
* రాష్ట్రంలో పరిషత్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఉదయం 7గంటల నుండి మధ్యాహ్నం 3గంటల వరకు 47.42శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 7,220 ఎంపిటిసి, 515 జడ్పిటిసి స్థానాలకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలకు క్యూలో ఉన్నవారికి మాత్రమే ఓటు వేసే అవకాశాన్ని కల్పించారు.
* గుంటూరుజిల్లా అచ్చంపేట మండల పరిధిలోని అచ్చంపేట గ్రామం 3 ఎంపిటిసి పోలింగ్ కేంద్రమైన నీలేశ్వర పాలెం గ్రామంలో రిగ్గింగ్ జరిగినట్లు సమాచారం. తమ ఓట్లు వేయలేదు అంటూ గ్రామస్తుల ఆందోళన. సమాచారం తెలుసుకునేందుకు వచ్చిన విలేకర్లకు సహకరించని పోలింగ్ సిబ్బంది. సుమారు 400 జెడ్ పి టి సి ఓట్లు, 360 ఎంపీటీసీ ఓట్లు ఎటువంటి సంతకాలు లేకుండా పోలింగ్ బాక్స్ లో వేసినట్లు సమాచారం. పోలింగ్ బూత్ వద్ద ఒక కానిస్టేబుల్, సచివాలయం మహిళా పోలీస్ మాత్రమే విధుల్లో ఉన్నారు. ఎన్నికల అధికారులు, పోలీసులు పోలింగ్ వద్దకు చేరుకొని పోలింగ్ నిలిపివేయకుండా యథాతథంగా నిర్వహిస్తున్నారు.
* ఆహారం పడేసి నిరసన..
హిందూపురం (అనంతపురం): పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించకపోతే సరిపెట్టుకున్నామని, కనీసం భోజనాలు సైతం నాణ్యతగా ఇవ్వకుంటే ఎలా అంటూ ఎన్నికల సిబ్బంది మండల ఎన్నికల అధికారి, ఎంపిడిఒ శ్రీనివాసులుతో గురువారం వాగ్వాదానికి దిగారు. అనంతపురం జిల్లా హిందూపురం రూరల్ మండలంలో జరుగుతున్న జిల్లా పరిషత్, ప్రాదేశిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడం, ఎన్నికల సిబ్బందికి నాణ్యమైన భోజనాన్ని అందించకపోవడంతో ఒక్కసారిగా సిబ్బంది ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నాణ్యతలేని భోజనాన్ని పడేసి నిరసన వ్యక్తం చేశారు.
* అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం వైసిపి జెడ్పిటిసి అభ్యర్థి కామిరెడ్డిపల్లి సుధాకర్ రెడ్డి వెంకట తిమ్మాపురం గ్రామంలోని బిజెపి ఎంపిటిసి కల్పన తరుపున బూతు ఏజెంట్‌గా వచ్చిన నారాయణస్వామిని బయటికి లాక్కెళ్ళి వాహనంలో ఎక్కించి చితకబాదినట్లు సమచారం.
* గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం వుయ్యందన గ్రామంలో అధికార పార్టీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. బ్యాలెట్ నమూనాలో ఫ్యాన్ గుర్తుపై ముద్ర వేసుకున్నారు.
* మండుటెండను లెక్కచేయకుండా..
పెదబయలు రురల్: న్యూస్గురువారం మండల ప్రాదేశిక జిల్లాపరిషత్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. చివరి ఘట్టలో పర్రెడ గ్రామంలో నివాసం ఉంటున్న వికలాంగుడు మండుటెండలో కూడా లెక్క చేయండా కుటుంబ సభ్యులు సహాయంతో వచ్చి ఓటు వేశాడు.
* విజయనగరం జిల్లా : ఆంధ్రా- ఒడిశా సరిహద్దు కొఠియా గ్రామాల్లో పోలీసులు, నేతలను ఎదిరించి గిరిజనులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పట్టుచెన్నూరు, పగలు చెన్నూరు, గంజాయిభద్రతో పాటు ఏవోబీ సరిహద్దు గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ఓటర్లు తమ ఓటు వేస్తున్నారు.
