Oct 09,2020 14:00

హిందూపురం (అనంతపురం) : టెక్స్‌పోర్టు గార్మెంట్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. వామపక్షాల ఆధ్వర్యంలో హిందూపురం తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గార్మెంట్‌ లోని మహిళా కార్మికులు భారీ ఎత్తున బైఠాయించి శుక్రవారం నిరసన తెలిపారు. కార్మికులకు కనీస వేతనాలను ఇవ్వాలని, యాజమాన్యం పని వేధింపులను ఆపాలని, బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ.. తూముకుంట పారిశ్రామికవాడలోని టెక్స్‌పోర్ట్‌ గార్మెంట్స్‌ లో కార్మికులకు కనీస వేతనాలను చెల్లించాలని, బస్సులను ఉచితంగా ఏర్పాటు చేయాలని, బోనస్‌ పెంచాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల కడుపు కొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ సంస్థలకు ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయని, కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం నీరుగారుస్తున్నదని ఆరోపించారు. దేశంలో 40 కోట్ల మంది కార్మికులు రోడ్డుపైకి వచ్చి నవంబర్‌ 20న దేశ వ్యాప్త ఆందోళన చేపట్టాలని నరసింగరావు పిలుపునిచ్చారు.