
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహించే లక్ష్యంతో మున్సిపాలిటీకి ఒక హెల్ప్‌లైన్ నెంబరు ఏర్పాటు చేయనున్నట్టు కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు, వాటిని పరిష్కరించే విధంగా ఈ హెల్ప్‌లైన్ పనిచేస్తుందన్నారు. జిల్లా స్థానిక ఎన్నిక సాధారణ పరిశీలకులు కాంతిలాల్ దండేతో కలసి నగరంలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. నగరంలోని రాజీవ్ స్టేడియంను సందర్శించి అక్కడి ఇండోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంను, ఓట్లలెక్కింపు హాళ్లను పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లపై ఎన్నికల పరిశీలకులకు వివరించారు. రెండు రౌండ్లలో కౌంటింగ్ జరిపేందుకు అవసరమైన టేబుళ్లు ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. స్టేడియంలో వాహనాల పార్కింగ్‌కు తగినంత ఖాళీ స్థలం వున్నందున ఇదే ప్రదేశంలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ వివరించారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సాధారణ ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దండే ఏర్పాట్లపై కమిషనర్‌కు పలు సూచనలు చేశారు. ఎన్నికల సామాగ్రి పంపిణీ బాధ్యతలు క్లస్టర్ల వారీగా వున్న రిటర్నింగ్ అధికారులకు అప్పగించాలని, క్లస్టర్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలన్నింటికీ అవసరమైన సామాగ్రి, బ్యాలెట్ పత్రాలు వంటివన్నీ ఆర్‌ఒలకు అప్పగించాలని తెలిపారు. పోలీసుల పరంగా చేస్తున్న ఏర్పాట్లపై డి.ఎస్.పి. అనిల్‌కుమార్ వివరిస్తూ, ప్రహారీగోడలు లేని పోలింగ్ కేంద్రాలకు బారీకేడింగ్ ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. దీనిపై కాంతిలాల్‌దండే స్పందిస్తూ ప్రహారీలు లేని పోలింగ్ కేంద్రాలతో పాటు సున్నితమైన, అత్యంత సునిశితమైన పోలింగ్ కేంద్రాలన్నింటి వద్ద బారికేడింగ్ ఏర్పాట్లు వుండాలని చెప్పారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలకు 396 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్ల నియామకంతో పాటు పోలింగ్ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేయిస్తున్నామని, వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తామన్నారు.
జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఆర్.మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎస్.ఎస్.వర్మ, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు, వన్‌టౌన్ సిఐ శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ అధికారి వెంకటేశ్వరరావు, మున్సిపల్ ఇంజిఇనీర్ దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
అంతకుముందు కలెక్టర్ హరిజవహర్ లాల్, ఎన్నికల పరిశీలకులు కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ డా.మహేష్ కుమార్ తదితరులు పైడితల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు.