Oct 27,2021 06:41

చైతన్యవంతమైన రాజకీయాలకు పేరెన్నిక గన్న తెలుగు ప్రజలు ఈ బూతు పురాణాలు, ఉద్రిక్తతలు సహించలేకపోతున్నారు. ఎక్కడ ఎవరిని కలిసినా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఎ.పి లో కుల ఘర్షణలు సృష్టించిన విధ్వంసం వారింకా మర్చిపోలేదు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి కుల మత చిచ్చును ఎగదోసే ప్రయత్నాలు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేనలు బిజెపి చెలగాటంలో చిక్కిన ఫలితంగా దారుణంగా దగాపడిన ఈ రాష్ట్రం ఏకంగా రాష్ట్రపతి పాలన లోకి పోవాలని కోరడం బాధ్యతా రహితం. అదే సమయంలో జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలు ప్రజా ఉద్యమాలను స్వీకరించలేకపోవడం, ప్రతి దానికి పోలీసులను ప్రయోగించడం కేసులు బనాయించడం అప్రజాస్వామికం. ఈ పోటాపోటీలో రాష్ట్ర రాజకీయ ఎజెండా దారితప్పడం అనుమతించరానిది.

    ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు అందులోనూ పాలక పార్టీల వ్యవహారాలు అంతకంతకూ అధ్వాన్నంగా మారుతున్నాయి. పాలక పక్షమైన వైసీపీ, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి మధ్య అధికార పోటీలో అసహనాలు పరాకాష్టకు చేరి అసలు సమస్యలు తెరమరుగై అవాంఛనీయ ద్వేషావేశాలు పరాకాష్టకు చేరుతున్నాయి. అనవసర వివాదాలు, అసభ్య భాషా ప్రయోగాలు భరించలేని స్థాయిని అందుకోవడమే గాక రాజకీయ రాజ్యాంగ సవాళ్లుగా పరిణమిస్తున్నాయి. గత మంగళవారం నాడు తెలుగుదేశం అధికార ప్రతినిధి ఉపయోగించిన ఒక అనుచితమైన మాటతో రగిలిన మంటలు రాష్ట్రపతి భవన్‌ వరకూ వెళ్లడం చరిత్రలో ఎరగని విపరీతం. విభజిత రాష్ట్రానికి రావలసిన నిధులు, ప్రత్యేక హోదా, అపరిష్కృత విభజన సమస్యలు, పోలవరం పూర్తి, వెనకబడిన ప్రాంతాల నిధులు, అమరావతి ప్రతిష్టంభన, విశాఖ ఉక్కు అమ్మకం నిలిపివేత వంటి అత్యవసర అంశాల ఊసే పట్టనట్టు రెండు ప్రధాన పార్టీలు పరస్పర దూషణలో మునిగి తేలుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్‌ అరాచక పాలన, నేరస్త నేపథ్యం, సిబిఐ కేసులు అన్నవి టిడిపి నిరంతర విమర్శలైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాడు మామ ఎన్టీఆర్‌ను గద్దె దింపడంతో సహా పాత చరిత్రనంతా తవ్వి తీయడం వైసీపీ కార్యక్రమంగా కొనసాగుతున్నది. దార్శనికుడైన చంద్రబాబు పాలన స్వర్గతుల్యమైనా ప్రజలు ఆయనను ఓడించి తప్పు చేశారనేది టిడిపి వాదన. ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడెప్పుడు వదలించుకోవడమా అనేదే ఇప్పడు సమస్య అని టిడిపి అంటుంది. జమిలి ఎన్నికలు వచ్చేస్తాయని లేదంటే జగన్‌ జైలుకు వెళతారు గనక ఈ పాలన సాగదని చాలా కాలం చెబుతూ వచ్చింది. ఇక వైసీపీ విషయానికి వస్తే తమ సంక్షేమ పథకాలు నభూతో నభవిష్యతి గనక వీటిని ప్రసాదిస్తున్న ముఖ్యమంత్రిని పల్లెత్తు మాట అన్నా సహించేది లేదన్న వైఖరితో నడుస్తున్నది. తమ ప్రభుత్వాన్ని అస్థిరత్వం పాలు చేసేందుకు టిడిపి వ్యూహాత్మకంగానే కుట్రలు పన్నుతున్నదని ఆరోపిస్తుంది. వీటిని వమ్ము చేయడం కోసం టిడిపి నాయకుల, కార్యకర్తల స్థయిర్యం దెబ్బ తీయడం వైసీపీ విధానంగా వుంది. వారి పాలన నాటి విషయాలపై కేసులు పెట్టి అరెస్టులు చేయడం, కోర్టుల చుట్టూ తిరగడం, అక్కడ వ్యతిరేక తీర్పులు వస్తే ఉడుక్కోవడం తంతుగా తయారైంది. ఈ క్రమంలోనే టిడిపి అనుకూల మీడియాతో పాటు కోర్టులూ, రాష్ట్ర ఎన్నికల సంఘం లాంటి వ్యవస్థలపై కూడా పాలకపక్షం అసహనం వ్యక్తం చేస్తున్నది. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తారనేది వైసీపీ ఆరోపణ కాగా జగన్‌ ప్రభుత్వం వ్యవస్థలను ధ్వంసం చేస్తుందనేది టిడిపి అభియోగం. వీటిపై తిట్లు, సిగ పట్లు నిత్యకృత్యమై పోగా మీడియా కూడా వాటిని గొప్పగా ప్రచారంలో పెడుతున్నది. రెండు పార్టీలు కేంద్ర బిజెపిని మంచి చేసుకోవడం తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్రం చేస్తున్న అన్యాయాన్ని నిలదీయడమనే ప్రశ్న లేకుండా పోయింది.
 

