Nov 22,2020 20:00

మండి/అహ్మద్‌నగర్‌ : రైతు తన పంటను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చంటారు, కానీ, పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి యూరియా కొనుగోలు చేసిన రైతులను అరెస్టు చేస్తారు. పంజాబ్‌ నుంచి వచ్చి యూరియా కొనుగోలు చేసి తీసుకెళ్తున్న నలుగురు పంజాబ్‌ రైతులను హర్యానాలోని బిజెపి ప్రభుత్వం శనివారం అరెస్టు చేసింది. వీరిపై ఫెర్టిలైజర్స్‌ (మూవ్‌మెంట్‌ కంట్రోల్‌) చట్టాం1973, నిత్యావసర వస్తువుల చట్టాం1955లోని సెక్షన్‌ 7 కింద హర్యానా పోలీసులు కేసులు నమోదు చేశారు. అరెస్టు చేసిన నలుగురు రైతులు మాల్దా బెల్ట్‌కు చెందిన గోధుమ రైతులు. వీరిలో లూథియానా జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నారు. రైతుల నుంచి 840 యూరియా బస్తాలు, ట్రాక్టర్లను జింద్‌ జిల్లా సదర్‌ వద్ద పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్‌లో రైతులు గత కొన్నివారాలుగా పెద్దయెత్తున ఆందోళన చేస్తున్నారు. గూడ్స్‌ రైళ్లను నడపవచ్చని రైతులు చెబుతున్నా పట్టించుకోకుండా వాటిని సైతం కేంద్రం నిలిపివేసింది. దీంతో, రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు, ఇతర సరుకుల రవాణా నిలిచిపోయింది. రైతులు పంటలను కాపాడుకునేందుకు ఎరువుల కోసం పొరుగున ఉన్న హర్యానాకు వెళ్లగా, అక్కడ అరెస్టు చేశారు. హర్యానా వ్యవసాయ అధికారులు, పోలీసులు తీసుకున్న చర్య దారుణమని, దీనిపై పంజాబ్‌ సిఎం అమరీంద్‌ సింగ్‌ వెంటనే స్పందించి రైతులను విడిపించాలని ఎఐకెఎస్‌ నేత బల్దేవ్‌ లతాలా డిమాండ్‌ చేశారు. కేంద్రంలోను, హర్యానాలోను అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వాలు రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని విమర్శించారు. బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టేందుకు ఈ నెల 26,27 తేదీల్లో కార్మికులతో కలసి రైతాంగం చేపట్టిన దేశవ్యాపిత ఆందోళనల్లో అందరూ పాల్గనాలని ఆయన కోరారు.