May 18,2021 22:53

అక్రమణకు గురైన భూమి

నర్సీపట్నం టౌన్‌ : నర్సీపట్నం మండలం గబ్బాడ పరిధి సర్వే నెంబర్‌ 71/1లో గల 3.85 ఎకరాల వివాదస్పదమైన భూమిని అసైన్‌మెంట్‌ ల్యాండ్‌గా నిర్ధారిస్తూ నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ నారపురెడ్డి మౌర్య ప్రకటించారు. గ్రామ రెవెన్యూ పరిధిలో గల భూమిని కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై రికార్డులను తారుమారు చేసి జిరాయితీ భూమిగా నమోదు చేయించుకున్నారు. పట్టాదారు పాసు పుస్తకాలు కూడా చేయించుకున్నట్లు గ్రామానికి చెందిన పలువురు నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నర్సీపట్నం సబ్‌ కలెక్టర్‌ క్షేత్రస్థాయిలో భూమిని పరిశీలించారు. దానికి సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. నర్సీపట్నం తహశీల్దార్‌ కార్యాలయంలో రికార్డుల ప్రకారం అతుకుబడి (అసైన్మెంట్‌) భూమిగా నిర్ధారణ చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు కొనుగోలు చేసిన వారికి, అమ్మినవారికి నోటీసు జారీచేయాలని సబ్‌ కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ భూమిని ప్రభుత్వ పరం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.