Nov 27,2020 16:23

విజయనగరం టౌన్‌ : ఎంఆర్‌ కళాశాలను రక్షించుకోవడానికి ఉత్తరాంద్ర ఉద్యమంగా మార్చేందుకు మూడు జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లనున్నామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సురేష్‌, జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ తెలిపారు. శనివారం స్థానిక ఎల్బీజీ భవనంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రత్యక్షంగా ఎస్‌ఎఫ్‌ఐ ఇప్పటివరకు దశలవారీగా పోరాటాలు నడిపిందని, ఇప్పుడు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం చేయాలని ఉత్తరాంధ్ర ఎస్‌ఎఫ్‌ఐ కమిటీ నిర్ణయించిందని అన్నారు. ఈనెల 30 నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఉత్తరాంధ్ర మూడు జిల్లాల ప్రజా ప్రతినిధులకు మహారాజ(ఎ) కళాశాలలో అడ్మిషన్స్‌ ప్రారంభించి, ప్రభుత్వం స్వాధీనం చేసుకునే విధంగా కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగానే ఈ నెల 28, 29 రెండు రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల స్థానిక ఎమ్మెల్యే, ఎంపీలకు, మంత్రులతో కలిసి వినతిపత్రం ఇస్తామనీ, అదే విధంగా ఈ నెల 30న జిల్లా అధికారులతో కలిసి వినతులు అందజేస్తామనీ, అప్పటికీ స్పందించకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రికి పోస్టుకార్డు ఉద్యమం చేసి ఆ సమస్య తెలియజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.రాము, జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, జిల్లా కమిటీ సభ్యులు హరీష్‌, పట్టణ అధ్యక్షులు హర్ష పాల్గొన్నారు.