Dec 02,2021 19:50

పిల్లలూ, ఈ జీవిని చూస్తుంటే పాము శరీరానికి పెద్ద గరాటు అతికించినట్టుగా ఉంది కదూ! ఆ పెద్ద నోరే దీనికి ప్రత్యేకతని తెచ్చి పెట్టింది. అందుకే సముద్రంలో ఉండే కోట్ల జీవుల్లో అత్యంత వింతైన వాటిలో ఒకటిగా నిలిచింది. 600 రకాలైన ఈల్‌ చేపల్లో ఇది ఒకటి. నోటి ఆకారం వల్ల దీనికి 'అంబరిల్లా మౌత్‌ గల్పర్‌' అని పేరు పెట్టారు. అంటే 'గొడుగు మూతి ఈల్‌ ' అని పిలుచుకోవచ్చు.
దీనికి నోరు పెద్దదే గానీ నోట్లో చాలా చిన్న పళ్లు. కొన్నింటికి పళ్లు అసలు ఉండవు. అందుకే ఇది ఆహారాన్ని నమలలేదు. అమాంతం మింగేస్తుంది. అందుకే నోరు పెద్దగా సాగి ఇలా గరాటులా మారింది. దానిలో పట్టినంత వరకు చేపల్ని, ఇతర సముద్ర జీవుల్ని మింగేస్తుంది. దాని కింది దవడ పెద్ద సంచిలా ఉంటుంది. అందుకే ఈ నోటినే అది వలలా ఉపయోగించుకుంటుంది. చిన్న చేపలు, రొయ్యలు, గుంపులుగా వెళుతున్నప్పుడు వాటి మధ్యలో దూరిపోయి, ఈదుకుంటూ నోట్లోకి రాగానే మింగేస్తుంది. ఇవి వేగంగా ఈదలేవు.
దీని పొడవాటి సన్నటి తోకకి చివర గులాబి లేదా ఎరుపు రంగులో వెలుగులు విరజిమ్ముతుంది. ఆ తోకను చేపలు వస్తున్న వైపుగా పెట్టి పక్కనే కాపు కాస్తుంది. ఆ చేపలు దగ్గరికి వచ్చినప్పుడు వాటిని పట్టుకుని తింటుంది. దీని పొట్ట భాగం చూడటానికి సన్నగా కనిపిస్తున్నా.. తినే ఆహారాన్ని బట్టి సాగిపోతుంది. సముద్రం అట్టడుగున సుమారు 6,500 అడుగుల లోతున జీవిస్తాయి. ఇవి సుమారు ఆరడుగుల పొడవు పెరుగుతాయి. అయితే వీటిలో చాలా చేపలు సంతానోత్పత్తి జరిపిన తరువాత చనిపోతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.