
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోల పాత్రలకుండే ప్రాధాన్యత హీరోయిన్లకు ఉండదు. ప్రమోషన్లలో, పోస్టర్లలో ఎక్కువగా హీరోలే హైలెట్ అవుతుంటారు. కథానాయిక పాత్ర కీలకంగా ఉండే కొన్ని చిత్రాలకు మాత్రమే హీరోయిన్లు హైలెట్ అవుతుంటారు. ప్రస్తుతం విరాటపర్వం సినిమా పోస్టర్ను చూసినా, ప్రమోషన్లను చూసినా.. హీరోయిన్ సాయిపల్లవి హైలెట్ అవుతున్నారు. కథాంశం ఏమో కానీ.. ప్రోమోలలో హీరో రానా ను మించి సాయిపల్లవి కనిపిస్తున్నారు. సినిమా పోస్టర్ పై కూడా సాయిపల్లవి ఫొటో హైలెట్ అవుతుంది. సినిమాలో హీరోకు దీటుగా, హీరోయిన్ పాత్ర ఉంటుందేమో అనే అభిప్రాయాలు కలుగుతున్నాయి.
ఈ గౌరవం అందరు హీరోయిన్లకూ దక్కదు..
సినీ ఇండిస్టీ సాంప్రదాయం ప్రకారం ఏ పోస్టర్లోనైనా హీరో బొమ్మ ముందుంటుంది. కానీ హీరోయిన్ సాయిపల్లవికి మాత్రం అరుదైన గౌరవం దక్కింది. విరాటపర్వం సినిమాకు సంబంధించి ఏ పోస్టర్ వదిలినా ముందుగా సాయిపల్లవి బొమ్మ వేసి, తర్వాత రానా బొమ్మ ఉండేలా చూస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన కోలు కోలు పాట పోస్టర్లోనూ ఆమె ఫోటోనే ముందుంది. ఈ గౌరవం అందరు హీరోయిన్లకూ దక్కదు. అంటే ఈ సినిమాలో రానా కంటే సాయిపల్లవి పాత్రే కీలకం అని అర్థమవుతుంది.
ఇలా ఒప్పుకోవడం కూడా విశేషమే..
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ గుర్తింపు సంపాదించిన హీరో రానా మార్కెట్ లో తనకంటూ ప్రత్యేకతను సంతరించుకున్నారు. ఇలాంటి హీరో, హీరోయిన్ కంటే తన పేరు వెనుక ఉండటానికి ఒప్పుకోవడం విశేషమే. ఈ సినిమాను నిర్మిస్తున్న రానా తండ్రి సురేష్ బాబు కూడా తన కొడుకు ఫోటో పోస్టర్లో వెనకుండేలా ఒప్పుకోవడం కూడా గొప్ప విషయమే. నటిగా సాయిపల్లవి స్థాయిని బట్టి బలమైన, ఇంటెన్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ విరాటపర్వం సినిమా.. సాయిపల్లవి కెరీర్లో మరో మైలురాయి కావాలని ఆశిద్దాం.