Nov 30,2020 21:31

శంకరరావు ఈడ్చుకెళ్తున్న పోలీసులు (ఇన్‌సెట్‌లో స్పృహతప్పిపోయిన కుమారి)

విజయనగరం టౌన్‌ : హుదూద్‌ బాధితులకు నగరంలో నిర్మించిన ఇళ్లలో సిపిఎం తలపెట్టిన గృహ ప్రవేశాల కార్యక్రమంలో పోలీసులు అనుచితంగా వ్యవహరించారు. హుదూద్‌ తుపానుకు ఇళ్లు కోల్పోయిన బాధితులకు గత ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లను తమకు అప్పజెప్పాలని సోమవారం సిపిఎం ఆధ్వర్యంలో లబ్ధిదారులు లంకా పట్టణం వద్ద నిర్మించిన ఇళ్ల సముదాయం వద్దకు ప్రదర్శనగా వెళ్లి, ఆ ఇళ్లలో గృహప్రవేశం చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు రెడ్డి శంకరరావును ఈడ్చేయగా, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పి.రమణమ్మతో పాటు మహిళలను నెట్టేశారు. ఈ తోపులాటలో శీరపు కుమారి మూర్చపోయింది. సిపిఎం నాయకులు బి.రమణ, హర్షను కింద పడేశారు. అయినా పోలీసుల్ని తోసుకొని సిపిఎం నాయకులు, లబ్ధిదారులు ముందుకెళ్లారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అధికారులు తమకు సహకరించాలని, 2014 నుంచి ఇంటి అద్దెలు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఇళ్లు అప్పగించాలని 2019 నుంచి అనేకసార్లు హౌసింగ్‌ కార్యాలయం వద్ద వివిధ రూపాల్లో ఆందోళనలు చేశామన్నారు. ప్రతిసారి నెల రోజుల్లో ఇళ్లు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ అప్పగించలేదన్నారు. ప్రభుత్వం ఇళ్లు అప్పగించకపోవడంతో తాము ఈరోజున గృహప్రవేశాలు చేయాలని వచ్చామన్నారు. దీనికి స్పందించిన సిఐ హౌసింగ్‌ పీడీని సంఘటనా స్థలానికి రప్పించారు. ప్రస్తుతం నీరు, కరెంట్‌ వేస్తున్నామని, నెల రోజుల్లో ఆ పనులు పూర్తి చేసి జనవరి మొదటి వారంలో అలాట్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చి లబ్ధిదారులకే అప్పజెబుతామని రాత పూర్వక హామీ ఇచ్చారు. ఆ హామీతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో సిపిఎం పట్టణ నాయకులు ఆనంద్‌. మణికంఠ, జగదాంబ తదితరులు పాల్గొన్నారు.