Sep 20,2021 00:54

రోడ్డు పక్కనే వేసి ఉన్న గ్రావెల్‌

ప్రజాశక్తి-సామర్లకోట రూరల్‌
కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలిక ఊడిపోయిందన్న సామెత చందంగా సామర్లకోట మండలం వేట్లపాలెం-హుస్సేన్‌పురం కెనాల్‌ రోడ్డు మరమ్మతుల పరిస్థితి మారిందని చెప్పవచ్చు. సామర్లకోట సుగర్‌ ప్యాక్టరీ నుంచి మొదలుకుని మండలంలోని హుస్సేన్‌పురం, వేట్లపాలెం, జి.మేడపాడు, పెదబ్రహ్మదేవం వరకూ సుమారు 12 కిలోమీటర్ల మేర కెనాల్‌ రోడ్డు పూర్తిగా ద్వంసమైన విషయం పాఠకులకు విదితమే. సుమారు నెల రోజుల క్రితం మండలంలోని హుస్సేన్‌పురం గ్రామం వద్ద రోడ్డుపై రిపేర్ల కోసం గ్రావెల్‌ గుట్టలు వేసి ఆర్‌ అండ్‌ బి అధికారులు వేసారు. రిపేర్లు చేపట్టకపోగా, గుట్టలు అలా ఉండిపోవడంతో రాత్రి వేళ ద్విచక్ర వాహనదారులు గుట్టపైకి చూసుకోకుండా వెళ్ళి ప్రమాదాల బారిన పడుతున్నారు. భారీ వాహనాలు సైతం ప్రమాదాలకు గురువుతున్నాయి. ఒకవైపు వర్షం నీరు గోతుల్లో చేరి కనిపించక వాహనదారులు ఇబ్బందులకు లోనవుతుండగా, రాత్రి వేళ ఈ గ్రావెల్‌ గుట్టలు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే శిథిల రహదారి, ఆపై వీటి వల్ల ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు, స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికే సంబందిత అధికారులు స్పందించి భారీ ప్రమాదాలు సంభవించకముందే కనీసం కెనాల్‌ రోడ్డుకు తాత్కాలిక రిపేర్లు నిర్వహించాలని ఆయా గ్రామాల ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.