                                                 ఒక్క బూతుమాటతో మంటలు

ఏతావాతా ఈ రెండేళ్ల లోనూ కొద్ది రోజుల అరెస్టులు, కేసులు, కొన్ని రోజులు కూల్చివేతలు, కొన్ని రోజులు అప్పుల లెక్కలు, కొన్ని రోజులు సోషల్‌ మీడియా పోస్టులు ఇలా ఏదో ఒక తాత్కాలిక అంశంపై కృత్రిమంగా కేంద్రీకరణ పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఇటీవల గుజరాత్‌ లోని ముంద్రా రేవులో వేల కోట్ల రూపాయల విలువైన మాదక ద్రవ్యాలు పట్టుపడటం, వాటిపై విజయవాడ చిరునామా వుండటం కొత్త వివాదంగా మారింది. వాస్తవంలో ఉమ్మడి ఎ.పి లోనూ విడిపోయాక గత ఏడేళ్ల లోనూ మాదక ద్రవ్యాలు, ప్రత్యేకించి గంజాయి ఒక సమస్యగా వుంది. హైదరాబాదులో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారిపై విచారణ కూడా జరిగింది. 2013 నుంచి 2020 వరకూ పలు సందర్భాల్లో ఇతర రాష్ట్రాల పోలీసులు ఎ.పి కి వచ్చి దర్యాప్తు చేసుకుని వెళ్లారు. ఇప్పుడు గుజరాత్‌లో దొరికిన మాదక ద్రవ్యాలపై ఎ.పి చిరునామా వున్నా వాటి యజమానులు చెన్నైలో వున్నారని తేలింది. పైగా అది అదానీ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైవేటు రేవు. రవాణా చేయడం తప్ప ఎగుమతి దిగుమతుల తనిఖీతో తమకు సంబంధం లేదని అదానీ గ్రూపు ప్రకటించింది. కేంద్రం తరపున ఈ బాధ్యత చూడవలసిన డిఆర్‌ఐ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటలిజెన్స్‌) పెద్దగా స్పందించలేదు. కాని ఎ.పి లో మాత్రం ఇదే దుమారానికి కారణమైంది.
     వైసీపీ నేతలకు డ్రగ్‌ మాఫియాతో సంబంధాలున్నాయని టిడిపి ఆరోపించగా వారి వివరాలు అందించాలని పోలీసులు ఆ పార్టీ నేతలకే నోటీసులు జారీ చేశారు. దీనిపై మాట్లాడే సందర్భంలోనే టిడిపి నేత పట్టాభి అనరాని మాట అనేక సార్లు అన్నారు. దాన్ని సాకుగా చేసుకుని వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటి పైన, టిడిపి కేంద్ర కార్యాలయంపైనా పలు జిల్లాలలో ఆఫీసుల పైన దాడి చేశారు. టిడిపి నేత రెచ్చగొట్టడానికే ముఖ్యమంత్రిపై ఆ పదం వాడారని వైసీపీ అంటే...