* విజయనగరం జిల్లా : సీతానగరం మండలం అంటిపేటలో పోలింగ్ నిలిచింది. బ్యాలెట్ పేపర్లో తప్పులు ఉండటంతో పోలింగ్ రేపటికి వాయిదా పడింది. పేరు మార్పు గందరగోళంతో పోలింగ్ నిలిచింది.
* ప్రకాశం జిల్లా : తాళ్లూరు మండలం శివరాంపురంలో ఉద్రిక్తత. దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ సోదరుడు రవీంద్ర వాహనంపై రాళ్లదాడి. రవీంద్ర వాహనంపై వైసీపీ రెబల్స్ రాళ్లదాడి చేయడంతో పోలీసులు చెదరగొట్టారు. శివరాంపురంలో ఉద్రిక్త వాతావరణం.
* ఆచంటలో బారులు తీరిన ఓటర్లు
ఆచంట (పశ్చిమగోదావరి): మండలంలో ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో అధికారులు పోలీసు యంత్రాంగం ఊపిరి పీల్చుకున్నారు. వేసవి నేపథ్యంలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లు ఇబ్బందులు పడకుండా అధికారులు సదుపాయం కల్పించారు. టెంట్లు వేయడంతోపాటు వాటర్ ప్యాకెట్లు ప్రాథమిక చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. మండలంలో ఉదయం 7 గంటల నుండే సందడి మొదలైంది. 9 గంటల నుంచి ఓటర్లు బారులు తీరారు. మండుటెండను కూడా లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్‌లో పాల్గన్నారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కొత్తూరు ప్రాథమిక పాఠశాల, పెనుమంచిలి జెడ్పీ ఉన్నత పాఠశాల, కొడమంచిలి జడ్పీ ఉన్నత పాఠశాల, వల్లూరు పంచాయతీ కార్యాలయం వద్ద పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట్రావు సహాయ ఎన్నికల అధికారులు ఎం శ్రీనివాసరావు మధుసూదన్ రావు రాజశేఖర్ పోలింగ్‌ను పర్యవేక్షించారు.
* సంతబొమ్మాళి(శ్రీకాకుళం): మండలంలోని వడ్డివాడ గ్రామంలో ఎంపిటిసి ఎన్నికల విధులు నిర్వహిస్తున్న పిఒ కర్రి కమల కుమారి (45) ఒక్కసారిగా స్పఅహ తప్పి పడిపోయారు. వెంటనే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది ఆశావర్కర్లు తాత్కాలిక ప్రథమ చికిత్స అందించారు. తరువాత దండుగోపాలపురం వైద్యాధికారి డాక్టర్ వంశీకృష్ణ వైద్యపరీక్షలు నిర్వహించారు. కొంత సమయం పర్యవేక్షణలో ఉన్న తర్వాత తిరిగి విధుల్లో హాజరయ్యారు.
* కంటోన్మెంట్ జోన్‌గా కొటియా
విజయనగరం: కొటియా గ్రామాల్లో కరోనా కేసులు వున్నందున కంటోన్మెంట్జోన్గా ఒరిస్సా ప్రభుత్వం ప్రకటించింది. గిరి శిఖర కొటియా గ్రామాల ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకునేందుకు కోవిడ్ కంటెయిన్మెంట్ జోన్‌గా ఒరిస్సా కొరాపుట్ జిల్లా కలెక్టర్ ప్రకటించారు. అయినప్పటికీ కొంతమంది గిరిజన ఓటర్లు ఓటు వేసేందుకు వస్తున్నారు. ప్రస్తుతం పోలింగ్ మందకొడిగా సాగుతోంది.
* ఉరవకొండలో ఉద్రిక్తత
అనంతపురం (ఉరవకొండ) : అనంతపురం జిల్లా ఉరవకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ సెంటర్లో వైసిపికి చెందిన నేతలు రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. బ్యాలెట్లు చించి బాక్స్‌లో వేయబోయారు. పోలింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఆంధ్ర ప్రాథమిక పాఠశాల పోలింగ్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది.
* సంతకవిటి(శ్రీకాకుళం): సురవరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూతులో వైసిపి కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడుతుండడంతో టిడిపి మహిళా అభ్యర్థి బూతు లోపలే బైఠాయించారు.
* మధ్యాహ్నం 12గంటలు.. ఓటర్ల కోసం ఎదురుచూపు..
