కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ధర్నా
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్: జిల్లాలోని ప్రభుత్వ హాస్టళ్లను ప్రారంభించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వెంకటేష్ అధ్యక్షతన కలెక్టరేట్ ముందు విద్యార్థులు ప్లేట్లు, పెట్టెలు పట్టుకొని సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడారు. విద్యాసంస్థలు ప్రారంభమై దాదాపు రెండు నెలలవుతున్నా జిల్లాలో హాస్టళ్లను ప్రారంభించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు హాస్టళ్లు ప్రారంభం కాక, దిక్కుతోచని స్థితిలో విద్యకు దూరమయ్యారని తెలిపారు. జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, స్పందించకపోవడం బాధాకరమన్నారు. జిల్లా విద్యాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్కూళ్లు, కళాశాలల తరహాలోనే హాస్టళ్లను ప్రారంభించాలని కోరారు. హాస్టల్ విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే జిల్లా మొత్తం ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షులు మధు, జిల్లా నాయకులు రామకృష్ణ, అబ్దుల్లా, వంశీ, మధు, సురేష్ పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న విద్యార్థులు