంగ ఉద్యమ డిమాండ్లను పరిష్కరించడం చేతగాక గింజుకుంటున్న కేంద్ర ప్రభుత్వానికి ఊరటను కల్పిస్తే అటు రైతు ఉద్యమకారుల ఆగ్రహాన్ని మరింత ఎగదోసిందని చెప్పాలి. నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలన్నది రైతాంగం యొక్క ప్రధానమైన డిమాండ్‌. కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చల ప్రహసనంలోనూ రైతాంగ ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆల్‌ ఇండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ(ఎఐకెఎస్‌సిసి) ఇదే విషయాన్ని పదేపదే చెప్పింది. చట్టాల రద్దు తప్ప మధ్యే మార్గం లేదని రైతు సంఘాలు విస్పష్టంగా ప్రకటిస్తున్న వేళ సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులివ్వడం గమనార్హం! నిజానికి మోడీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ చట్టాల అంశం కేవలం రైతులకు సంబంధించింది మాత్రమే కాదు. రాజ్యాంగ మౌలిక అంశాల్లో ఒకటైన సమాఖ్య తత్వాన్ని ఈ చట్టాల రూపకల్పనలో మోడీ సర్కారు బేఖాతరు చేసింది. ఉమ్మడి జాబితాలో ఉన్న వ్యవసాయంపై చట్టాలు రూపొందించేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరపడం, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం వంటి మౌలిక అంశాలనూ కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే పట్టించుకోలేదు. అందుకే, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా శాసనసభల్లో తీర్మానం చేస్తున్నాయి. చట్టాల రద్దుపై వాదోపవాదనలను ధర్మాసనం వినివుంటే ఈ అంశాలన్నీ ప్రస్తావనకు రావడం ఖాయమన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వ్యక్తమవుతోంది. అదే జరిగిఉంటే రాజ్యాంగ మౌలిక స్వభావానికి విరుద్దంగా రూపొందిన ఈ చట్టాలకు ఏ గతి పట్టేదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే, అత్యున్నత న్యాయస్థానం దానికి అస్కారమే లేకుండా స్టే ఇచ్చింది! దీనర్ధం ఇప్పుడు కాకపొతే రెండు నెలల తరువాత లేదా ఆ పైనా చట్టాల అమలు చేయడానికి అవకాశం ఉంది. అంటే, వ్యవసాయరంగానికి, దేశ ఆహార భద్రతకు ఏ ప్రమాదమైతే ఉందని రైతులు చెప్తున్నారో ఆ ముప్పు ఇంకా పొంచే ఉంది!


రైతుల సమస్యలను, అభ్యంతరాలను పరిశీలించడానికి కమిటీ వేస్తామని మొదట్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. రైతు సంఘాలు అప్పుడే దానిని ముక్తకంఠంతో తిరస్కరించాయి. కానీ, సుప్రీంకోర్టు ఆ తిరస్కృత ప్రతిపాదననే తన ఆదేశంలో భాగం చేసింది. పైగా తీర్పులో పలు రైతు సంఘాలు ఇటువంటి కమిటీతో చర్చించడానికి సంసిద్ధతను వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించింది. కానీ, అత్యధిక సంఘాలు ఇందుకు వ్యతిరేకంగా ఉన్నాయన్న వాస్తవాన్ని మాత్రం పరిగణలోకి తీసుకోలేదు.పైగా ప్రకటించిన నలుగురు కమిటీ సభ్యుల వైఖరులేమిటో ఇంతకుముందే బహిర్గతం అయ్యాయి. రైతాంగ ఉద్యమం ఉధృతంగా జరగుతున్న సమయంలోనే మోడీ సర్కారు రూపొందించిన చట్టాలకు అనుకూలంగా బాహాటంగా ప్రకటనలిచ్చిన వారు చేసే సిఫార్సులు ఎలా ఉంటాయో ఊహించలేమా! మోడీ, కార్పొరేట్‌ భక్తులుగా ఇప్పటికే తేలిపోయిన వారినే కమిటీ సభ్యులుగా వేయడంతో తమకు న్యాయం జరగదన్న అభిప్రాయం రైతులకు కలిగింది


ఢిల్లీని చుట్టుముట్టిన రైతాంగాన్ని అక్కడి నుండి ఖాళీ చేయించడానికి ఇప్పటి వరకు మోడీ సర్కారు చేయని ప్రయత్నాలు లేవు. స్టే ఇచ్చాము కాబట్టి, కమిటీ వేశాము కాబట్టి దీనినే విజయంగా భావించి ఇళ్లకు వెళ్లండి అని ఇప్పుడు సుప్రీంకోర్టు చెబుతోంది. ఈ తరహా వక్రీకరణలకు, వ్యాఖ్యలకు అవకాశం ఇవ్వడం మినహా సుప్రీం తీర్పువల్ల రైతాంగానికి ఒరిగేదేమీ లేదు. అందుకే రైతు ఉద్యమ సమన్వయ వేదిక చాలా స్పష్టంగా సుప్రీం కోర్టు స్టే పట్ల, కమిటీ ఏర్పాటు పట్ల తన అభ్యంతరాన్ని తెలియచేయడమే కాక, ముందుగా ప్రకటించిన ఆదోళన, రిపబ్లిక్‌డే నాటి ప్రదర్శనతో సహా యధాతథంగా కొనసాగుతుందని ప్రకటించింది. రైతాంగం వ్యక్తం చేసిన కీలక అభ్యంతరాలను గాని, రాష్ట్రాల హక్కులను ఉల్లంఘించిన రాజ్యాంగపరమైన అంశాలను గానీ, కనీసం ప్రస్తావించకుండా సుప్రీంకోర్టు మధ్యంతర స్టే ఉత్తర్వులతో తన ప్రతిష్టను మరింత మసకబరుచుకుందనే చెప్పాలి.