Jun 13,2021 08:09

న్యూఢిల్లీ: ఇటీవల చోటుచేసుకున్న ఎయిరిండియా, డొమినోస్‌, బిగ్‌బాస్కెట్‌ డేటా ఉల్లంఘన కారణంగా పలువురు ప్రభుత్వ అధికారులకు చెందిన ఈమెయిల్స్‌, పాస్‌వర్డులు హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది.  @nic.in, @gov.in వంటి ప్రభుత్వ డొమైన్లతో కూడిన ఈమెయిళ్లకు సైబర్‌ బెదిరింపులు వచ్చే అవకాశం ఉందని, శత్రువులు ప్రభుత్వ అధికారులకు హానికరమైన మెయిల్స్‌ పంపేందుకు వినియోగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి హెచ్చరికలు పంపిన ఈనెల 10 తరువాతనే రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని వాట్సాప్‌, ఎస్‌ఎంఎస్‌ల రూపంలో హానికరమైన వెబ్‌ లింక్‌ వచ్చింది. ఇందులో వ్యాక్సినేషన్‌ స్టేటస్‌ను ఆప్‌డేట్‌ చేయమని కోరింది. కోవిడ్‌-19 టీకాల యొక్క డిజిటల్‌ సర్టిఫికేట్‌ను రూపొందించడానికి https://covid19india.in క్లిక్‌ చేయమని సందేశం అధికారులకు వచ్చింది.