Nov 30,2020 22:42

ఆర్‌డిఒ కార్యాలయంలో ఎఒకు వినతిప్రతం అందజేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-ఆదోని: జిల్లాలో ఉన్న హాస్టళ్లను ప్రారంభించాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కోరారు. సోమవారం ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఆదోని ఆర్‌డిఒ కార్యాలయం ముందు విద్యార్థులు ధర్నా నిర్వహించి, ఎఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడారు. విద్యాసంస్థలను తెరిచినా జిల్లాలో హాస్టళ్లను ప్రారంభించక పోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హాస్టల్‌ విద్యార్థులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పట్టణ ఉపాధ్యక్షులు ఉదరు కుమార్‌, నాయకులు అమ్రేష్‌, నాగరాజు, నరేంద్ర, వరుణ్‌, సాయి పాల్గొన్నారు.
ఆలూరు : ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్ష, కార్యదర్శులు వినోద్‌, గోవర్ధన్‌ మాట్లాడారు. గతంలో విద్యార్థులు హాస్టల్‌లో ఉండి విద్యనభ్యసించేవారని, కరోనా సెలవుల తర్వాత కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమై 25 రోజులవుతున్నా హాస్టళ్లను ప్రారంభించకపోవడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. హాస్టల్‌ను ప్రారంభించి విద్యార్థులను ఆదుకోవాలని, లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు రామాంజి, అంజి, రంగస్వామి, బసవ, మహేంద్ర నాయక్‌, గర్ల్స్‌ కో కన్వీనర్‌ మహేశ్వరి, గౌరీ, మద్దతు ఇచ్చిన డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైనా పాల్గొన్నారు.