Nov 25,2021 21:09

సుప్రీంకు తెలిపిన కేంద్రం
న్యూఢిల్లీ : 
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను (ఇడబ్ల్యూఎస్‌) గుర్తించడానికి నిర్దేశించిన ఏడాదికి రూ.8 లక్షల ఆదాయ పరిమితిపై పున: పరిశీలిస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం గురువారం తెలియజేసింది. అఖిల భారత కోటా (ఎఐక్యూ)లో ఒబిసిలకు 27 శాతం, ఇడబ్ల్యూఎస్‌కు 10 శాతం కోటా కల్పిస్తూ జులై 29న కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌ను నీట్‌ విద్యార్థులు సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌పై సుప్రీం విచారణ చేపట్టింది. ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ల అర్హత పొందేందుకు మీరు విధించిన రూ.8లక్షల వార్షిక ఆదాయ పరిమితికి ఏదో ఒక ప్రాతిపదిక కానీ, అధ్యయన రిపోర్టు కానీ ఉండాలి కదా. ఏమీ లేకుండా దీనిని ఎలా నిర్ణయించారు? జనాభా పరమైన అధ్యయనం, డేటా ఏమైనా పరిగణనలోకి తీసుకున్నారా? ఏమీ లేకుండా ఈ అంకెను ఎలా నిర్ధారించారు? ఏ అధ్యయనం లేకుండా మీరు నిర్ణయించే పరిమితిని కోర్టు ఎందుకు కొట్టివేయకూడదు? అంటూ సుప్రీం ధర్మాసనం ప్రభుత్వాన్ని నిలదీసింది. అక్టోబరు7న జరిగిన విచారణ సందర్భంగా దీనికి సంబంధించిన గణాంకాలు, వివరణలను అఫిడవిట్‌ రూపంలో తెలియజేస్తానని కోర్టుకు తెలిపింది. ఇడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్‌ చెల్లుబాటుకు సంబంధించిన కేసు ఇప్పటికే విస్తృత ధర్మాసనం ముందు ఉన్నందున సుప్రీం కోర్టు సంధించిన ఈ ప్రశ్నలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. సర్వోన్నత న్యాయస్థానం రూ.8 లక్షల ప్రాతిపదికకు సంబంధించి ఇంతకుముందు విచారణ సందర్భంగా కూడా పలు ప్రశ్నలు లేవనెత్తింది. గురువారం ప్రభుత్వం ఇచ్చిన వివరణను జస్టిస్‌ డివై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం సత్వర ఉత్తర్వులో నమోదు చేసింది. దీనిపై తదుపరి విచారణను 2022 జనవరి 6కి వాయిదా వేసింది. గురువారం విచారణకు కేంద్రప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కెఎం నట్రాజ్‌ హాజరయ్యారు. ఏడాదికి రూ.8 లక్షల ఆదాయ పరిమితిని పున్ణపరిశీలించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సుప్రీంకోర్టుకు వారు తెలిపారు.