సత్తెనపల్లి(గుంటూరు): సతైనపల్లి మండలం పణిదంలో మధ్యాహ్నం 12గంటలు దాటినా ఓటర్లు రాకపోవడంతో పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. దీంతో అధికారులు కూడా ఓటర్లు ఎప్పుడు వస్తారా అని ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం నుండైనా ఓటర్లు వస్తారేమోనని భావిస్తున్నారు.
* వెలుగుడులో ఏజెంట్ల మధ్య ఘర్షణ
కర్నూలు జిల్లా వెలుగుడు పట్టణంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వెలుగుడు పట్టణంలోని 5,6 పోలింగ్ బూతులో వైసిపి, ఎస్‌డిపిఐ ఏజెంట్ల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వఅద్ధుడు ఓటు వేసే విషయంలో ఇరు పార్టీల మధ్య గొడవ చెలరేగింది. ఇరుపార్టీల ఏజెంట్లు మధ్య తోపులాట చేసుకుంది. అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.
* అనంతపురం : ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన నేత మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసిపి నేతలు రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి వాహనం ధ్వంసం అయింది.
* కంచికచర్ల మండలం పేరకలపాడు పోలింగ్ కేంద్రం వద్ద ఓ వఅద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకునే క్రమంలో వైసిపి, టిడిపిలకు చెందిన కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది. ఆమె ఓటు తమదంటూ ఇరు పార్టీలకు చెందిన వారు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి. ఇంతలో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని వారించారు. కంచికచర్ల పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
* నెల్లూరు : తాళ్లూరు మండలం శివరాంపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే మద్దిశెట్టి సోదరుడు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. పోలింగ్ కేంద్రం వద్దనే స్వతంత్ర అభ్యర్థులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సోదరుడి కారు అద్దాలను ధ్వంసం చేశారు.
* కృష్ణా : నందిగామలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపి, వైసిపి నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఆరుగురికి గాయాలవ్వగా, వారిని ఆసుపత్రికి తరలించారు.
* గుంటూరు : దాచేపల్లిలో జనసేన ఏజెంట్లను వైసిపి నేతలు అడ్డుకున్నారు. ఎన్ఒసి సర్టిఫికెట్ లేదని జనసేన ఏజెంట్లను అధికారులు వెనక్కు పంపారు.
* చిత్తూరు : చంద్రగిరి మండలం ఏ.రంగం పేటలో హీరో మంచు విష్ణు ఓటేశారు.
* కృష్ణా : కంచికచర్ల మండలం పేరకలపాడులో ఉద్రిక్తత నెలకొంది. వైసిపి, టిడిపి నాయకుల మధ్య ఘర్షణ నెలకొంది. ఇరువర్గాలు కర్రలతో దాడి చేసుకోవడంతో పలువురికి గాయాలయ్యాయి.
* ప్రకాశం : పిసిపల్లి మండలం లింగన్నపాలెంలో దొంగ ఓటు కలకలం రేపింది. దొంగ ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని టిడిపి ఏజెంటు అడ్డుకున్నారు. ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.
* కడప జిల్లా.. చాపాడు మండలం రాజువారిపేట పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ అభ్యర్థి రాజేశ్వరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్యాలెట్ పేపర్ బయటకు తీసుకురావడంతో పోలీసులు అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
* నెల్లూరు : చేజర్ల మండలం మాముడూరులో ఉద్రిక్తత నెలకొంది. వైసిపి పోలింగ్ ఏజెంట్లపై స్వతంత్ర అభ్యర్థి అభ్యంతరం తెలపడంతో, ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇద్దరు మహిళలకు గాయాలయ్యాయి. దీంతో అక్కడ పోలింగ్‌ను అధికారులు నిలిపేశారు.
* జిల్లాల వారీగా పోలింగ్ నమోదు శాతాలు : ఏపీలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుంతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 11 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
జిల్లాల వారీగా....
