Nov 30,2020 21:29

గురజాడ విగ్రహానికి పూలమాల వేసి నివాళ్లు అర్పిస్తున్న జెసి వెంకట్రావు, మాజీ ఎంపి ఝాన్సీలక్ష్మి

విజయనగరంకోట : మహాకవి గురజాడ అప్పారావు స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు కృషి చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా, సంక్షేమం) జె.వెంకటరావు అన్నారు. సోమవారం గురజాడ వర్థంతి సందర్భంగా అధికారులు, పట్టణ ప్రముఖులు మహాకవికి ఘనంగా నివాళులర్పించారు. గురజాడ స్వగృహంలో ఆయన చిత్రపటానికి, విగ్రహానికి జాయింట్‌ కలెక్టర్‌ వెంకటరావు, మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి, డిపిఆర్‌ఓ డి.రమేష్‌, సాయిఫౌండేషన్‌ ప్రతినిధి కోలగట్ల శ్రావణి, గురజాడ సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధులు పి.వి.నర్సింహరాజు, డాక్టర్‌ ఎ.గోపాలరావు, కె.ప్రకాష్‌, భీశెట్టి బాబ్జీ, పలువురు ప్రముఖులు, కవులు, గురజాడ కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ రచయిత డాక్టర్‌ ఎ.గోపాలరావు రచించిన గురుజాడల గురజాడ అన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సత్య జంక్షన్‌లో గల గురజాడ విగ్రహం వరకూ మహాకవి వినియోగించిన వస్తువులతో ర్యాలీ నిర్వహించారు. అక్కడి గురజాడ కాంస్య విగ్రహాం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా జెసి వెంకటరావు మాట్లాడుతూ సాహిత్యానికి వన్నె తెచ్చిన గురజాడ, విజయనగరానికి చెందినవారు కావడం మనందరికీ గర్వకారణమని, జిల్లాకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టారని కొనియాడారు. ఆయన సాహిత్యాన్ని, జ్ఞాపకాలను పదిలపరిచి, భావితరానికి అందించేందుకు ప్రభుత్వపరంగా కషి చేస్తామని అన్నారు. మాజీ ఎంపి బొత్స ఝాన్సీలక్ష్మి మాట్లాడుతూ గురజాడ స్ఫూర్తిని కొనసాగించేందుకు, ఆయన రచనలను కళాశాల విద్యార్థులకు సైతం మరింత చేరువ చేయాలని సూచించారు. గురజాడ రచనలపై లేజర్‌షో ఏర్పాటు చేయాలని ఇప్పటికే సాంస్కతిక శాఖకు ప్రతిపాదనలు పంపించామనితెలిపారు. కోలగట్ల శ్రావణి, గోపాలరావు తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గురజాడ కుటుంబ సభ్యులు గురజాడ వెంకటేశ్వరప్రసాద్‌, ఇందిర, లలిత, ఆర్కియాలజి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ వెంకటరావు, లక్ష్మణరావు, బాలకృష్ణ తదితర కవులు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు.