Nov 25,2020 21:13

న్యూఢిల్లీ : వ్యవసాయంలో సాంకేతికతను అభివృద్ధి చేసేందుకు విషపూరిత పురుగుమందులను ఉత్పత్తి చేసే క్రాస్‌లైఫ్‌ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఎఒ) అక్టోబర్‌ 2న ప్రకటించింది. అత్యంత విషపూరితమైన, హానికారకమైన రసాయన పురుగుమందులను వినియోగించనున్నామన్న ప్రకటనపై పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యున్నత స్థానం కలిగి ఉన్న ఐక్యరాజ్యసమితిలోని ఎఫ్‌ఎఒ ఒక కార్పోరేట్‌ సంస్థకు బలైపోతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది లక్షలాది మంది రైతులకు చెడ్డ వార్త అని, వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ఇటువంటి పురుగుమందుల వినియోగానికి యుఎన్‌ సమ్మతించడం సమంజసం కాదని అన్నారు. దీంతో భవిష్యత్‌ తరాల ఉనికి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ ఆహార వ్యవస్థలను మార్చేందుకు, గ్రామీణాభివృద్ధిని ప్రోత్సహించేందుకు అగ్రి ఫుడ్‌ సిస్టమ్స్‌లో ప్రైవేట్‌ రంగాన్ని భాగస్వామ్యం చేయనున్నట్లు వర్చువల్‌ సమావేశంలో ఎఫ్‌ఎఒ డైర్టెకర్‌ జనరల్‌ క్యూ డొంగ్యూ వెల్లడించారు. ఈ ప్రకటనపై తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ.. 63 దేశాల నుండి 350కి పైగా సంస్థలు ఈ నెల 19న ఎఫ్‌ఎఒకు ఒక లేఖను రాశాయి. క్రాప్‌ లైఫ్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ 2018లో ప్రమాదకర పురుగుమందులను వినియోగించడం ద్వారా తమ ఆదాయంలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ సంపాదించారని మిన్నియాపాలిస్‌కి చెందిన ఆధారిత ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ అండ్‌ ట్రేడ్‌ పాలసీలో సీనియర్‌ అధ్యయన వేత్త షైనీ వర్గీస్‌ తెలిపారు. అత్యల్ప, ఒక మాదిరి ఆదాయం పొందే దేశాలైన బ్రెజిల్‌, భారత్‌, థాయిలాండ్‌ దేశాల్లోని రైతులకు విక్రయించాలని, 27శాతం మాత్రమే అత్యధిక ఆదాయం పొందే దేశాలకు అమ్మడం ఎఫ్‌ఎఒ క్రాప్‌లైఫ్‌ భాగస్వామ్య ఒప్పందంలో మరో ప్రమాదకరమైన అంశమని అన్నారు. ఈ ఒప్పందంతో కార్పోరేట్‌ సంస్థలు సడలింపు నిబంధనలను తమకు అనుకూలంగా మలుచుకోవడం ద్వారా... ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, ఆసియాల్లో పురుగుమందులను అత్యధికంగా విక్రయిస్తాయని ఆమె చెప్పారు.