శ్రీకాకుళం జిల్లాలో - 19.32 శాతం
విజయనగరం జిల్లాలో - 25.68 శాతం
విశాఖపట్నం జిల్లాలో - 24.14 శాతం
తూర్పుగోదావరి జిల్లాలో - 25.00 శాతం
ప.గో జిల్లాలో - 23.40 శాతం
కృష్ణా జిల్లాలో - 19.29 శాతం
గుంటూరు జిల్లాలో - 15.85 శాతం
ప్రకాశం జిల్లాలో - 15.05 శాతం
నెల్లూరు జిల్లాలో - 20.59 శాతం
కర్నూలు జిల్లాలో - 25.96 శాతం
అనంతపురం జిల్లాలో - 22.88 శాతం
వైఎస్ఆర్ జిల్లాలో - 19.72 శాతం
చిత్తూరు జిల్లాలో - 24.52 శాతం
* కొటియా గ్రామాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ : విజయనగరం జిల్లా వివాదాస్పద కొటియా గ్రామాల్లో.. పరిషత్ ఎన్నికల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నేరేళ్లవలస, సారిక దగ్గర.. స్థానికులు ఓటు వేయకుండా ఒడిశా పోలీసులు, పలువురు ప్రజాప్రతినిధులు.. అడ్డుకుంటున్నారు. తోనామ్, మోనంగి పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు రాకుండా రోడ్డుకడ్డంగా బండరాళ్లు పెట్టారు. అయినా సరే ఎలాగైనా తాము ఓటు హక్కు వినియోగించుకొని తీరుతామంటున్నారు ఓటర్లు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
* తూర్పు గోదావరి : అమలాపురం మండలం తాండవల్లిలోని బ్యాలెట్ పేపర్లో జనసేన అభ్యర్థి పేరు, గుర్తు కనిపించలేదు. బ్యాలెట్ లో ఫ్యాన్ గుర్తుపై గ్లాస్ గుర్తు ఉండటంతో అక్కడి ఓటర్లలో గందరగోళం నెలకొంది.
* సతైనపల్లి మండలం పణిదంలో ఓటర్లు లేక వెలవెల పోతున్న పోలింగ్ కేంద్రాలు
* గుంటూరు : పెదనందిపాడు మండలం రాజుపాలెంలో టిడిపి, వైసిపి మధ్య ఘర్షణ నెలకొంది. పరస్పరం దాడులకు దిగడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
* కర్నూలు : ఆళ్లగడ్డ మండలం బాచుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. వైసిపి అభ్యర్థికి ఓట్లు వేయాలని కాలనీల్లో యువకులు ప్రచారం చేపట్టారు. ఆ యువకులను టిడిపి కార్యకర్తలు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలికి బయలుదేరిన భూమా అఖిలప్రియను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో భూమా అఖిలప్రియ వాగ్వాదానికి దిగారు.
* తూర్పు గోదావరి : బ్యాలెట్ బాక్సులతో సెల్ఫీలు తీసినవారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కాట్రేనిపాలెం యువకులు బ్యాలెట్ బాక్సుల వద్ద సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ విషయం తెలిసిన కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆ యువకులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
* నెల్లూరు: ఎఎస్‌పేట మండలం పొనుగోడులో పరిషత్ ఎన్నికల పోలింగ్ నిలిచిపోయింది. రేపు(శుక్రవారం) రీ పోలింగ్ నిర్వహించాలని జిల్లా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బీజేపీ ఏజెంట్ ప్రసాద్ బ్యాలెట్ బాక్స్‌ను ఎత్తుకెళ్లి నీటితొట్టిలో వేయటంతో వివాదం నెలకొంది. అడ్డుకునేందుకు యత్నించిన అధికారులను ప్రసాద్ తోసేసి బాక్స్ ఎత్తుకెళ్లాడు. ప్రస్తుతం బీజేపీ ఏజెంట్ ప్రసాద్ పరారీలో ఉన్నాడు.
* విశాఖ జిల్లా రావికమతం మండలంలో ఓటింగ్ 10.30 గంటలకు 18 శాతం, కశింకోట మండలంలో 9 గంటలకు 5.45 శాతం, 10 గంటలకు 20. 4 శాతం నమోదయింది.
* ప్రకాశం : పొన్నలూరు మండలం తిమ్మపాలెం ఎంపిటిసి అభ్యర్థి మృతి చెందారు. తిమ్మపాలెం ఎంపిటిసి స్థానానికి ఏకగ్రీవంగా ఎన్నికైన షేక్ రజాసాహెబ్ గుండెపోటుతో మృతి చెందారు.
* విజయనగరం : సీతానగరం మండలం అంటిపేట ఎంపిటిసి స్థానానికి రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు తప్పుగా నమోదు కావడంతో రీపోలింగ్‌కు ఆదేశించారు.
