Oct 27,2021 08:18
  • ఐఐటిలో సీట్ల పంట
  • గిరిజన గురుకుల చరిత్రలో రికార్డులు

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : వారు అడవి బిడ్డలు. కొండ కోనల్లో కష్టాలే పాఠాలుగా నేర్చుకేనే వారు! వీరిలో కొందరి తల్లితండ్రులు అటవీ ఉత్పత్తులను గ్రామగ్రామాన తిరిగి అమ్ముతుంటే, మరికొందరు కూలీనాలితో రెక్కలను ముక్కలు చేసుకుంటున్నారు. ఉన్న ప్రాంతం నుండి పాఠశాలకు వెళ్లాలంటేనే 10, 15 కి.మీలు నడిచి వెళ్ళాల్సిన స్థితి. మధ్యలో ఏ వాగో వంకో పొంగితే ఆ రోజుకి అంతే! ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నత విద్య గురించి ఆలోచించడమే కష్టం. దీనికి తోడు కరోనా కష్టాలు.. అయితే, ఏం ఆ గిరి పుత్రులు మహాద్భుతాన్ని సాధించారు. ఐఐటిలో ఆలిండియా ర్యాంకుల పంట పండించారు. గిరిజన గురుకుల చరిత్రలోనే రికార్డు సృష్టించారు. ఏకంగా 9 ర్యాంకులు సాధించారు. వీరంతా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని మంగళవారం కలిశారు. తమ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించేందుకు అవసరమైన ఉన్నత విద్య కోర్సులను చదువుతామని చెప్పారు. ఈ సందర్భంగా సిఎం వారిని అభినందించారు. ర్యాంకర్లకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. అనంతరం ప్రజాశక్తితో మాట్లాడుతూ తమ మనోభావాలను పంచుకున్నారు.
 

                                                  పదికిలోమీటర్లు నడిచి బడికి వెళ్లా :

''నాకు ఆలిండియా ఐఐటి ఎస్టి ర్యాంకులో 333వ ర్యాంకు వచ్చింది. మాక్‌ కౌన్సిలింగ్‌లో ఐఐటి జోధ్‌పూర్‌, సిఎస్‌ఇలో సీటు వచ్చింది. మాది విజయనగరంజిల్లా, రామాద్రిపురం మండలం, కొటక్కి గ్రామం. నా తల్లిదండ్రులు కళావతి, సత్యనారాయణ నిరక్షరాస్యులు. వెదురు బుట్టలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. వారికి వచ్చే ఆదాయంతో నన్ను చదివించలేకపోతే నా అమ్మమ్మ దేవుడమ్మ తనకు వచ్చే పెన్షన్‌ డబ్బులు ఇచ్చేది. 1 నుండి 5 వరకు 10 నుండి 15కిలోమీటర్లు నడుస్తూ పాఠశాలకు వెళ్లాల్సి వచ్చేది. 6వ తరగతి నుండి పార్వతీపురంలోని స్కూల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ గిరిజన గురుకులం పాఠశాలలోనే చదువుకుంటున్నాను. పదో తరగతిలో 9.8 పాయింట్లు, ఇంటర్‌లో వెయ్యికి 984మార్కులు వచ్చాయి. నా ఉపాధ్యాయులు ఐఐటి చదివితే బాగుంటుందని చెప్పగా, వారి సహాయ, సహకారాలతో చదువుకుని ఆలిండియా ర్యాంకు సాధించాను. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ను అవ్వాలనేది నా కోరిక''

