Jun 13,2021 08:27
  • ఫొటోగ్రాఫర్‌ సతీష్‌కు పలువురి అభినందనలు

ప్రజాశక్తి-కాకినాడ : గ్రామీణ జీవనశైలి చిత్రాలకు అంతర్జాతీయ అవార్డు దక్కింది. అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ ఫొటోగ్రాఫిక్‌ ఎలియన్స్‌ సంస్థ ప్రతేడాది నిర్వహించే పురస్కారాలకు.. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన ఫొటోగ్రాఫర్‌ ముమ్మిడి సతీష్‌ మార్చిలో 12 చిత్రాలతో కూడిన గ్రామీణ జీవనశైలి అనే అంశంపై డాక్యుమెంటరీలు పంపారు. నలుపు, తెలుపు విభాగాల్లో పంపిన ఛాయా చిత్రాలకు అసోసియేట్‌షిప్‌ అంతర్జాతీయ గౌరవ పురస్కారం ప్రకటించింది. ఆ సంస్థ చైర్మన్‌ టోనీలికెమ్‌తాన్‌ ఈ- మెయిల్‌ ద్వారా ముమ్మిడి సతీష్‌కు అభినందనలు తెలిపారు. గౌరవ పురస్కారాల సర్టిఫికెట్‌ను ఈ- మెయిల్‌ ద్వారా పంపారు. ఈ ఏడాది ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించే అంతర్జాతీయ ఫొటోగ్రఫీ సంబరాల్లో ఈ అవార్డును సతీష్‌ అందుకోనున్నారు. ఈ సందర్భంగా సతీష్‌ను పలువురు అభినందించారు.