Nov 24,2020 20:58

భౌతిక దాడి జరిగితేనే హింసగా పరిగణిస్తారు చాలామంది. కానీ హింస భౌతికరూపంలోనే కాదు; అనేక రూపాల్లో, అనేక సందర్భాల్లో వ్యక్తమవుతుంది. అది లైంగిక, భావోద్వేగ, మానసిక, ఆర్థిక రూపాల్లో నిరంతరంగా వ్యక్తమవుతూనే ఉంటుంది. దీనిపై అవగాహన పెంచటం, నియంత్రణకు ప్రయత్నించటం చాలా చాలా అవసరం.
కొంతమంది స్త్రీలను ఇంటికే పరిమితం చేసి, వారిని చులకనగా చూస్తారు. వారి భావాలతో పనిలేకుండా తమ నిర్ణయాలను బలవంతంగా ఇంటి ఆడవారిపై రుద్దుతారు. ఆర్థిక లావాదేవీల్లో వారిని అశక్తులుగా చేయడం, కుటుంబం, స్నేహితులు తప్ప బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంచడం, పిల్లలను హింసించడం, చంపుతామని బెదిరించడం ద్వారా స్త్రీలను లొంగదీసుకోవడం మానసిక, భావోద్వేగ హింసకు దారితీస్తుంది.
నిత్యం భయం భయంగా...
జీవిత భాగస్వామితోనే కాక తోటి కుటుంబ సభ్యుల నుంచి ఎదురయ్యే గృహహింస కొన్ని సందర్భాల్లో చాలా క్రూరంగా మారుతోంది. బాధితురాలు తన కుటుంబసభ్యుల మధ్య నిత్యం భయంభయంగా జీవించే పరిస్థితి వస్తుంది. ఇది చాలా దారుణం. ఒక సర్వే ప్రకారం మహిళలపై హింస తరచుగా మానసిక, ఆర్థిక, భావోద్వేగ పరిస్థితుల నుంచి శారీరక, లైంగిక హింస వరకు కొనసాగుతోందని తేలింది.
కరోనా సమయంలో మహిళలపై గృహహింస పెరిగిపోయిందని అనేక నివేదికలు పేర్కొన్నాయి. వాస్తవానికి మహిళలపై, బాలికలపై జరుగుతున్న హింసపై విస్తృత అవగాహన కల్పించకపోవటం మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. మనదేశంలో దీనిని తీవ్రంగా పరిగణించరు. అందుకే బాధిత మహిళల్లో అనేకమంది కుటుంబంలో తమపై జరిగిన హింసను బయటపెట్టకుండా మౌనం వహిస్తున్నారు. ఈ హింసను బహిర్గతం చేయకపోవటంలో కుటుంబ పరువు, అవమానం, బిడియం వంటివి కీలకంగా పనిచేస్తున్నాయి.
కనపడకుండా మహిళలపై జరుగుతున్న ఈ హింస వారి మానసిక, శారీరక, లైంగిక, పునరుత్పత్తి అంశాలపై ప్రభావం చూపుతూనే ఉంటుంది. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల్లోనూ ఇది కొనసాగుతుంది. ఉదాహరణకు వివక్షకు తావులేకుండా విద్యను పొందడంలో వెనకడుగు వేయవచ్చు. ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో కూడా వెనుకంజ వేసే పరిస్థితి రావచ్చు. ఇటువంటి పరిణామాలు దీర్ఘకాలం కొనసాగితే దారుణమైన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. పైగా సమానత్వం, అభివృద్ధి, శాంతిని సాధించడంతో పాటు మానవ హక్కుల సాధనలో నిరంతరం అడ్డంకులు ఎదురవుతాయి. మహిళలపై జరుగుతున్న ఈ హింసను నియంత్రించకుండా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించలేము.
వేడుకల సమయం కాదు
ఈ ఏడాది బీజింగ్‌లో మహిళల 4వ ప్రపంచ సదస్సు 25వ వార్షికోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే భద్రతా మండలి 1325వ తీర్మానం 'మహిళలు, శాంతి, భద్రత'కు 20వ సంవత్సరం నిండుతోంది. ఇన్నేళ్ల నుంచి మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నా వారి హక్కులు ప్రతిచోటా దాడికి గురవుతూనే ఉన్నాయి. అందుకే ఇది వేడుకలకు సమయం కాదు.
మనదేశంలో స్త్రీలపై నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. యాసిడ్‌ దాడులు, అత్యాచారాలు, హత్యలు, వేధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. వివక్షకు తావులేకుండా స్త్రీ, పురుషలిద్దరికీ సమాన హక్కులు ఉంటాయి. కాని మనదేశంలో దీనిపై అవగాహన చాలా కొద్దిమందికే ఉంటుంది. మహిళలు ఎంత ఉన్నత స్థానాలకు ఎగబాకినా స్త్రీ కంటే పురుషుడు ఒకింత ఎక్కువే అన్న ధోరణి నేటికీ కొనసాగుతూనే ఉంది. తన చుట్టూ ఉన్న కుటుంబం, సమాజం ఆవిధమైన పరిస్థితులనే చూపెడుతూ ఉంటుంది. అందుకే నేటికీ అనేకమంది మహిళలు విద్య, ఉపాధి అవకాశాలకు దూరంగా ఉండిపోతున్నారు. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా మహిళలకు చీకటి రోజులు దాపురించాయంటే కారణం ఎవరు? కుటుంబపరంగానైనా, సమాజంలోనైనా తనపై జరిగిన దాడిని నిర్భయగా మహిళ ఎందుకు చెప్పలేకపోతోంది? మహిళలపై జరుగుతున్న నేరాలను, దాడులను, హింసను అరికట్టడంలో ప్రభుత్వాలు చొరవ చూపెట్టాలి. అప్పుడే మానవ హక్కుల్లో భాగంగా సమానత్వం, విద్య, ఉపాధి హక్కులు వారికి లభిస్తాయి.
మీకు తెలుసా?

