Dec 04,2021 03:15

పర్యటిస్తున్న జివిఎంసి కమిషనర్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం: గంగుల గెడ్డలోని వ్యర్ధాలను తొలగించాలని జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి.లక్ష్మిశ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా 4వ జోన్‌లోని 31వ వార్డు పరిధిలో ప్రకాష్‌రావు పేట, కనకాల వీధి, ఎస్‌బిఐ. కాలనీ, అబ్బాస్‌ కాలనీ తదితర ప్రాంతాలలో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ, గంగుల గెడ్డలోని వ్యర్ధాలను తొలగించాలని, గెడ్డకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని పార్కుగా మార్చాలని తెలిపారు. గెడ్డ పక్కన ఉన్న దోభీ ఖానాను శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు. గంగుల గెడ్డకు రీటైనింగ్‌ వాల్‌, ర్యాంపు నిర్మించాలని స్థానిక ప్రజలు అడగ్గా వార్డు అభివృద్ధి పథకంలో పొందుపరచి ప్రణాళిక ప్రకారం చేయడం జరుగుతుందని తెలిపారు. కనకాల వీధిలో చెత్తను తొలగించాలని శానిటరీ ఇన్స్పెక్టర్‌ ను ఆదేశించారు. మురుగునీటి, కాలువలు, రహదారుల మరమ్మత్తులు చేపట్టాలని స్థానికులు తెలిపారు. ముందుగా 120 కుటుంబాలకు చెత్త డబ్బాలు ఇస్తామని, రోడ్లు, కాలువలు త్వరలోనే మరమ్మతు చేపడతామని కమిషనర్‌ తెలిపారు. చాకలిపేటలో దుకాణదారులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్‌ కెఎస్‌ఎల్‌ శాస్త్రి, జోనల్‌ కమిషనర్‌ బి.వి.రమణ, పర్యవేక్షక ఇంజినీర్‌ శివప్రసాద్‌ రాజు, కార్యనిర్వాహక ఇంజినీరు రత్నాలరాజు, ఎఎంఒహెచ్‌-2 కిషోర్‌ పాల్గొన్నారు.