
రారుపూర్ : సినిమాల్లో హీరోలు రెండు పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తుంటాం. అది కూడా విడివిడిగా ఇద్దరు హీరోయిన్లను పెళ్లిళ్లు చేసుకున్న కథలు చూస్తుంటాం. అయితే సినిమాలో వేరువేరుగా ఒకరికి తెలియకుండా.. మరొకరిని పెళ్లి చేసుకున్నా.. ఎన్నో మానసిక సంఘర్షణల వల్ల చివరికి అందరూ ఒక్కటై కలిసి ఉండడానికి ఇష్టపడతారు. ఇటువంటి ఇద్దరు భార్యల కంటెంట్‌తో వచ్చిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఎక్కువే. కానీ ఇక్కడ విశేషమేమిటంటే.. ఇద్దరు అమ్మాయిలు పెళ్లికి ముందే.. ఒకరికొకరు సర్దుకుపోయి బతకాలనే నిర్ణయం తీసుకుని పెళ్లికి సిద్ధమవడం గమనార్హం. ఛత్తీస్‌ఘర్‌లో జనవరి 3న ఈ పెళ్లి జరిగింది. బస్తర్ జిల్లాలో టికారి లోంగా గ్రామంలో ఒకే మండపంలో ఈ వివాహం అత్యంత వేడుకగా జరిగింది. వరుడు పేరు చందు మౌర్యా, వధువుల పేర్లు, హసీనా (19), సుందరి (21) వీరిద్దరూ కూడా ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. వరుడు చందు మౌర్యా 'నేను వారిద్దరినీ ఇష్టపడ్డాను. వారు కూడా నన్ను ఇష్టపడ్డారు. మేము గ్రామస్తుంలందరి ఏకాభిప్రాయంతోనే వివాహం చేసుకున్నాము. అయినప్పటికీ నా భార్యాలలో ఒకరి కుటుంబ సభ్యులు మా వివాహ కార్యక్రమానికి రాలేదు' అని అన్నారు. అలాగే వారి పెళ్లికి ఎవరూ వ్యతిరేకంగా లేరట.. గ్రామస్తులందరూ పెళ్లికి హాజరయ్యారని చందుమౌర్యా చెబుతున్నారు. ఇంకో విషయమేమిటంటే.. బస్తర్ జిల్లాలో గ్రామస్తులందరి ముందు ఇటువంటి వివాహం జరగడం ఇదే మొదటిసారట. ఇలా వివాహం చేసుకున్న వివాహపు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాంకేతికంగా అభివృద్ధి చెందిన కాలంలో కూడా.. ఇటువంటి పెళ్ళిళ్లు చేసుకోవడం, ప్రోత్సహించడం రెండూ నేరమే.