వారు ముందే పథకం వేసుకుని దాడులు చేశారని టిడిపి అంటుంది. దీనిపై చంద్రబాబు 36 గంటల నిరాహారదీక్ష చేస్తే వైసీపీ రాష్ట్ర వ్యాపితంగా ప్రజాగ్రహ దీక్షలు చేసింది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి జగన్‌ తనను తిట్టారంటూ ఆ బూతు పదాన్ని పోలీసు సమ్మేళనంలో వినిపించారు. ఇక చంద్రబాబు దీక్షలో ఆ మాట పదేపదే వాడారు. దానికి తప్పు అర్ధమే లేదని నిఘంటువులు, గూగుళ్లు ఉదహరించారు. ఇదంతా భరించలేని స్థాయిలో నడుస్తుండగా పట్టాభి ఇంటి తాళాలు పగలగొట్టి అరెస్టు చేశారు. దాడులకు సంబంధించి కూడా పదిహేను మంది వరకూ అరెస్టు చేశారు. అయితే సిఆర్‌పిసి 41ఎ కింద నోటీసు ఇవ్వకుండా పట్టాభిని అరెస్టు చేయడం సరికాదని మూడో రోజున హైకోర్టు విడుదల చేయడంతో మళ్లీ కోర్టులపై వివాద వ్యాఖ్యలు వినిపించాయి (ఇప్పుడాయన నిగూఢ ప్రదేశానికి వెళ్లారంటున్నారు). కార్యాలయాలపై శాంతి భద్రతలు కుప్ప కూలాయి గనక రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని టిడిపి అంటే అసలు ఆ పార్టీనే రద్దు చేయాలని వైసీపీ వాదించింది. దీక్షలు ముగిసినా కక్షలు మిగిలాయన్నట్టు చంద్రబాబు వెంటనే ఢిల్లీలో రాష్ట్రపతిని కలిసి 356 కింద జగన్‌ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరారు. తమ కార్యాలయాలపై దాడుల మీద సిబిఐ విచారణ జరిపించాలని అరెస్టులు, కేసులు, పోలీసు హింసల పైనా విచారణ జరపాలని కోరారు. పాలకపక్షం ఏజంటుగా వ్యవహరిస్తున్న డిజిపి గౌతం సవాంగ్‌ను వెనక్కు పిలిపించాలని కూడా అడిగారు. రాష్ట్రపతి పాలన కోరడం తీవ్రమైన విషయమని తెలుసు గనక దాన్ని సమర్థించుకోవడానికి టిడిపి పలు వాదనలు సిద్ధం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం నడుస్తున్నదనీ, డ్రగ్‌ మాఫియాకు తాలిబాన్లతో సంబంధాలున్నాయనీ, రాజ్యాంగ వ్యవస్థలే కుప్పకూలాయని పేర్కొంది.
 

