Nov 28,2020 01:15

కూంబింగ్‌ నిర్వహిస్తున్న పోలీసు ప్రత్యేక బలగాలు

ముంచంగిపుట్టు : ఆంధ్ర - ఒడిశా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టుల కదలికలున్నాయనే ఇంటిలిజెన్స్‌ వర్గాల సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెండు రోజులుగా సరిహద్దు ప్రాంతాలతో పాటు పెదబయలు, రూడకోట, జోలాపుట్‌, డుడుమ రహదారుల్లో సిఆర్‌పిఎఫ్‌, గ్రేహౌండ్స్‌ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అటు ఒడిశా రాష్ట్రంలోని సరిహద్దు ప్రాంతాలైన ఒనకఢిల్లీ, మాచ్‌ఖండ్‌, లంతపుట్‌, పాడువల ప్రధాన మార్గాల్లో ఒడిశా పోలీసులు పహారా కాస్తున్నారు. రాకపోకలు సాగించే వాహనాలపై ప్రత్యేక దష్టి సారించారు. ఇటీవల ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రంలోని కాంకేర్‌ జిల్లాలో మావోయిస్టులుకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరగ్గా ముగ్గురు మావోయిస్టులు మతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో తప్పించుకున్న కొంతమంది మావోయిస్టులు ఎఒబి అటవీ ప్రాంతాల్లో ప్రవేశించే అవకాశాలున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలంటూ ఉన్నతాధికారులు సైతం సరిహద్దు పోలీసు స్టేషన్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎఒబిలోని పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శుక్రవారం స్థానిక ఎస్‌ఐ పి.ప్రసాద్‌ రావు ఆధ్వర్యంలో పోలీసులు మండల కేంద్రంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. రికార్డులపై ఆరా తీశారు. ప్రయివేటు వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సులను సైతం తనిఖీలు చేశారు. ప్రయాణికుల బ్యాగులు, లగేజీలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించి విడిచి పెట్టారు. మండల కేంద్రంతో పాటుగా కొండ ప్రాంతాల్లో, ప్రధాన రోడ్లలో మావోయిస్టులు మందు పాతరలు అమర్చి ఉంటారనే అనుమానంతో ప్రధాన రోడ్లకు ఇరువైపులు, కల్వర్టులు, వంతెనల వద్ద బాంబ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీసుల తనిఖీలు, కూంబింగ్‌లతో ఏ క్షణంలో ఏ సంఘటన చోటుచేసుకుంటుందోనని ఎఒబి పరిసర ప్రాంతాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.