* శ్రీకాకుళం : సంతకవిటి మండలం తాలాడ కేంద్రాల్లో పోలింగ్ ఇంతవరకూ ప్రారంభం కాలేదు. ఓటరు జాబితాకు ఓటరుకు ఇచ్చిన సిప్పులకు మధ్య వ్యత్యాసంతో గందరగోళం నెలకొంది. దీంతో తాలాడ పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్‌ను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.
* ప్రకాశం : ప్రకాశం జిల్లా సిపిఐ కార్యదర్శి అరెస్టును రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఖండించారు. పోలింగ్ కేంద్రంలోని బ్యాలెట్ పేపర్లో కంకి కొడవలి గుర్తు మార్చడంపై సిపిఐ ఆందోళన చేపట్టింది. రామకృష్ణ మాట్లాడుతూ.. సిపిఐ నేతలను అరెస్టు చేయడం అక్రమమన్నారు. పామూరులో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

* చిత్తూరు : చిత్తూరులోని రామకుప్పం మండలం రామాపురం తాండాలోని ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. పరిషత్ ఎన్నికల్లో రామాపురం తాండావాసులు పాల్గనలేదు. తమ గ్రామాన్ని పంచాయతీ కేంద్రంగా చేయకపోవడంపై గ్రామస్థులు అసహనాన్ని వ్యక్తపరిచారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఎన్నికలను బహిష్కరించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.
* కడప : బద్వేల్ మండలం ఉప్పతివారిపల్లెలో టిడిపి జడ్పిటిసి అభ్యర్థి నిరసన తెలిపారు. టిడిపి ఏజెంట్లను బయటకు పంపారంటూ.. భీరం శిరీష ఆందోళనకు దిగారు.
* ప్రకాశం : చెరుకూరు ఎంపిటిసి-1 స్థానంలో తాత్కాలికంగా పోలింగ్ నిలిచింది. చెరుకూరు ఎంపిటిసి-1 బ్యాలెట్ పత్రాలను అధికారులు వేరే కేంద్రానికి పంపారు. బ్యాలెట్ పేపర్లు లేక పోలింగ్ తాత్కాలికంగా నిలిచింది.
* అనంతపురం : అనంతపురంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో వైసిపి వర్గీయులను పోలీసులు చెదరగొట్టారు. కొన్ని చోట్ల టిడిపి అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో ఎన్నికలను బహిష్కరించారు.
* చిత్తూరు : నిండ్ర మండలం కీళంబాకం గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. టిడిపి అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో తాము ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్థులు ప్రకటించారు. గ్రామస్థులతో మాట్లాడేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నిస్తున్నారు.
* నెల్లూరు : ఎఎస్ పేట మండలం పొనుగోడులో ఎన్నికలు తాత్కాలికంగా నిలిచాయి. బిజెపి ఏజెంట్ ప్రసాద్ బ్యాలెట్ బాక్సును నీళ్లలో వేయడంతో ఎన్నికలు నిలిచాయి. బిజెపి ఏజెంట్ చర్యను అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ అధికారులను తోసేసి బాక్స్‌ను నీళ్లలో వేశాడు.
* విశాఖ : పెదబయలు మండలం సీతగుంటలోని బ్యాలెట్ పేపర్లో ఎంపిటిసి అభ్యర్థి గుర్తు మారిందంటూ.. ఎంపిటిసి అభ్యర్థి ఆందోళన చేపట్టారు. సిపిఐ అభ్యర్థికి కంకి కొడవలికి బదులుగా సుత్తి కొడవలి వచ్చిందని ఆందోళన నిర్వహించారు.
* విజయనగరం : ద్వారపూడిలో వైసిపి, టిడిపి కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓటరు స్లిప్పుల పంపిణీ విషయంలో వివాదం తలెత్తింది. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు.
* ప్రకాశం : తర్లుపాడు మండలం పోతలపాడులో ఏజెంట్ల మధ్య వివాదం చోటుచేసుకుంది. దీంతో పోతలపాడులో తాత్కాలికంగా పోలింగ్ నిలిచింది.