                                                       తప్పును మించి తప్పులు

ఏది ఏమైనా వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను ఖండించేవారు కూడా ముఖ్యమంత్రిపై అసభ్య భాష వాడటాన్ని సమర్థించలేరు. ఆ బూతులు ఖండించేవారు కూడా టిడిపి కార్యాలయాలపై దాడులు ఆమోదించరు. ఆ దాడులు ఖండించేవారు కూడా ఆ పేరుతో రాష్ట్రపతి పాలన ఆహ్వానించడాన్ని అసలు సమర్థించరు. 2018లో ధర్మయుద్ధం పేరిట కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా తీవ్ర విమర్శలు చేసిన చంద్రబాబు ఆ కేంద్రం పాలనను ఆహ్వానించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఈ కాలంలో కేంద్రం మరింత నిరంకుశంగా మారి రాష్ట్రాలపై దాడులు పెంచింది. ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల హక్కులు కీలక స్థానం వహిస్తాయి.
     ఎ.పి ని ప్రత్యేకంగా అలక్ష్యం చేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు విశాఖ ఉక్కును కూడా అమ్మకానికి పెట్టింది. ఎ.పి కి జరిగిన వంచనకు వ్యతిరేకంగా కేంద్రంపై కలిసి పోరాడవలసిన రెండు ప్రధాన పార్టీలు నిరంతర నిరర్థక తగాదాలతో ఆ కేంద్రం చేతుల్లో జుట్టు పెట్టడం, మోడీ మోతలో పోటీ పడటం దారుణం. వినాశకరం. గతంలో ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ పర్యటనలను ఎగతాళి చేసిన టిడిపి నేతలు ఇప్పుడు అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ కోసం నిరీక్షించడం హాస్యాస్పదం. కేసుల ఒత్తిడితో జగన్‌, పాత పొత్తు పునరుద్ధరణ కోసం చంద్రబాబు బిజెపి ముందు మోకరిల్లుతున్నారనేది జనవాక్యంగా మారింది. బిజెపి నేస్తంగా మారిన పవన్‌ కళ్యాణ్‌ జనసేన పాత్ర కూడా విమర్శకు పాత్రమైంది. ఇందులో భాగంగా బిజెపి మార్కు మతతత్వ రాజకీయాలను కూడా నెత్తినెత్తుకునేందుకు చంద్రబాబు, పవన్‌ సిద్ధమవుతుంటే జగన్‌ తన హిందూత్వ నిరూపణకు తాపత్రయపడుతున్నారు. చరిత్రలో రాష్ట్రాల హక్కులు, లౌకికతత్వం కోసం నిలబడిన తెలుగు ప్రజల ఒరవడికి పూర్తి భిన్నమైన పరిస్థితి ఇది. విభజన అనంతరం మళ్లీ పట్టాలెక్కవలసిన రాష్ట్రానికి జరుగుతున్న అపచారమిది. ఎందుకంటే ఇద్దరి మధ్య దోబూచులాడుతున్న బిజెపి కేంద్రం ఇద్దరి నెత్తిన చేయిపెట్టగలదని చాలాసార్లు రుజువైంది.
 

                                               రాష్ట్రానికి నష్టం, రాజకీయ మూల్యం

చైతన్యవంతమైన రాజకీయాలకు పేరెన్నికగన్న తెలుగు ప్రజలు ఈ బూతు పురాణాలు, ఉద్రిక్తతలు సహించలేకపోతున్నారు. ఎక్కడ ఎవరిని కలిసినా ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఎ.పి లో కుల ఘర్షణలు సృష్టించిన విధ్వంసం వారింకా మర్చిపోలేదు. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం మరోసారి కుల మత చిచ్చును ఎగదోసే ప్రయత్నాలు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి. వైసీపీ, టీడీపీ, జనసేనలు బిజెపి చెలగాటంలో చిక్కిన ఫలితంగా దారుణంగా దగాపడిన ఈ రాష్ట్రం ఏకంగా రాష్ట్రపతి పాలన లోకి పోవాలని కోరడం బాధ్యతా రహితం. అదే సమయంలో జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్షాల విమర్శలు ప్రజా ఉద్యమాలను స్వీకరించలేక పోవడం, ప్రతి దానికి పోలీసులను ప్రయోగించడం, కేసులు బనాయించడం అప్రజాస్వామికం. ఈ పోటాపోటీలో రాష్ట్ర రాజకీయ ఎజెండా దారితప్పడం అనుమతించరానిది. అధికార పార్టీ బాధ్యత మరింత ఎక్కువ. అనేక సంక్షోభాలతో అప్పుల భారంతో కేంద్రం వివక్షతో అల్లాడుతున్న ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం, ప్రజల కోసం పోరాడటం జరగాలి తప్ప తమ రాజకీయ ప్రయోజనాలు అధికార కాంక్షలే పరమావధిగా భావించడం క్షమించరాని విషయం. ఈ పరిస్థితికి కారకులైన వారంతా మూల్యం చెల్లించవలసే వుంటుంది.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి