Nov 28,2020 21:34

ఏథెన్స్‌ : పాలకుల చర్యలు, విధానాలను నిరసిస్తూ అంతర్జాతీయంగా కార్మిక లోకం ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయి. ఒకపక్క భారత్‌లో ఈ నెల 26న లక్షలాదిమంది కార్మికులు, రైతులు ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ సమ్మె చేపట్టగా, మరోవైపు గ్రీస్‌లో లక్షలాదిమంది ప్రభుత్వ రంగ కార్మికులు, ఉద్యోగులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గన్నారు. కరోనా సంక్షోభ కాలంలో చేపట్టిన విధానాలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరింత రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రైవేటు ఆస్పత్రులను జప్తు చేయాలని, ఆరోగ్య కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తీసుకోవాలని, వేతనాలు పెంచాలని కోరుతున్నారు. ఈ వారంలో గ్రీస్‌లో లక్షకు పైగా కరోనా కేసులు దాటాయి. మృతుల సంఖ్య 2వేలు దాటింది. ఉత్తర గ్రీస్‌లో ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లు కిక్కిరిసి పోయి వున్నాయి. దాంతో రోగులను ప్రత్యేక విమానం ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించారు. మిలటరీ జుంటా ప్రభావంతో ప్రభుత్వం జరుపుతున్న నిరంకుశ దాడులను వ్యతిరేకిస్తూ ఈ సమ్మె చేపట్టారు. రోజుకు 8గంటల పనిదినాన్ని రద్దు చేసే, సమ్మె హక్కును గణనీయంగా నియంత్రించే కొత్త కార్మిక చట్ట ముసాయిదాను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ సమ్మెలో డాక్టర్లు, నర్సులు, ప్రభుత్వ ఉద్యోగులు, రవాణా, డాక్‌యార్డ్‌ కార్మికులు, జర్నలిస్టులు, టీచర్లు, సాంస్కృతిక రంగ కార్మికులు అందరూ పాల్గన్నారు. ఏథెన్స్‌లో ఓడరేవులు, సబ్‌వేలు, ఎలక్ట్రిక్‌ రైళ్ళు అన్నీ స్తంభించిపోయాయి. దేశవ్యాప్తంగా ఆందోళనకారులు ఆస్పత్రుల ముందు గుమిగూడారు. ఏథెన్స్‌లో కార్మిక, ఆరోగ్య శాఖ కార్యాలయాల ముందు చిన్న చిన్న ర్యాలీలు నిర్వహించారు. ఒకపక్క ప్రజారోగ్య వ్యవస్థ అధ్వాన్నంగా తయారవుతుంటే మరోపక్క ఈ ప్రభుత్వం పెద్ద మొత్తాలను వ్యాపార వాణిజ్య కార్యకలాపాల్లో పెడుతోందని, ప్రభుత్వ అణచివేత చర్యలను పెంచుతోందని విమర్శించారు. చివరి నిముషంలో ప్రభుత్వం కోర్టుకు వెళ్ళి ఇంజక్షన్‌ ఉత్తర్వులు తెచ్చుకోవడంతో పౌర విమానయాన రంగంలో సమ్మె నిలిచిపోయింది. మితవాద కన్జర్వేటివ్‌ న్యూ డెమోక్రసీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ గత కొద్ది నెలలుగా కార్మికులు, విద్యార్ధులు, యువత అందరూ నిరసన బాట చేపట్టారు. నవంబరు మధ్యలో ఆస్పత్రి సిబ్బంది నిరసన కార్యాచరణ చేపట్టారు. గ్రీక్‌ కార్మికవర్గం, యువత చేస్తున్న సమ్మెలు, నిరసన కార్యాచరణలు ఛాందసవాద రాజకీయ చర్యలను ప్రశ్నిస్తున్నాయి. గ్రీస్‌లో ఇటీవల కాలంలో సమ్మెలు ఎక్కువయ్యాయి. ఒత్తిడి పెరిగినప్పుడల్లా వారు ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తున్నారు. కరోనా పరిస్థితి చాలా తీవ్రంగా వున్నప్పటికీ డిసెంబరు 7 నుండి లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్కూళ్ళను ప్రారంభించాలని చూస్తున్నారు. గత పదేళ్ళ కాలంలో ఇయు ఆదేశిత పొదుపు చర్యలతో తీవ్రంగా దెబ్బతిన్న గ్రీస్‌సమాజం ఈ కరోనా సెకండ్‌ వేవ్‌తో మరింత నాశనమైంది.