Dec 03,2021 22:24

న్యూఢిల్లీ : ఈ నెల 1న జరిగిన సిబిఎస్‌ఈ టర్మ్‌-1 సోషియాలజీ (డిసెంబర్‌ 1న జరిగిన) టెస్ట్‌లో వచ్చిన ఒక ప్రశ్న వివాదాస్పదంగా మారింది. ఫిబ్రవరి 2002లో ముస్లింలకు వ్యతిరేకంగా గుజరాత్‌ అల్లర్లు ఏ పార్టీ అధికారంలో ఉండగా జరిగాయి? అని ప్రశ్నపై దేశవ్యాప్తంగా అనేక విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రశ్నకు..ఎ.కాంగ్రెస్‌ బి.బిజెపి సి.డెమొక్రాటిక్‌ డి.రిపబ్లికన్‌..అనే ఆప్షన్లు ఇచ్చారు. ఇలాంటి ప్రశ్న, అందునా ప్రధాని మోడీ ఆరోపణలు ఎదుర్కొన్న గుజరాత్‌ అల్లర్లపై ప్రశ్న రావటం చర్చనీయాంశమైంది. ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆరోపణలు ఎదుర్కొంటున్న మత ఘర్షణల అంశంపై సీబీఎస్‌ఈ పరీక్షలో ప్రశ్న రావటం అందర్నీ ఆశ్చర్యపర్చింది. ప్రశ్నా పత్రం పేజీ ట్విట్టర్‌లో పోస్ట్‌ కూడా అయ్యింది. ప్రశ్నా పత్రం రూపొందించటంలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని సీబీఎస్‌ఈ అధికారులు చెప్పారు. సీబీఎస్‌ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రశ్నాపత్రంలో ప్రశ్న వచ్చిందని, బాధ్యులైనవారిపై కఠిన చర్య తీసుకుంటామని సీబీఎస్‌ఈ ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు.