Sep 15,2021 16:24

బి.కొత్తపేట (చిత్తూరు) : ఐదు, ఆరేళ్లు ఉన్న ఇద్దరు బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ యువకుడిని విద్యుత్‌ స్తంభానికి కట్టేసి గ్రామస్తులు దేహశుద్ధి చేశారు. అనంతరం దిశ యాప్‌ ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా బి.కొత్తపేటకు సమీపంలోని ఇందిరమ్మ కాలనీలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇందిరమ్మ కాలనీకి చెందిన అనిల్‌ కుమార్‌ (20) మెకానిక్‌, మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఐదు, ఆరేళ్లు ఉన్న ఇద్దరు బాలికల తండ్రి మరణించగా.. తల్లి ఉపాధి నిమిత్తం బెంగళూరు వెళ్లింది. దీంతో ఆ బాలికలు ఇందిర కాలనీలోని అమ్మమ్మ దగ్గర ఉంటున్నారు. మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు బాలికలు ఇంటి వరండాలో ఆడుకుంటుండగా అనిల్‌ కుమార్‌ వారిద్దరిని ఆడుకుందామని చెప్పి మిద్దె పైకి తీసుకు వెళ్ళాడు.. అక్కడ వారితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో వారిలో ఒక బాలిక ఏడుస్తూ జరిగిన విషయాన్ని అమ్మమ్మతో చెప్పింది. దీంతో ఆమెతో పాటు స్థానికులు మిద్దె పైకి వెళ్లగా.. అక్కడ అనిల్‌ కుమార్‌ మరో బాలికను ఒళ్లో కుర్చోబెట్టుకొని అసభ్యంగా ప్రవర్తిస్తుండడం చూశారు. వెంటనే ఆ యువకుడిని కిందికి లాక్కొచ్చి విద్యుత్‌ స్తంభానికి కట్టేసి దేహశుద్ధి చేశారు. గతంలో కూడా కాలనీ పిల్లలపై అసభ్యకరంగా ప్రవర్తించారని స్థానికులు మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటనపై బాలిక అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తున్నట్టు ఎస్‌ఐ రామ్మోహన తెలిపారు.