                                                                                                                  - పార్ధసారధి
 

                                                            ఐఎఎస్‌ చదువుతా

ఆలిండియా ఐఐటి ఎస్టి ర్యాంకులో 409వ ర్యాంకు వచ్చింది. మాక్‌ కౌన్సిలింగ్‌లో ఐఐటి తిరుపతి, సిఎస్‌ఇలో సీటు వచ్చింది. మాది శ్రీకాకుళంజిల్లా, బత్తిలి గ్రామం. తల్లి సుజాత ప్రైవేటు స్కూల్లో ఆయా, తండ్రి రోజువారి కూలి. దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తిచేశాను. ఇంటర్మీడియెట్‌లో సీతంపేటలోని గిరిజన గురుకులం సూపర్‌-60 రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలో సీటు వచ్చింది. బిటెక్‌ చదువుతూనే సివిల్స్‌కు సిద్దపడతాను. ఐఎఎస్‌ అయ్యి మా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. ఎంతో మంది చదివించేవారు లేక బాలకార్మికులుగా మారుతున్నారు. వారందరికీ ఉచిత విద్యను అందిస్తా''

                                                                                               - బిడ్డిగ ఉదయ్

                                                  వర్షాలు పడితే ఏరు దాటాలి...
''ఆలిండియా ఎస్టి ర్యాంకుల్లో 596వ ర్యాంకు వచ్చింది. మాక్‌ కౌన్సిలింగ్‌లో ఐఐటి కాన్పూర్‌, ఎలక్ట్రికల్‌లో సీటు వచ్చింది. మాది విశాఖజిల్లా, అనంతగిరి మండలం, కోటపర్తివలస గ్రామం. నా తండ్రి దాలిబాబు సాధారణ రైతు, తల్లి సింహాచలం ఇంటి వద్దే ఉంటుంది. మాది బాగా వెనుకబడిన గ్రామం. వర్షాలు పడితే ఏరు దాటాల్సిన పరిస్థితులు ఉండవు. కరెంటు ఉండదు, సెల్‌ఫోన్‌కు సిగల్‌ ఉండదు. రాత్రిపూట సిగల్‌ కావాలంటే 5కిలోమీటర్లు వేరే ప్రాంతానికి చీకట్లో వెళ్లాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఐఐటి సీటు సాధించాలనే పట్టుదలతో మా మేనమామ డోలే ఈశ్వరరావు(గణితం ఉపాధ్యాయుడు) కొండకరకంలో ఉంటారు. అక్కడ ఉండి చదువుకుని ర్యాంకు సాధించాను. ఐఎఎస్‌ కావాలనేది నా లక్ష్యం. మా ప్రాంతంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించి, గ్రామంలో మంచి రోడ్లు, నీటి సదుపాయం, ఆసుపత్రి కట్టించాలనేది నా ధ్యేయం''

                                                          - దాడి వరలక్ష్మీ

           ఉపాధ్యాయుల సహకారం.. ర్యాంకులకు నిదర్శనం - శ్రీకాంత్‌ ప్రభాకర్‌, టిడబ్ల్యుఆర్‌ఇఐఎస్‌ కార్యదర్శి
'ఉపాధ్యాయుల నిరంతర శ్రమ, వారి సహకారం వల్లే ఆలిండియా ర్యాంకులు సాధించగలిగామని టిడబ్ల్యుఆర్‌ఇఐఎస్‌ కార్యదర్శి శ్రీకాంత్‌ ప్రభాకర్‌ చెప్పారు. 'ఆన్‌లైన్‌ క్లాసులను సమర్థవంతంగా, ప్రత్యేకమైన ప్రణాళికతో నిర్వహించాం. ముఖ్యమైన పాఠాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలిగాం. 2014లో ఒక్క ర్యాంకు మాత్రమే వచ్చింది. ప్రభుత్వ సహాయ, సహకారాలతో గిరిజన గురుకులం చరిత్రలో 9 ఐఐటి ర్యాంకులు ఇదే తొలిసారి' అని ఆయన అన్నారు. వీరితో పాటు జి భాను ప్రసాద్‌(ర్యాంకు:662), జె లిఖితసాగర్‌(ర్యాంకు:721), ఎస్‌ జీవన్‌ వరప్రసాద్‌(ర్యాంకు:786), ఎన్‌ శేషారెడ్డి (ర్యాంకు:914), జి అమరేంద్ర(ర్యాంకు:986), వి మన్మధరావు(ర్యాంకు:991) ర్యాంకులను సాధించారు.