హింస నుంచి విముక్తి ఎప్పుడు?


- ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురి మహిళల్లో ఒకరు తన జీవితకాలంలో శారీరకంగా గాని, లైంగికంగా గాని హింసను ఎదుర్కొంటున్నారు. తరచూ ఇటువంటి పరిస్థితులు సన్నిహిత భాగస్వామి ద్వారానే ఎదురవుతున్నాయి. కోవిడ్‌-19 లాక్‌డౌన్‌ సమయంలో అనేక దేశాలు ఇటువంటి హింసను అరికట్టేందుకు ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ కేంద్రాలను నడిపాయి. ఈ సమయంలోనే గృహహింస బాధితుల నుంచి ఈ కేంద్రాలకు అనేక ఫోన్‌కాల్స్‌ వచ్చాయి.
- ప్రపంచవ్యాప్త మహిళల్లో 52 శాతం మంది మాత్రమే లైంగిక సంబంధాలు నెరపడంలో, గర్భనిరోధక ఔషధాల వినియోగంలో, ఆరోగ్య సంరక్షణలో సొంత నిర్ణయాలు తీసుకొనే స్వేచ్ఛను కలిగి ఉన్నారు. ఈ సంఖ్య మనదేశంలో మరింత తక్కువగా ఉంటుంది.
- అక్రమ రవాణాకు బలవుతున్న వారిలో బాలికలు, మహిళలు 71 శాతం మంది ఉంటే, వారిలో ప్రతి నలుగురిలో ముగ్గురు లైంగిక దోపిడీకి గురవుతున్నారు.
- కరోనా మహమ్మారి కాలంలో మహిళలపై అరాచకాలు మరింత పెరిగాయి. కోవిడ్‌ కారణంగా నెలకొన్న పరిస్థితులు మహిళల ఆరోగ్యం, రక్షణ, భద్రత వంటివాటిపై తీవ్ర ప్రభావం చూపాయి.