Feb 11,2021 00:08

ప్రజాశక్తి-కొండపి: గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్‌ పోల భాస్కర్‌ తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కొండపి ఎంపిడిఒ కార్యాలయంలో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రతిఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక గ్రామాలను క్షేత్ర స్థాయిలో సందర్శించి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించారు. ఎన్నికల నిర్వహణలో అధికారులంతా మరింత అప్రమత్తంగా ప్రణాళికాబద్ధతతో విధులు నిర్వర్తించాలని ఆయన చెప్పారు. ఓట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా చేరకుండా ముందస్తుగా అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పారదర్శకంగా జరిగే ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సంయమనం పాటించాల్సి ఉందన్నారు. అలాగే రిటర్నింగ్‌ అధికారులు, పిఒలకు అన్ని విధాలా సహకరించాలన్నారు. తొలివిడతలో 80.92 శాతం ఓట్లు పోలయ్యాయని, మిగిలిన మూడు విడతలలో అదే మాదిరిగా స్వేచ్చగా ఓటు హక్కు వినియోగించేకునేలా ప్రజలకు అవకాశం కల్పించాలని తెలిపారు. కొండపి నియోజకవర్గంలో 18 పంచాయతీలు, 170 వార్డుల కోసం 34 ప్రాంతాలకు 6 రూట్లలో బ్యాలెట్‌ బాక్స్‌లను తరలిం చడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అదికారులు కలెక్టర్‌కు వివరించారు. ఇందుకోసం 12 బస్సులు, ఐదు కార్లు ఇప్పటికే సిద్ధంగా ఉంచామని ఆయన దృష్టికి తెచ్చారు.
రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 13న జరుగుతాయని కలెక్టర్‌ తెలిపారు. అద్దంకి నియోజకవర్గంలో ఐదు మండలాలు, కందుకూరు డివిజన్‌లోని ఆరు మండలాలు, మార్కాపురం డివిజన్‌లో మూడు మండలాలల్లో ఎన్నికలు జరుగుతాయన్నారు. 12వ తేదిన ఎన్నిక సామగ్రి ఆయా పోలింగ్‌ కేంద్రాలను తరలిస్తామని వివరించారు. ముఖ్యంగా ఎంపిడిఒలు, తహశీల్దారు, ఇఒపిఆర్‌డి, ఎస్‌ఐలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. పోలింగ్‌ సిబ్బంది ఇబ్బందులు పడకుండా అధికారులు భోజన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి సమస్యలు రాకుండా చూడాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను అనుసరించి అధికారులు పనిచేయాలన్నారు.
మూడో దశలో కనిగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాలు, కందుకూరు నియోజకవర్గంలోని ఐదు మండలాలు, కొండపి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఈ నెల 17న ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్‌ తెలిపారు. ఇక్కడ 300 మంది అధికారులను నియమించామని ఆయన వివరించారు. ఈ నెల 16వ తేదీన ఎన్నికల సామగ్రి ఆయా పోలింగ్‌ కేంద్రాలకు తరలిస్తామని ఆయన స్పష్టం చేశారు. తొలి విడత ఎన్నికలలో ఎదురైన సమస్యలను అధిగమించి వాటిని నివారించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన పలు సూచనలు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఏర్పాట్లపై ఆయన క్షుణ్ణంగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో కొండపి ప్రత్యేక అధికారి డిఆర్‌డిఎ పీడీ పివి నారాయణ, ఇన్‌చార్జి ఎంపిడిఒ ఎం.విజయలక్ష్మి, తహశీల్దారు ఎస్‌వి ఎస్‌.కామేశ్వరరావు, ఎస్‌ఐ వి.రాంబాబు పాల్గొన్నారు.