
న్యూఢిల్లీ : తెలంగాణ అభివృద్ధి చెందేందుకు రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) కీలకపాత్ర పోషిస్తుందని, ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారిగా (ఎన్హెచ్) ప్రకటించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కోరారు. కిషన్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ బిజెపి నేతలు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను కేంద్ర మంత్రి ముందు ప్రస్తావించారు. తెలంగాణకు కేంద్రం రీజనల్ రింగ్ రోడ్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఆ ఆర్ఆర్ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు ఉందని, దీంతో వివిధ జిల్లాలకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. ఆర్ఆర్ఆర్తో బెంగళూరు-వారణాసి, విజయవాడ-ముంబై జాతీయ రహదారులను అనుసంధానం చేసే అవకాశం ఉందని, సమయం, ఇంధనం ఆదా అవుతుందని వివరించారు. కాగా, కేంద్రం ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డును 354 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్నారు. దీనికిగానూ భూ సేకరణ కింద 12 వేల ఎకరాల భూమి సేకరించాల్సిన అవసరం ఉంది. భూసేకరణకు దాదాపు రూ.3 వేల కోట్లు ఖర్చు కానున్నట్టు కేంద్రానికి సమర్పించిన డిపిఆర్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.12 వేల కోట్లు కాగా, అందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చెరిసగం భరించాలని నిర్ణయించాయి. ఈ రింగ్ రోడ్డు రాష్ట్రంలోని తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, తుర్కపల్లి, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, యాచారం, కడ్తాల్, షాద్నగర్, పరిగి, పూడూరు, చేవెళ్ల, శంకర్పల్లి మండలాల మీదుగా వెళ్లే అవకాశం ఉంది.