క్రాప్‌లైఫ్‌ సంస్థ ఉత్పత్తి చేసే అత్యంత విషపూరితమైన పురుగు మందుల (హెచ్‌హెచ్‌పిఎస్‌) వాడకంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు, గ్రామాల్లో పనిచేసే రైతు కార్మికుల ఆరోగ్యానికి ప్రమాదకరం కావచ్చని ఈ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే.. పురుగుమందుల వాడకంతో పరాగ సంపర్కానికి దోహదపడే కీటకాలు క్షీణించాయని, దీంతో జీవవైవిధ్యం, పర్యావరణం దెబ్బతిన్నాయని అన్నారు. అత్యంత ప్రమాదకర పురుగుమందుల వినియోగాన్ని నిషేధించేందుకు యుఎన్‌ కట్టుబడి ఉందని, అలాగే ప్రపంచ వ్యాప్తంగా పురుగుమందుల వలన కలిగే నష్టాలను తగ్గించడం కూడా సంస్థ ప్రాధాన్యతలలో ఒకటని ఎఫ్‌ఎఒ డైరెక్టర్‌జనరల్‌కు ఈ సందర్భంగా గుర్తు చేశారు. హానికరమైన పురుగుమందుల వాడకం స్వల్పకాలిక పరిష్కారమని, దీంతో భవిష్యత్‌ తరాల మెరుగైన ఆహారం, ఆరోగ్యం పొందే హక్కును ప్రమాదంలో పడేస్తుందని 2017 నివేదికలో.. ఆహార హక్కుపై యుఎన్‌ ప్రత్యేక రిపోర్టర్‌ వెల్లడించారు.
మరోవైపు క్రాప్‌లైఫ్‌ సంస్థ హానికర పురుగుమందులను ఉత్పత్తి చేయడంలో ప్రముఖ స్థానంలో ఉందని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే అధిక శాతం మంది రైతులు ప్రతి ఏడాది తీవ్రమైన పురుగుమందులతో అనారోగ్యం పాలవుతున్నారని ఒక అధ్యయనంలో వెల్లడైందని అన్నారు. కాన్సర్‌తో పాటు సంతానోత్పత్తి, నాడీ వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని తేలిందని ఆ లేఖలో పునరుద్ఘాటించారు.
బేయర్‌ క్రాప్‌ సైన్స్‌, కార్టెవా అగ్రిసైన్స్‌, సిజెంటా సంస్థలు క్రాప్‌లైఫ్‌ సంస్థల్లో భాగంగా ఉన్నాయి. సిజెంటా ఉత్పత్తులు పక్షవాతంతో పాటు అనేక అనారోగ్యాలకు గురిచేస్తాయని, దీంతో 2007లో ఐరోపాలో ఈ సంస్థ ఉత్పత్తులను నిషేధించారని అన్నారు. కానీ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు మాత్రం ఎగుమతి చేయబడుతుందని చెప్పారు. కార్టెవా ఉత్పత్తి అయిన క్లోర్‌ఫైరిఫోస్‌ మెదడుపై ప్రభావం చూపుతుందని, దీంతో అమెరికా, యూరప్‌తో పాటు మరో నాలుగు దేశాలలో నిషేధించారని అన్నారు. బేయర్‌ సంస్థ ఉత్పత్తి చేసే పైఫ్రోనిల్‌ ఫ్రాన్స్‌, బ్రెజిల్‌లో తేనెటీగల మరణాలకు కారణమైందని తేలిందని చెప్పారు.
ఈ సంస్థలు జన్యుపరంగా మార్పులు చేసిన విత్తనాలను తయారు చేస్తారని, ఈ విత్తనాలు రైతులను పురుగుమందుల వినియోగాన్ని పెంచుతాయని అన్నారు. దీంతో రెండు విధాల వారి మార్కెటింగ్‌ను అభివృద్ధి చేసుకునేందుకు కంపెనీలు యత్నిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. పెస్టిసైడ్స్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ ఆసియా పసిఫిక్‌ డైరెక్టర్‌, ఆ ఒప్పందంలో సంతకం చేసిన సభ్యుల్లో ఒకరైన సరోజని రెంగమ్‌ కూడా ఆ లేఖను సమర్థించారు. ఎఫ్‌ఎఒ కార్పోరేట్‌ సంస్థతో ఒప్పదం కుదుర్చుకోవడంపై పెస్టిసైడ్స్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ నార్త్‌ అమెరికా సీనియర్‌ శాస్త్రవేత్త ఆర్కియా ఇచి ఆందోళన వ్యక్తంచేశారు. ఐక్యరాజ్యసమితి ఇటువంటి ప్రతిపాదనను అంగీకరించడం సరికాదని ఆమె అన్నారు.