Oct 18,2020 10:34

మాటకు విలువనిచ్చి
మనిషిని మనిషిగా గుర్తించి
ఆధిపత్యాల, అణచివేతల, దోపిడీల,
దుర్మార్గాల
మార్గాన్ని అందరికీ తెలియజెప్పి
భుజమ్మీది చేయిలా
పక్కనే నిలబడింది ఎర్రజెండా

ఎర్రజెండా అంటే
మనిషికి మమతలు నేర్పే అమ్మ
ఉన్నవాడి దోపిడీని ప్రశ్నించే నిజం
లేనివాడి కోసం నిల్చునే న్యాయం.

కూడూ, గూడూ, గుడ్డ
అందరి హక్కని గొంతెత్తే ఉద్యమం
రాళ్ళెత్తే కూలీలు, శ్రమించే శ్రామికులు,
నాగలిపట్టిన రైతుల
సహస్ర వృత్తుల, సమస్త 'చిహ్నాల' కోసం
తపించే ఆత్మీయ గళం

ఇన్నాళ్ళ కాలంలో
ఎర్రజెండా లేకపోతే
లోకాన్ని, కాలాన్ని ఊహించలేం
ఇవాల్టి మన బతుకుల హక్కులు
ఎర్రజెండా సాధించిపెట్టిన కానుకలు
ప్రశ్నించడం, పోరాడటం, మనిషికోసం
తపించడం
ఎర్రజెండా నేర్పించి వుండకపోతే
ఏమైపోయేదో ఈ లోకం!

డాక్టర్ శిలాలోలిత

9391338676