Jul 04,2021 10:46

     అర్ధరాత్రి జోరున కురుస్తున్న వర్షంలో తడుస్తూ వచ్చిన ముకుందం 'ఒరేరు అనంతం! సుశీలా టీచర్‌ గారికి గుండెల్లో నొప్పి వచ్చిందట. ఆవిడ ఒంటరిగా ఉంటుందని తెలుసుగా. పక్కింటి వాళ్ళు నాకు ఫోన్‌ చేశారు. మనం వెంటనే వెళ్ళాలి. బయల్దేరు' అంటూ హడావిడి చేశాడు.
    అనుకోకుండా వచ్చిన ఉపద్రవానికి అనంతం షాకయ్యాడు. ఎప్పటి సుశీలమ్మ! ఏనాటి పంతులమ్మ! ఆవిడ పని చేసిన పాఠశాలలో తాము చదువుకుని పాతికేళ్ళ పైనే అయింది. స్కూల్‌ చదువు అయిపోయి కాలేజీలో చేరిన తర్వాత కూడా ఆవిడ తమకు అన్ని విషయాల్లో సలహాలు ఇస్తూనే ఉండేది. ఉద్యోగాలు సాధించటంలో కానీ, జీవితంలో ఎదగటంలో కానీ ఆవిడ చేసిన దిశా నిర్దేశం తమలాంటి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దింది. భర్త పోయిన కొన్నాళ్ళకే ఒక్కగానొక్క కొడుకూ పోయాడు. అప్పటి నుంచి విద్యార్థులే తన పిల్లలుగా భావిస్తూ ఒంటరిగా జీవిస్తుంది. అనంతం మనసంతా వికలమైంది.
    మిత్రుడి మౌనం చూసి అసహనంతో 'ఏంట్రా ఆలస్యం? అవతల మేడమ్‌ ప్రాణాపాయంలో ఉంటే!' అంటూ తొందరపెట్టి 'నా దగ్గర ఓ నాలుగు వేలున్నాయి. నీ దగ్గర ఎంత ఉంటే అంతా పట్టుకొచ్చెరు. డబ్బు అవసరం చాలా ఉంటుంది' అన్నాడు ముకుందం. ఆలోచనలు కట్టిపెట్టి బీరువాలో ఉన్న డబ్బంతా లెక్క కూడా చూడకుండా జేబులో పెట్టుకొని, మిత్రుడితో బయల్దేరాడు అనంతం.
     ఆ వానలోనే అంబులెన్స్‌కి ఫోన్‌ చేసి, సుశీలమ్మను ఒక పేరుమోసిన కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ కట్టి, అప్పటికి గండం గట్టెక్కించారు.
     మర్నాడు టెస్ట్‌ రిపోర్ట్‌లు తెచ్చిన ముకుందం దిగాలుగా చూస్తూ 'ఆపరేషన్‌ చెయ్యాలి అంటున్నారు డాక్టర్లు. రెండు లక్షలు ఖర్చు అవుతుందిట. మన ఆర్థిక పరిస్థితీ అంతంత మాత్రమే కదా! మేడమ్‌ పరిస్థితి చూస్తుంటే దు:ఖం ఆగట్లేదు' అన్నాడు.
'అవునురా. కానీ చూస్తూ చూస్తూ అలా వదిలెయ్యలేం కదా! అప్పట్లో చదువులో వెనుకబడిన మనకు ఆవిడ ఫీజు కూడా తీసుకోకుండా ట్యూషన్‌ చెప్పబట్టే కదా మనం మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. మనమే కాదు. మనలాంటి ఎంతో మందికి ఉచితంగా చదువు చెప్పారామె. ఏదొకటి చేసి సుశీలమ్మ గారి ప్రాణం నిలబెట్టాలి' అన్నాడు అనంతం.
దూరంగా స్నేహితులిద్దరూ మాట్లాడుకుంటున్నది తన గురించేనని సుశీలమ్మకు అర్థమై, వాళ్ళని తన దగ్గరకు రమ్మని సైగ చేసింది. అపారమైన జీవితానుభవాన్ని సూచిస్తున్నట్లున్న లోతైన కళ్ళను చిట్లించి చూస్తూ 'జీవిత చరమాంకంలో ఉన్న నా కోసం మీరు డబ్బు ఖర్చు పెట్టటం దండగ నాయనా! ఎప్పుడో ఒకప్పుడు ఈ పండు రాలి పోవాల్సిందే. అప్పటిదాకా తట్టుకునే శక్తి నాకుంది. మీరేమీ దిగులు పడకండిరా!' అందామె నీరసంగా.