* పశ్చిమ గోదావరి : కొయ్యలగూడెం మండలం అంకాలగూడెంలో రహదారి పక్కన టిడిపి ఎంపిటిసి అభ్యర్థి ఏకుల గడ్డియ్య గాయాలతోపడిఉన్నారు. వైసిపి వర్గీయులే దాడిచేశారని తనపై దాడి చేశారని ఏకుల గడ్డియ్య ఆరోపిస్తున్నారు. కొయ్యలగూడెం ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
* అనంతపురం : ధర్మవరం మండలం రేగాటిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. జనసేన నాయకుడు మధుసూదన్ రెడ్డి ఇంటిపై వైసిపి వర్గీయులు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మధుసూదన్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
* గుంటూరు : నరసరావుపేట మండలం పాలపాడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓటు వేయకుండా టిడిపి వారిని వైసిపి శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో టిడిపి శ్రేణులు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.
* విజయనగరం జిల్లా సీతానగరం మండలం.. అంటిపేటలో పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్ పేపర్లో తప్పులు ఉండటంతో పోలింగ్ ను అధికారులు రేపటికి వాయిదా వేశారు. అభ్యర్థులకు బదులు విత్ డ్రా చేసుకున్న వారి పేర్లు బ్యాలెట్లల్లో నమోదయ్యాయి.
* పక్కి(విజయనగరం) : విజయనగరం పక్కిలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, ఆయన సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు, కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

* కొండాపురం (కడప) : కొండాపురంలోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల జాబితాలో తమ పేర్లను వెతుక్కుంటూ.. ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. అధికారులు ఓటర్లకు అవగాహన కల్పించకపోవడం, స్లిప్పులు పంపిణీ చేయకపోవడంతో ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు.

* క్రమ సంఖ్య తెలియక ఇబ్బందులు..
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగిలో క్రమసంఖ్య తెలియక ఓటర్లు అటుఇటూ తిరుగుతూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓటువేయాలో తెలియక చాలా సేపటి వరకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్ఒ ముక్కంటి సమస్య పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు రాజవొమ్మంగి సిఐ ఎం నాగ దుర్గారావు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

* పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో మండుటెండలోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో రహదారి పొడుగునా అలాగే ఎండలోనే నిల్చోవాల్సి వస్తోందని ఓటర్లు ఆవేదన చెందుతున్నారు. చిన్నపిల్లలను తీసుకొచ్చి ఇబ్బందులు పడుతున్నామని ఓటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
* నెల్లూరు : ఏఎస్ పేట మండలం పొనుగోడు గ్రామంలో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బిజెపి పార్టీ ఏజెంట్ ప్రసాద్- వైసిపి కార్యకర్త మధ్య ఘర్షణ జరిగింది. తొలుత బిజెపి ఏజెంట్ ప్రసాద్... బ్యాలెట్ బాక్స్ ఎత్తుకొని వెళ్లి నీటి తొట్టిలో వేయడంతో గొడవ ప్రారంభమైంది. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. కాగా, ఓటు వేసేందుకు వచ్చిన వైసిపి కార్యకర్తను అభ్యంతరం పెట్టడంతో చెలరేగిన వివాదం..
* తూర్పు గోదావరి: అమలాపురం మండలంలోని గున్నేపల్లి అగ్రహారంలో బ్యాలెట్ పేపర్ తారుమారు. 51/31 పోలింగ్ కేంద్రంలో తారుమారైన బ్యాలెట్ పేపర్. గాజు గ్లాసు గుర్తు బ్యాలెట్ పేపర్లో లేకపోవడంతో జనసేన అభ్యంతరం. గున్నేపల్లి అగ్రహారంలోని 51/31లో పోలింగ్ కేంద్రంలో ఆగిన పోలింగ్.
* ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 9 గంటల వరకు 7.76 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాలో 8.99 శాతం పోలింగ్ నమోదు
విజయనగరం జిల్లాలో 9.01 శాతం పోలింగ్ నమోదు
విశాఖ జిల్లాలో 8.83 శాతం పోలింగ్ నమోదు
తూ.గో జిల్లాలో 4.59 శాతం పోలింగ్ నమోదు
ప.గో జిల్లాలో 9.26 శాతం పోలింగ్ నమోదు
కృష్ణా జిల్లాలో 9.32 శాతం పోలింగ్ నమోదు
గుంటూరు జిల్లాలో 7.52 శాతం పోలింగ్ నమోదు
ప్రకాశం జిల్లాలో 6.53 శాతం పోలింగ్ నమోదు
నెల్లూరు జిల్లాలో 6.36 శాతం పోలింగ్ నమోదు
చిత్తూరు జిల్లాలో 7.29 శాతం పోలింగ్ నమోదు
వైఎస్ఆర్ జిల్లాలో 4.81 శాతం పోలింగ్ నమోదు
కర్నూలు జిల్లాలో 9.58 శాతం పోలింగ్ నమోదు
అనంతపురం జిల్లాలో 7.76 శాతం పోలింగ్ నమోదు
* పెదబయలు (విశాఖ) : పెదబయలు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు చోటుచేసుకున్నాయి. పెదబయలు పోలింగ్ కేంద్రాలలోని నోటీస్ బోర్డుల్లో సిపిఎం కి బదులు సిపిఐ అని ఉంది. నక్షత్రం, సుత్తి, కొడవలికి బదులు కంకి కొడవలి ఉంది. పంచాయతీ ఎన్నికలలో వేసిన ఓట్లు.. పరిషత్‌లో గల్లంతయ్యాయంటూ.. ఓటర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ రోజు ఉదయం 7 గంటలకే అక్కడ పోలింగ్ ప్రారంభమయింది.
* పెనుకొండ (అనంతపురం) : పెనుకొండ డివిజన్లోని 13 మండలాల్లో ఎన్నికల పోలింగ్ 2.71 శాతం నమోదయింది. ఎనిమిది గంటల వరకు 13562 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు పెనుకొండ సబ్ కలెక్టర్ టి.నిషాంతి తెలిపారు.
* అనంతపురం : అనంతపురం జిల్లాలోని 62 జడ్పిటిసి స్థానాలు, 782 ఎంపిటిసి స్థానాలకుగాను కొనసాగుతోన్న ఎన్నికలలో ఈరోజు ఉదయం 8 గంటల వరకు 3.29 పోలింగ్ శాతం నమోదయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు తెలిపారు.
* విజయనగరం : విజయనగరంలోని సీతానగరం మండలం అంటిపేట ఎంపిటిసి స్థానానికి సంబంధించి బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు తప్పుగా నమోదయింది. దీంతో అక్కడ పోలింగ్ వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎం.హరి జవహర్ లాల్ తెలిపారు. ఆ స్థానంలో పోటీ చేస్తున్న వైసిపి అభ్యర్థి శనపతి నిర్మల కు బదులుగా పోటీ నుంచి విరమించిన శనపతి లక్ష్మి పేరు ఉంది. పోటీ చేస్తున్న అభ్యర్థుల జాబితా ఫామ్-9 లో పేరు మారడంతో అంటిపేట ఎంపిటిసి స్థానం పరిధిలోని 20, 21, 22 నంబరు పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ కు సిఫారసు చేసినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.
* శృంగవరపుకోట మండలంలోని 90 శాతం పోలింగ్ కేంద్రాలలో వైసిపి కి చెందిన ఒకే ఒక్క ఏజెంట్లు ఉన్నారు.

* తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలం ప్రాదేశిక పరిషత్ ఎన్నికల పోలింగ్ లో 9 గంటలకు 4.34 పోలింగ్ శాతం నమోదయింది.
* తాడిపత్రి రూరల్ (అనంతపురం) : తాడిపత్రిలోని 16 స్థానాల్లో 4 ఏకగ్రీవం కాగా, 12 స్థానాలకు అధికారికంగా టిడిపి పోటీలో లేకపోవడంతో ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద అంత అంత మాత్రంగానే పోలీసు సిబ్బంది ఉన్నారు. గన్నేవరిపల్లి పంచాయితీలో గన్నేవారిపల్లి కాలనీ 43, 44 పోలింగ్ బూత్ లలో ఇంతవరకూ ఒక్క ఓటు కూడా ఓటర్లు వేయలేదు.

* అనంతపురం : కసాపురం పోలింగ్ స్టేషన్ వద్ద టిడిపి ఏజెంట్లకు, స్వతంత్ర అభ్యర్థి ఏజెంట్లకు పాసులు ఇవ్వలేదంటూ.. ఇరు పార్టీల కార్యకర్తలకు మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకుంది.
