Nov 16,2020 07:23

ఏం చేస్తుంటావు
అడిగాడొక తలపండితుడు
మనుషుల్ని చదువుతుంటా నన్నాను
నన్ను కూడానా? అన్న ప్రశ్న
పువ్వును చదవాలంటే
తీగ గూర్చి తెలుసుండాలి
తీగను చదవాలంటే
బొడ్డు పేగు జ్ఞానం ఉండాలి
బొడ్డు పేగు పరంపర విద్య కొరకు
విత్తుని మరిచి పోలేను
విత్తును విద్యుద్దీకరించాలంటే
మట్టి వాసన తెలిసుండాలి!

కళ్ళు విప్పార్చి ఇంతకీ తెలుసుకున్నావా
ఎవరు నువ్వు? విజ్ఞుడి వాకబు
అదిగో మట్టిలో కనిపించని రేణువు
అది నేనే
అంటే సమస్తం నువ్వేనా- చివరి ప్రశ్న
నేను తల దించుకున్నాను!
 

- ఈత కోట సుబ్బారావు
94505 29785