ముకుందం చేతులు జోడించి 'దయచేసి మీరలా మాట్లాడొద్దు. మీరు సంపూర్ణ ఆరోగ్య వంతులై, ఈ తరం పిల్లలను కూడా తీర్చిదిద్దాలి. మీరే గనుక అప్పుడు మమ్మల్ని పట్టించుకోకపోతే ఇప్పుడు మా పరిస్థితి ఎంత ఘోరంగా ఉండేది!' అన్నాడు.
అనంతం కూడా 'అవును మేడమ్‌. అసలు మీ అవసరం ఇప్పటి తరానికే ఎక్కువ ఉంది. మీరేమీ అడ్డు చెప్పకండి. మీ దగ్గర చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. వాళ్ళతో మేము మాట్లాడతాం. ఎవరో ఒకరు ఆదుకుంటారు. కనీసం ఇలాగైనా మా ఋణం తీర్చుకోనివ్వండి' అన్నాడు బతిమాలుతూ.
శిష్యుల గురుభక్తి చూసి సుశీలమ్మకు నోట మాట రాలేదు. సమాధానం చెప్పలేక కళ్ళు మూసుకుంది. ఆమె కంటి రెప్పల కింద నుంచి రెండు కన్నీటి చుక్కలు చెంపల మీదకు జారి, ఆవిరైపోయాయి. దగ్గర బంధువులు ఎవరూ లేని తన దుస్థితికి, తన మీద తనకే జాలి కలిగింది.
మిత్రులిద్దరూ బయటకు వచ్చి అందుబాటులో ఉన్న తమ స్నేహితులందరికీ ఫోన్లు చేశారు. ఎవరి దగ్గర నుంచీ సానుకూల స్పందనలు లేవు. సుశీలమ్మ గారు పెట్టిన క్రమశిక్షణ గుర్తొచ్చి, కొంతమంది నిష్టూరంగా మాట్లాడారు.
చివరికి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న రాజారావు సానుకూలంగా స్పందించి 'మొత్తం ఆపరేషన్‌ ఖర్చు నేనే భరిస్తాను. అయితే ఎవరైనా వచ్చి డబ్బులు తీసికెళ్ళండి. ఎకౌంట్లో వేస్తే నాకు టాక్స్‌ ప్రాబ్లం' అన్నాడు. ముకుందం ఆ రోజే వెళ్ళి, రాజారావు దగ్గర నుంచి డబ్బు తెచ్చాడు.
అంత త్వరగా డబ్బు సర్దుబాటు కావటం సుశీలమ్మకు ఊరట కలిగించినా, మనసులో ఏ మూలో అనుమానం తొంగి చూసింది. తనకు పళ్ళరసం ఇస్తున్న అనంతంతో 'అంత డబ్బు ఎవరిచ్చారు? నా కోసం నా శిష్యులు చందాలు వేసుకోలేదు కదా!' అంది పేలవంగా నవ్వుతూ.
అతడు కూడా నవ్వి 'ఆ అవసరం రాలేదమ్మా! స్కూల్లో మా సీనియర్‌ రాజారావు ఈ డబ్బు సర్దుబాటు చేశాడు' అని అన్నాడు కానీ అతడికి తెలుసు, ఆమె ఇంకా ఆరా తీస్తుందని.
సుశీలమ్మ అనుమానంగా చూస్తూ 'వాడు కూడా మీలాగే ఎల్డీసీయే కదా! మీకు లేని డబ్బు వాడికెలా వచ్చింది? ఆస్తిపాస్తులు కూడా ఏమీ లేవనుకుంటానే!' అంది. ఏం చెప్పాలో అర్థంకాక అనంతం దిక్కులు చూడసాగాడు.
అప్పుడే వచ్చిన ముకుందం వీళ్ళ సంభాషణల సారాంశం గ్రహించి, మిత్రుడిని బయటకు తీసుకెళ్ళాడు. రాజారావు ఎలా సంపాదిస్తాడో తెలిసిన సుశీలమ్మ ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చింది. ఆమె చాలాసేపు ఆలోచించి, ఒక నిర్ణయానికి వచ్చింది.
