Nov 30,2020 23:13

కార్యక్రమంలో మాట్లాడుతున్న పాశం రామారావు

ప్రజాశక్తి-గుంటూరు : మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, మహిళల అభ్యున్నతి కోసం గురజాడ అప్పారావు తన జీవితాంతం కృషి చేశారని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి ఎల్‌.అరుణ అన్నారు. గురజాడ వర్ధంతి సందర్భంగా సోమవారం బ్రాడీపేటలోని ఐద్వా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కె.పద్మ, అరుణ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ గురజాడ రాసిన 'కన్యాశుల్కం', 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' రచనలు నాటి సామాజిక రుగ్మతలకు అద్దం పట్టాయని, బాల్య వివాహాలు వాటి పరిణామాలను, ప్రభావాలను కళ్లకు కట్టినట్లు చిత్రీకరించారని చెప్పారు. దేశమును ప్రేమించుమన్న, మంచియన్నది పెంచుమన్న, వట్టిమాటలు కట్టిపెట్టోరు, గట్టిమేలు తలపెట్టవోరు అంటూ దేశభక్తిని ప్రేరేపించేలా రచనలు సాగించారని కొనియాడారు. ఆయన రచనలు నేటికీ ఎంతో ప్రాసంగికత ఉందని చెప్పారు. కుల, మత, ప్రాంతీయతత్వాలు చెలరెగుతున్న నేటి సమాజానికి గురజాడ రచనలు ఎంతో అవసరమని, ఆయన రచనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై.నేతాజి, ఎం.రవి, ఈమని అప్పారావు, డి.వెంకటరెడ్డి, ఎన్‌.కాళిదాసు, మహిళా సంఘం నాయకులు షకీల, కళ్యాణి పాల్గొన్నారు.