Mar 02,2021 21:17

ప్రజాశక్తి - పెదపాడు
             సిఎం జగన్‌ ప్రవేశపెడుతున్న ప్రతీసంక్షేమ పథకాన్ని అర్హతున్న అందరికీ అందిస్తామని కొక్కిరపాడు పంచాయతీ సర్పంచి మరీదు రెడ్డియ్య అన్నారు. నూతన సర్పంచిగా ఎన్నికైన ఆయనను గ్రామవాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, ఆశాలు, ఎఎన్‌ఎంలు మంగళవారం వేంపాడు సచివాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రెడ్డియ్య మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. ఇప్పటికే నవరత్నాలకు మించి పథకాలను జగన్‌ అమలు చేశారన్నారు. వాలంటీర్లు సమన్వయంతో పనిచేసి ఈ పథకాలను ప్రతిఅర్హునికీ అందేలా చూడాలన్నారు. ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. అలాగే సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తన విజయానికి సహకరించిన, కృషి చేసిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గౌడసంఘం మండల అధ్యక్షులు, వైసిపి నేత పామర్తి గంగాధర్‌ మాట్లాడుతూ అందరూ సమన్వయంతో పనిచేసి పంచాయతీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రెడ్డియ్య విజయానికి కృషి చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ అనిల్‌ మాట్లాడుతూ మంచి వ్యక్తిత్వం కలిగి, అన్ని విషయాలూ తెలిసిన వ్యక్తి రెడ్డియ్య అని, ఆయన పంచాయతీ సర్పంచి కావడం ఆనందంగా ఉందన్నారు. గ్రామాభివృద్ధిపై ఆయనకు మంచి పట్టుఉందని, ఎల్లవెళలా ఆయనకు సహకరిస్తూ తమ విధులను నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు సజిత, స్వాతి, స్వామి, ఇతర సిబ్బంది, వాలంటీర్లు, వ్యవసాయాధికారులు, ఎఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, విఆర్‌ఒలు, వార్డు సభ్యులు, వైసిపి నేతలు, ప్రజలు పాల్గొన్నారు.