Jan 15,2022 09:22
  • యుపిలో దోపిడీని అంతమొందిస్తాం : స్వామి ప్రసాద్‌ మౌర్య
  • యోగి లెక్కల టీచర్ని పెట్టుకుంటే మంచిది : అఖిలేష్‌

లక్నో : ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంపై అసంతృప్తితో ఆ పార్టీకి రాజీనామాలు చేసిన రెబల్‌ నేతలు శుక్రవారం సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. వీరిలో ఇద్దరు మాజీ మంత్రులు, ఐదుగురు మాజీ ఎంఎల్‌ఎలు ఉన్నారు. ఒబిసి ఓటర్లపై వీరికి పట్టు వుండడం అఖిలేష్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది.
 

                                                        యోగి 'కిచిడి' విన్యాసాలు

ఎన్నికలు జరిగేందుకు నెల రోజులు కూడా వ్యవధి లేని సమయంలో ఈ వారంలోనే పది మంది ఎంఎల్‌ఎలు (11వ ఎంఎల్‌ఎ మిత్రపక్షం అప్నాదళ్‌ నుండి) రాజీనామాలు చేయడంతో ముఖ్యమంత్రి, ప్రభుత్వం, బిజెపి సంకటంలో పడ్డాయి. రాష్ట్రంలోని వెనుకబడిన కులాలు, వర్గాల సమస్యలను బిజెపి ప్రభుత్వం విస్మరించిందని, అందుకే తాము వైదొలగాల్సి వస్తోందని గత మూడు రోజులుగా రాజీనామాలు చేసిన ఒబిసి నాయకులంతా ఒకే రీతిలో విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వర్గాలను ఆకట్టుకునేందుకు సిఎం యోగి ఆదిత్యనాథ్‌ గోరఖ్‌పూర్‌లో ఒక దళితుడి ఇంట్లో భోజనం చేస్తూ ఫొటోలకు పోజులిచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ పాలనలో సామాజిక దోపిడీనే వుంటుందని, సామాజిక న్యాయం కాదని అన్నారు.
 

                                       దోపిడీ నుండి యుపికి విముక్తి కల్పిస్తాం : మౌర్య

సమాజ్‌వాదీలో చేరిన తర్వాత స్వామిప్రసాద్‌ మౌర్య మాట్లాడుతూ, ''బిజెపిని అంతమొందించడానికి సమర శంఖం పూరించాం. దేశ, రాష్ట్ర ప్రజల కళ్లల్లో దుమ్ము కొట్టి వారిని దోపిడీచేస్తున్న యోగి ప్రభుత్వాన్ని సాగనంపుతాం. దోపిడీ నుంచి యుపికి విముక్తి కల్పిస్తాం.'' అని పేర్కొన్నారు. 2017లో యాదవులు, ముస్లింలపై అఖిలేష్‌ యాదవ్‌కు గట్టి పట్టు వున్నందున యాదవేతర ఒబిసి కులాలపై విజయం సాధించడం బిజెపి వ్యూహంగా వుంది. ఈనాడు, యాదవేతర ఒబిసి నేతలను తన వైపునకు తిప్పుకోవడం సమాజ్‌వాదీ నేత లక్ష్యంగా వుంది.
 

                                                                80 వర్సెస్‌ 20 !

80శాతం మంది మద్దతుదారులు ఒకవైపు, 20శాతం మద్దతుదారులు మరోవైపు వున్నారని గత వారంలో సిఎం యోగి చేసిన వ్యాఖ్యలను అఖిలేష్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. సిఎం అన్న మాటలను తిప్పికొడుతూ బిజెపికి 20శాతం సీట్లు వస్తాయి, మిగతా 80 శాతం సమాజ్‌వాదీ పార్టీకి వస్తాయని బిజెపి చెబుతోందని వ్యాఖ్యానించారు. యుపిలో నాల్గింట మూడొంతుల సీట్లను బిజెపి గెలుచుకుంటుందన్న వ్యాఖ్యలపై అఖిలేష్‌ స్పందిస్తూ, వారికి మూడో నాలుగో సీట్లు వస్తాయని దీని అర్థమని అన్నారు. ముఖ్యమంత్రి ఒక లెక్కల టీచరును పెట్టుకుంటే మంచిదని వ్యాఖ్యానించారు.
29 మందితో ఎస్‌పి-ఆర్‌ఎల్‌డి మొదటి జాబితా
 

                                                    జాట్‌లు, ముస్లింలకే ప్రాధాన్యత

సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఎస్‌పి, ఆర్‌ఎల్‌డి అలయన్స్‌) కూటమి 29మంది అభ్యర్థులతో మొదటి జాబితా విడుదల చేసింది. ఇందులో జాట్‌లు, ముస్లింలే ఎక్కువగా వున్నారు. వీరిలో 19మంది అభ్యర్థులు ఆర్‌ఎల్‌డికి చెందినవారే. ఇందులో తొమ్మిది మంది ముస్లిములు కాగా, ఆరుగురు జాట్‌ అభ్యర్థులు వున్నారు. దళితుల కోసం రిజర్వ్‌ చేసిన సీట్లలో మరో ఏడుగురిని నిలబెట్టారు. ఇద్దరు గుజ్జార్‌ అభ్యర్థులుండగా, ముగ్గురు బ్రాహ్మిన్లు, థాకూర్‌, సైని (ఒబిసి)లు ఒక్కొక్కరు చొప్పున జాబితాలో ఉన్నారు. బుధవారం బిజెపికి రాజీనామా చేసిన సీనియర్‌ గుజ్జార్‌ నేత, మాజీ ఎంపి, మీరాపూర్‌ సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ అవతార్‌ సింగ్‌ బాదనా ఆర్‌ఎల్‌డి టిక్కెట్‌పై జేవార్‌ నుండి పోటీ చేయనున్నారు. కాంగ్రెస్‌ను వీడి ఆర్‌ఎల్‌డిలో చేరిన మాజీ ఎంఎల్‌ఎ గజరాజ్‌ సింగ్‌ రిజర్వ్‌ హర్పూర్‌ సీటు నుంచి పోటీ చేస్తారు. ఇటీవలే తన తండ్రితో కలిసి సమాజ్‌వాదీలో చేరిన జాట్‌ నేత, మాజీ ఎంఎల్‌ఎ పంకజ్‌ మాలిక్‌ ముజఫర్‌నగర్‌లోని ఛర్తావాల్‌ నుండి బరిలోకి దిగుతున్నారు.
 

                                              2,500 మందిపై యుపి పోలీసుల కేసు

సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి) కార్యాలయం ముందు కోవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ గుర్తు తెలియని 2,500 మందిపై ఉత్తరప్రదేశ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇద్దరు మాజీ మంత్రులతోపాటు అనేక మంది బిజెపి ఎమ్మెల్యేలు పార్టీలో శుక్రవారం చేరిన సమయంలో ఎస్‌పి కార్యాలయానికి భారీగా కార్యకర్తలు చేరుకున్నారు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఈ నెల 15 వరకూ ర్యాలీలు, రోడ్‌ షోలు, సమావేశాలను ఎన్నికల కమిషన్‌ నిషేధించింది.