Nov 28,2020 01:12

విడుదలైన మహిళా ఖైదీలకు కుట్టు మిషన్లు అందజేస్తున్న రాహుల్‌

ఆరిలోవ : ఇద్దరు మహిళా ఖైదీలు విశాఖ కేంద్ర కారాగారం నుంచి శుక్రవారం విడుదలయ్యారు. ఈ ఏడాది ఆగస్టు 15 సందర్భంగా ఎపి ప్రభుత్వం విడుదల చేసిన జిఒ స్పెషల్‌ రెమిషన్‌ ప్రకారం ఎపి జైళ్ళు, సంస్కరణల శాఖాధిపతి హసన్‌ రెజా ఆదేశాల మేరకు కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎస్‌.రాహుల్‌ జీవిత ఖైదు అనుభవిస్తున్న వీరిని విడిచి పెట్టారు. 2014లో వేర్వేరు హత్యలకు సంబంధించిన నేరంపై యావజ్జీవ శిక్ష పడిన ముంచంగిపుట్టు మండలం, పెదగడ గ్రామానికి చెందిన జి.కాంతమ్మ, శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం, నౌపాడ గ్రామానికి చెందిన నీలాపు రోజా ఎనిమిదేళ్ళుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలోని మహిళా విభాగంలో శిక్ష అనుభవిస్తున్నారు. వీరిని బంధువులతో ఇంటర్వ్యూ కోసం మార్చిలో విశాఖ కేంద్ర కారాగారానికి తరలించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 142 ప్రకారం ఇక్కడ నుంచే వీరిని విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించినట్టు ఎస్‌.రాహుల్‌ తెలిపారు. బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఇద్దరు మహిళా ఖైదీల కళ్ళలో ఎక్కడా లేని ఆనందం కనిపించింది. అనంతరం బయటకు వచ్చిన వారికి చినజీయర్‌ స్వామి సమకూర్చిన రెండు కుట్టు మిషన్లను, జైలు అధికారులు సమకూర్చిన చీరలు, పండ్లు, మిఠాయిలను రాహుల్‌ అందజేశారు.