Oct 14,2021 18:12

పనాజీ : వచ్చే సంవత్సరం జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో, 2024లో జరిగే లోక్‌ సభ ఎన్నికల్లోనూ తన పార్టీ కచ్చితంగా గెలుస్తుందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. గోవా ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమితులైన చిదరంబరం... పనాజీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ' చరిత్ర నుండి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నారు. గోవాలో ఎవరు గెలుస్తారో.. లోక్‌సభ ఎన్నికల్లో వారే విజయం సాధిస్తారు. 2007లో గోవాలో తమ పార్టీ గెలిచింది. 2009లో సార్వత్రిక ఎన్నికల్లో కూడా మనమే గెలుపొందాం. 2012లో మేము గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయాం. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడిపోయాం. 2017లో పార్టీ కార్యకర్తలు గెలిచినప్పటికీ... కానీ శాసన సభ్యులు ఓటమి చెందారు. 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓడిపోయింది' అని చెప్పారు. ఈ సమయంలో పార్టీ ధైర్య సాహాసాలతో ముందుకు సాగాలని, 2022 గోవా ఎన్నికల్లో గెలిస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం మనదేనంటూ పార్టీ కార్యకర్తల్లో ఉత్తేజాన్ని నింపేందుకు ప్రయత్నించారు.
' చరిత్ర మనదే. ఒక ప్రతిష్టాత్మకమైన రోజున ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు మన పార్టీ కార్యాలయాన్ని మాజీ ముఖ్యమంత్రి ప్రతాప్‌ సింగ్‌ రాణె ప్రారంభించారు.' అని కార్యకర్తలనుద్దేశించి వ్యాఖ్యానించారు. పరిశ్రమలు, పాఠశాలలు, కాలేజీలు, రోడ్లు వంటి రంగాల్లో అభివృద్ధి, పురోగతి, గోవా ముందుకు సాగితేనే సువర్ణ అధ్యాయాలు గుర్తుంటాయని అన్నారు. మరోసారి సువర్ణ అధ్యాయంలోకి వెళ్లాలని, అందుకు 2022 నాంది కావాలని అన్నారు. ధైర్య, సాహసాలతో ముందుకు సాగాలని పేర్కొన్నారు. గోవా అనేది కొన్ని రాజకీయ పార్టీల వలస రాజ్యం కాదని అన్నారు. గోవా ప్రజలతో పాలన సాగాలని, గోవా అక్కడి ప్రజలచేత, ప్రజలతో, ప్రజల కోసం ఏర్పడిందని పేర్కొన్నారు. ఇటీవల తృణమూల్‌ గూటికి చేరిన మాజీ కాంగ్రెస్‌ చీఫ్‌ లుయిజిన్హో ఫలీరో గురించి మాట్లాడుతూ.. పార్టీ తమ నేతల అసలు స్వరూపాన్ని రాష్ట్రం ముందు ఉంచిందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌లో యువత, ముఖ్యంగా మహిళలు, మత్స్యకారులు, షెడ్యూల్‌ తెగలు, దళితులు గోవాను పాలించనున్నారని చెప్పారు.
2017లో 40 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 17 సీట్లను గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించిన కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైంది. బిజెపి, కొన్ని స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు కేవలం నలుగురే.