Feb 24,2021 00:22

ప్రజాశక్తి - పరవాడ
మండలంలోని తీరప్రాంత గ్రామమైన ముత్యాలమ్మపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా బిఎల్‌ఒగా విధులు నిర్వర్తించిన అంగన్వాడీ కార్యకర్త ముత్యరాణిపై స్థానిక వైసిపి నేతలు దాడి చేశారు. దీనిపై పోలీసులకు, ఐసిడిఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా రక్షణ కల్పించలేదు. దీంతో బాధిత కుటుంబం ఊరు విడిచివెళ్లింది. బాధితుల కథనం ప్రకారం... ఆదివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ముత్యాలమ్మపాలెం గ్రామ సర్పంచ్‌ పదవికి అధికార వైసిపి నుంచి ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయిన వర్గానికి చెందిన వారు సోమవారం ఎన్నికల విధులు నిర్వర్తించిన అంగన్‌వాడీ కార్యకర్త ముత్యరాణి ఇంట్లోకి చొరబడి, ఆమెపై దాడి చేశారు. బయటకు ఈడ్చుకొచ్చి, బట్టలు లాగి, నేలపై ఈడ్చి కొట్టారు. దీనిపై సచివాలయ పోలీసుకు, పరవాడ పోలీసులకు ఫిర్యాదు చేసినా బాధిత అంగన్‌వాడీకి రక్షణ కల్పించలేదు. ఐసిడిఎస్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఇదే అదునుగా చేసుకొని మంగళవారం మరోసారి దాడి చేశారు. అడ్డుకున్న అంగన్‌వాడీ కార్యకర్త తల్లి, చెల్లిని కూడా కొట్టారు. దీంతో చేసేది లేక ఆ కుటుంబం గ్రామం విడిచి బయటకొచ్చింది. తనను, తన కుటుంబీకులను రక్షించాలని పోలీసులకు ఫిర్యాదు తనకు న్యాయం జరగలేదని ముత్యరాణి ఆవేదన వ్యక్తం చేశారు. విధి లేని పరిస్థితుల్లో తమ శాఖ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చి ఊరు విడిచి పోయామని కన్నీటిపర్యంతమయ్యారు. తనకు, తన కుటుంబీకులకు రక్షణ ఇస్తే తప్పా తాను అంగన్వాడీ విధులు నిర్వహించలేనని, తమ కుటుంబం గ్రామంలో నివసించే పరిస్థితులు లేవని ఆమె వాపోతున్నారు.
దీనిపై పరవాడ సిఐ ఉమామహేశ్వరరావును సంప్రదించగా గ్రామంలో విచారణ చేస్తున్నామని తెలిపారు. ఐసిడిఎస్‌ పిఓ కెఎల్‌ఆర్‌కె.కుమారిని సంప్రదించగా పరవాడ పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్పారు. ఇందుకు సంబంధించి తమ శాఖ సిబ్బందికి ఆదేశాలు ఇచ్చామన్నారు. పరవాడ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.సత్తిబాబును సంప్రదించగా సమస్య తమ దష్టికి రాలేదని, గ్రామ రెవెన్యూ అధికారులకు సమాచారం ఇస్తామని పేర్కొన్నారు.