Jan 25,2021 23:34

పోలీసుల అదుపులో మిలీషియా సభ్యులు

ప్రజాశక్తి-చింతూరు : ఇద్దరు మావోయిస్టు మిలీషియా సభ్యులను పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. చర్ల పోలీసులు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది కుర్నాపల్లి అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా అడవిలో ముగ్గురు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా గుర్తించారు. వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. డోకుపాడుకు చెందిన కోవాసి భీమయ్య, చర్ల మండలం బూరుగుపాడుకు చెందిన సోడి దీపక్‌ను అరెస్టు చేశారు. వీరిద్దరూ మూడేళ్లుగా మావోయిస్టు దళానికి కొరియర్లుగా వ్యవహరి స్తున్నారని, స్థానిక చర్ల ఏరియా మావోయిస్ట్‌ కమిటీకి అనుబంధంగా మిలీషియా సభ్యులుగా కొనసాగుతున్నారని పోలీసులు తెలిపారు. వీరు నాలుగు నెలల క్రితం చర్ల మండలం, కలివేరు జంక్షన్‌ వద్ద అమర్చిన మందుపాతర కేసులో నిందితులుగా ఉన్నట్టు తెలిపారు. మావోయిస్టు అగ్రనేతల ఆదేశాలతో వీరు కుర్నాపల్లి అటవీ ప్రాంతంలో మందుపాతర అమర్చడానికి వచ్చి పట్టుబడినట్టు తెలిపారు. వీరి నుంచి 10 జెలెటిన్‌ స్టిక్స్‌, రెండు డిటోనేటర్స్‌, వైర్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరిని రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు.