Dec 03,2021 08:29
  • దళారులపై ధర్మ పోరాటం
  • అర్ధాకలితోనే టిటిడి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల విధులు
  • కార్పొరేషన్‌లో కలపాలని ఆందోళనలు

ప్రజాశక్తి - తిరుపతి బ్యూరో : మాకు వస్తున్న జీతంతో మీరు (టిటిడి అధికారులు) ఒక్క రోజు గడపండి. ఎన్నాళ్లని, ఎన్నేళ్లని దళారుల దోపిడీలో అహుతయ్యేది.. ఇచ్చే జీతాల్లోనూ కోత.. ఈ వెట్టి బతుకులు మాకొద్దు.. దళారుల ప్రమేయం లేకుండా టిటిడి ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌లో మమ్మల్ని విలీనం చేయమంటున్నాం.. మీరిచ్చిన హామీ మీరు నెరవేర్చేంత వరకూ ఈ ధర్మపోరాటం ఆగదు'... ఇదీ టిటిడి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికుల ఆవేదన.
   శ్రీవారిని నమ్ముకుని ఐదువేలకు పైగా ఎఫ్‌ఎంఎస్‌ (ఫెసిలిటీ మేనేజిమెంట్‌ సర్వీస్‌) కార్మికులు రెండు దశాబ్దాలుగా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల వసతి గదులను 'అద్దం'లా ఉంచడమే వీరి విధి. టిటిడి ఎప్పటికైనా తమను కరుణించకపోతుందా? అని భావిస్తూ అర్ధాకలితోనే విధులు నిర్వహిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు దశాబ్దాల నుంచి ఒక్క పర్మినెంట్‌ పోస్టు భర్తీ చేసి ఉంటే ఒట్టు. ఖాళీ పోస్టుల్లో కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, ఎఫ్‌ఎంఎస్‌ పేర్లతో 15వేల మందిని నింపుకుంటూ వచ్చారు. వీరికి అరకొర జీతం ఇస్తూ వెట్టిచాకిరీ చేయించుకుంటూ వచ్చారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు సిఐటియు ఆధ్వర్యంలో పోరాడి రూ.18వేల రూపాయల వేతనాన్ని పెంచుకున్నారు.2002లో ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులు విధుల్లో చేరారు. కార్మికులు, సూపర్‌వైజర్లు, టెక్నికల్‌ వర్కర్లుగా వీరికి పని విభజన ఉన్నా చేసేది మాత్రం 'వెట్టే'. తొలుత రూ. 500 రూపాయల వేతనంతో చేరారు. తర్వాత 1200, 1600, 1800, 3,500 రూపాయలు పెరుగుతూ వచ్చింది. వీరంతా మొదట్లో సులభ్‌, కెఎల్‌టి సంస్థల కాంట్రాక్టుల పరిధిలో పనిచేసేవారు. అప్పటి ఇఒ ఐవైఆర్‌ క్రిష్ణారావు హయాంలో వీరందరినీ ఒకే 'గూటి'కిందకు తీసుకు వచ్చి ఎఫ్‌ఎంఎస్‌ కార్మికులుగా పిలుస్తూ వచ్చారు. 2010 నుంచి జిఒ 11 ప్రకారం కనీస వేతనం అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ వచ్చారు. రెండు మూడేళ్లకోసారి టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లు మారడంతో వీరి సర్వీసును కుదిస్తూ వచ్చారు. ఆందోళనల ఫలితంగా ఇఎస్‌ఐ, పిఎఫ్‌ వర్తించినా వీరి వేతనం మాత్రం ఏడువేలకు మించలేదు. 24 గంటలు పని చేయడం వల్ల రోజుమార్చి రోజు వీరికి డ్యూటీ. 15 రోజులే పనిచేస్తున్నారన్న సాకుతో కాంట్రాక్టర్లు వీరి వేతనాన్ని కోత విధిస్తూ ఉండటం గమనార్హం. ఎఫ్‌ఎంఎస్‌ విభాగంలో మూడువేల మందికి పైగా మహిళలే ఉన్నారు. వీరు దుస్తులు మార్చుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులు ఇవ్వాలని కోరినా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉచిత బస్సు పాసులు, శ్రీవారి దర్శన సౌకర్యమూ లేదు.'సమాన పనికి సమాన వేతనం' ఇవ్వాలని హైకోర్టు చెబుతున్నా టిటిడిలో అమలు కాని పరిస్థితి. దీంతో పరిపాలనా భవనం ఎదుట నిరవధిక ఆందోళనకు దిగారు.

                                                                  శ్రమ దోపిడీ

నేను 15ఏళ్లుగా ఎఫ్‌ఎంఎస్‌ విభాగంలో సూపర్‌వైజర్‌గా ఉన్నాను. నాకు వచ్చే జీతం 7,500. అందులో 15 రోజులు పని చేయలేదని 3,500 రూపాయలే ఇస్తున్నారు. మిగిలిన 3,500, బస్సు ఛార్జీల అలవెన్స్‌ కలిపి నా జీతంలోనే కాంట్రాక్టర్లు దోపిడీ చేస్తున్నారు. తిరుమలలోని 10 ప్రైవేట్‌ ఏజెన్సీల్లో మేమంతా పనిచేస్తున్నాం. కాంట్రాక్టర్‌ మారినప్పుడల్లా ఉద్యోగ భయం. కాంట్రాక్టర్‌ మారిన ప్రతిసారీ జీతాల్లో కోతా తప్పడం లేదు.
                                       - రవి, సూపర్‌వైజర్‌


                                                జగనన్న హామీ నిలబెట్టుకోలేదు

పాదయాత్ర సందర్భంగా జగనన్న తిరుమలకు వచ్చినప్పుడు మేమందరం కలిశాం. మన ప్రభు త్వం అధికారంలోకి వస్తే టైంస్కేల్‌, ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు. ఆయనపై అభిమానం పెరిగింది. విశ్వాసంతో ఓటేసి నా చేతిపై పచ్చ కూడా వేసుకున్నాను. అయితే జగనన్న హామీ ఇచ్చి మూడేళ్లవుతోంది. మా బాధల గురించి పట్టించుకోలేదు.
                                                                                   - రాధ, కార్మికురాలు