 

                                                                               ***

   సుశీలమ్మగారు ఆపరేషన్‌కి ఒప్పుకోలేదని అనంతం చెప్పినప్పుడు, ముకుందం నిర్ఘాంతపోయాడు. ఆమె మీద కోపం కూడా వచ్చింది. విసురుగా ఆవిడ మంచం దగ్గరకు వెళ్ళి 'ఏంటమ్మా ఇది? మేం ఎంతో కష్టపడి ఏర్పాట్లు చేస్తే ఇప్పుడు ఆపరేషన్‌ వద్దనటం భావ్యమేనా?' అన్నాడు సాధ్యమైనంత నిగ్రహంగా.
టీచర్‌గారి నుంచి ఏ జవాబు రాకపోవటంతో.. అనంతం కూడా 'అమ్మా! మీకు మేమున్నాం. మమ్మల్ని మీ కొడుకులే అనుకోండి. ఆపరేషన్‌కి డబ్బిచ్చిన రాజారావు కూడా మీ శిష్యుడే కదా!' అన్నాడు.
సుశీలమ్మ గారు ప్రశాంతంగా చూస్తూ 'నిజంగా మీరు నా పిల్లలే. అంతకన్నా ఎక్కువ కూడా! ఎప్పుడో మీకు చదువు చెప్పినందుకు - అర్ధరాత్రి, జోరువానను కూడా లెక్క చేయకుండా, కార్పొరేట్‌ ఆస్పత్రిలో వైద్యం చేయించి, నా ప్రాణం నిలబెట్టారు. అది చాలు నాయనా నాకు' అంది కళ్ళు తుడుచుకుంటూ.
ఆవిడ భావోద్వేగాల్ని చూసిన డాక్టర్‌ సురేష్‌ 'దయచేసి ఆమెని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఆవిడ ఎక్కువ ఎగ్జైట్‌ అవకూడదు. అసలే ఆవిడ కండిషన్‌ అంత బాగాలేదు' అన్నాడు చిన్నగా.
సుశీలమ్మ డాక్టర్ని వారిస్తూ 'ఫర్వాలేదు డాక్టర్‌ గారూ! ఆపరేషన్‌ వద్దనటానికి కారణం చెప్పకపోతే నా పిల్లలు ఊరుకోరు' అని కొంచెం ఆగి 'స్వాతంత్య్ర సమరయోధుడైన మా నాన్నగారు నేర్పిన విలువలనే నేను నా విద్యార్థులకు నేర్పాను. కానీ రాజారావులాంటి ఒకరిద్దరు విద్యార్థులకి మాత్రం నా నీతి వాక్యాలు చెవికి ఎక్కలేదు. అతడు డబ్బు సంపాదన కోసం అవినీతి బాట పట్టాడు. ఈ విషయం రెండు నెలల క్రితమే పత్రికల్లో వచ్చింది. అవినీతి డబ్బుతో నేను వైద్యం చేయించుకోలేను. ఆపరేషన్‌ చేస్తే మహా అయితే మరో పదేళ్లు జీవిస్తానేమో. చెయ్యకపోతే. తెలీదు ఎన్నాళ్ళుంటానో! కానీ ఆ కాకి బతుకు నాకొద్దు. హంసలా కొద్ది కాలం బతికినా చాలు, మీ గుండెల్లో మాత్రం కలకాలం ఉంటాను' అని నిశ్చింతగా కళ్ళు మూసుకుంది.
ఆమెలో ఉన్న నిబద్ధత డాక్టర్‌ గారి హృదయాన్ని కదిలించింది. అతడిలో అంతర్గత సంఘర్షణ చెలరేగింది. వైద్యం పేరుతో తను చేస్తున్న వ్యాపారం గుర్తొచ్చింది. ప్రాణాపాయం ఉందని తెలిసి కూడా అవినీతి సొమ్ముతో ఆపరేషన్‌ వద్దన్న ఆ వృద్ధురాలి మాటలు తనకు చెంపదెబ్బల్లా తగిలాయి. అప్పుడే అతడికి కర్తవ్యం బోధపడింది.
సురేష్‌ మిత్రులిద్దరి భుజాల మీద చేతులు వేసి 'నిజంగా మీరు అదృష్టవంతులు, ఇంత గొప్ప టీచర్‌ దొరికినందుకు. ఆ డబ్బులు రాజారావుకి ఇచ్చేసి రండి. ఆపరేషన్‌ యథావిధిగా జరుగుతుంది' అని సుశీలమ్మ గారి వైపు తిరిగి 'అమ్మా! ఇక నుంచి నేను కూడా హంసలా బతకాలనుకుంటున్నాను. నన్ను కూడా మీ శిష్యుడిగా స్వీకరించండి!' అన్నాడు.

బలభద్రపాత్రుని ఉదయ శంకర్‌
94945 36524