* కడప : చాపాడు మండలం అయ్యవారిపల్లెలో టిడిపి ఎంపిటిసి అభ్యర్థి రాజేశ్వరి దౌర్జన్యానికి దిగారు. పోలింగ్ కేంద్రం నుండి బ్యాలెట్ పేపర్‌ను బయటకు తెచ్చారు. అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

* అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. 515 జడ్పిటిసి, 7220 ఎంపిటిసి స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 7,735 స్థానాలకు 20,840 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. సుమారు 2,44,71,002 మంది గ్రామీణ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. కోవిడ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరుగుతుంది.

* 2.46 కోట్ల మంది ఓటర్లు ..
హైకోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికల్లో రాష్ట్రంలో 2,46,71,002 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 660 జెడ్పిటిసి స్థానాలకు గాను 8 స్థానాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 652 స్థానాలకు గాను 126 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మార్చి 2020 నుంచి ఇప్పటి వరకూ పోటీలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన 11 మంది మరణించారు. దీంతో మిగిలిన 515 జెడ్పిటిసి స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 10,047 ఎంపిటిసి స్థానాలకు గాను 375 స్థానాల్లో వివిధ కారణాల వల్ల ఎన్నికలు నిర్వహించడం లేదు. మిగిలిన 9,672 స్థానాలకు గాను ఇప్పటికే 2,371 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ ఏడాది కాలంలో పోటీలో ఉన్న 81 మంది మరణించారు. మిగిలిన 7,220 స్థానాలకు 18,782 మంది పోటీ పడుతున్నారు. ఈ ఎన్నికలకు రాష్ట్రంలో 27,751 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* కోవిడ్ నిబంధనలు పాటించండి : ఎస్ఇసి
పోలింగ్ ప్రక్రియలో భాగస్వాములయ్యే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను పాటించి తీరాలని ఎస్ఇసి నీలం సహాని అన్నారు. మాస్క్ ధరించాలని భౌతిక దూరం పాటిస్తూ, చేతులను శానిటైజ్ చేసుకోవాలని ఎస్ఇసి సూచించారు. అత్యధిక సంఖ్యలో ప్రజలు ఓటింగులో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.
బ్యాలెట్ బాక్సుల పటిష్ఠ భద్రతకు ఏర్పాట్లు
పోలింగ్ పూర్తి చేసినా ఓట్లు లెక్కించొద్దని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి ఆదేశాలు వెలువడే వరకు బ్యాలెట్ బాక్సులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని కలెక్టర్లు, ఎస్పి లను ఆదేశించారు.
* సమస్యాత్మక ప్రాంతాల్లో 47.03 శాతం పోలింగ్ కేంద్రాలు
పరిషత్ ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన 27,751 పోలింగ్ కేంద్రాల్లో 6,492 సమస్యాత్మక, 6,314 అత్యంత సమస్యాత్మక, 247 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ 47.03 శాతం పోలింగ్ కేంద్రాల్లోనూ గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఏజెన్సీ మండలాల్లో మధ్యాహ్నం 2 గంటలకే పోలింగ్ నిలిపివేసి బ్యాలెట్ బాక్సులను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. 1,72,787 మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందించనున్నారు. పోలింగ్ పర్యవేక్షణ కోసం 1,972 మంది జోనల్ అధికారులు, 6,524 మంది సూక్ష్మ పరిశీలకులను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో విధిగా కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నారు.
ఓటర్లు మాస్క్ పెట్టుకొని భౌతిక దూరం పాటించాలి.
థర్మల్ స్కానింగ్ తరువాతే పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తారు.
కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయిన ఓటర్లకు అవసరమైనచోట పీపీఈ కిట్లు అందిస్తారు. వారికి పోలింగ్ చివరి గంటలో ఓటేయడానికి అనుమతిస్తారు.
* వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ
పోలింగ్ జరుగుతున్న తీరును తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం నుంచి వెబ్ కాస్టింగ్ విధానంలో ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. అత్యంత సున్నితమైన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు అమర్చారు. కమిషనర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఒక ప్రకటనలో కోరారు.
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఓటేశారు

* చిత్తూరు : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం గురువారం ఉదయం చిత్తూరులోని నారాయణవనం లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.