Feb 11,2021 01:07

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి - కాకినాడ 'ఎన్నికల సామగ్రి పంపిణీ దగ్గర్నుంచి ఫలితాల వెల్లడి వరకు ప్రతి విషయంలోనూ అధికారులు చాలా అప్రమత్తతతో వ్యవహరించాలని కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి సూచించారు.' రెండో విడత ఈనెల 13న పంచాయతీ ఎన్నికలు జరిగే రాజమహేంద్రవరం, రామచంద్రాపురం డివిజన్‌, మండలస్థాయిలో అధికారులతో జెసి జి.రాజకుమారితో కలిసి బుధవారం కలెక్టరేట్‌ నుంచి వర్చువల్‌ విధానంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలింగ్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో ఏర్పాట్లు, బ్యాలెట్‌ పెట్టెలు, బ్యాలెట్‌ పేపర్లు, ఎన్నికల సిబ్బంది తదితర అంశాలపై ఎంపిడిఒల నుంచి సన్నద్ధత ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల ప్రక్రియను సజావుగా పూర్తిచేసేందుకు వివిధ సూచనలిచ్చారు. ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్‌, కౌంటింగ్‌ కేంద్రాల్లో పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. బ్యాలెట్‌ పెట్టెలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలన్నారు. చెక్‌లిస్ట్‌ మేరకు ఎన్నికల సామగ్రిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. సెన్సిటివ్‌, హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లతోపాటు వీడియోగ్రఫీ, వెబ్‌క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అత్యంత కీలకమైన కౌంటింగ్‌ కేంద్రాల్లో తగినన్ని టేబుళ్లను సిద్ధం చేసుకోవాలని లోపల, బయట తప్పనిసరిగా విద్యుత్‌ సౌకర్యం ఉండేలా చూసుకోవాలన్నారు. పోలింగ్‌ లొకేషన్‌, పోలింగ్‌ కేంద్రాల్లో కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఎన్నికల నేపథ్యంలో నియమించిన మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకొని ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసేందుకు కృషి చేయాలని కలెక్టర్‌ సూచించారు. అనంతరం నాలుగో విడత ఎన్నికలు జరిగే అమలాపురం డివిజన్‌లోని 16 మండలాల ఎంపిడిఒలతో నామినేషన్ల ప్రక్రియ, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికల వ్యయ పరిశీలన, పోలింగ్‌ ఏర్పాట్లు తదితరాలపై కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో డిఆర్‌ఒ సిహెచ్‌.సత్తిబాబు, రాజమహేంద్రవరం, అమలాపురం సబ్‌కలెక్టర్లు అనుపమ అంజలి, హిమాన్షు కౌశిక్‌, జెడ్‌పి సిఇఒ ఎన్‌వివి.సత్యనారాయణ, డిపిఒ ఎస్‌వి.నాగేశ్వర్‌నాయక్‌ పాల్గొన్నారు.