
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వినాశకర విధానాలను వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) దేశ వాప్తంగా చేపట్టిన వారం రోజుల నిరసన ఆందోళనలు జయప్రదమయ్యాయి. పార్టీ పిలుపునందుకొని ప్రజలు ఆందోళనల్లో పాల్గొని మోడీ సర్కారు తీరుపై తమ ఆగ్రహాన్ని తెలియజేయడం హర్షణీయం. ఇదే తరహాలో ఇతర వామపక్షాలు, వివిధ ప్రజాసంఘాల ఐక్య వేదికలు ఇచ్చిన పిలుపులకూ ప్రజలు బాగా స్పందించారు. కరోనా విజృంభణ కొనసాగుతున్న వేళ నిబంధనలు పాటిస్తూనే వీధుల్లోకొచ్చి బిజెపి విధానాలపై జనం అసహనాన్ని వ్యక్తపర్చారు. మోడీ సర్కారు రెండోమారు అధికారంలోకి వచ్చాక, అప్పటి వరకు బలవంతంగా దాచిపెట్టిన ఆర్థిక మాంద్యం ఒక్కసారిగా బట్టబయలైంది. దాని దుష్ప్రభావాలు బయటపడుతున్న సమయంలోనే కరోనా వైరస్ జడలు విప్పింది. అటు మాంద్యం ఇటు కోవిడ్ రెండు ఉపద్రవాలూ ప్రజల కొద్దిపాటి ఆదాయాలనూ కబళించాయి. అనాలోచిత లాక్డౌన్లతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో చిక్కుకుంది. ప్రజలు ప్రభుత్వ ఆసరా కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి ఆపత్కాలంలోనూ కేంద్రం ప్రజలకు కనీసం తాత్కాలిక ఉపశమన చర్యలను చేపట్టకపోవడంతో తమను ఎవరు ఆదుకుంటారో తెలీక అశక్తత, కుంగుబాటుకు లోనైన జనానికి సిపిఎం పోరాట దారి చూపించింది. జన బాహుళ్యాన్ని తట్టి లేపి ఉద్యమ బాట పట్టించింది. కష్ట కాలంలో కూడా కనికరించని ప్రభుత్వాన్ని ప్రజా పోరాటాల ద్వారా కదిలించాలంటూ ఆగస్టు 20-26 వరకు నిరసన వారం పాటించాలని పిలుపునిచ్చింది. పోరాటాల ద్వారానే సమస్యలు, హక్కులు పరిష్కారమవుతాయని దిశా నిర్దేశం చేసింది. సిపిఎం మోగించిన సమర భేరీపై ప్రజలు నలుదిశలా కదిలి మోడీ ప్రభుత్వానికి తమ సత్తా ఏమిటో రుచి చూపించారు.
కరోనా కష్ట సమయాన సైతం బిజెపి ప్రభుత్వం తన కార్పొరేట్ ఎజెండాను వదలను కాక వదల్లేదు. 'ఆత్మ నిర్భర భారత్' పేర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ యావత్తూ అంబానీ, అదానీలకు, విదేశీ కార్పొరేట్లకు పన్ను రాయితీలు, రుణ మాఫీల వంటి వాటికే సమర్పయామి. ఎయిర్‌పోర్టులు, పోర్టులు, రైల్వేలు, మెట్రోలు, ఎక్స్‌ప్రెస్‌వేలు, ఉక్కు, పవర్ ప్రాజెక్టులు ఇలా అన్నింటినీ ధారాదత్తం చేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ముతోంది. కార్మిక చట్టాల మార్పు, వ్యవసాయ సంస్కరణలు, ఎఫ్‌డిఐ లకు ఎర్ర తివాచీ...ఒకటేమిటి కార్పొరేట్ల దోపిడీకి కావాల్సిన అన్ని హంగులను కరోనా సమయంలోనే సమకూర్చి పెడుతోంది. ప్రజలు కరోనా సంక్షోభంలో జీవనోపాధి కోల్పోయి అల్లాడుతుంటే, వారిని ఆదుకునే ఆలోచన చేయకుండా కార్పొరేట్ల సేవలలో తరించడంతోనే ప్రభుత్వం ఎవరి పక్షం వహిస్తున్నదో స్పష్టం. అలాంటి 'ఆత్మ నిర్భర భారత్'తో దేశాన్ని మంచి దేశంగా మారుస్తామంటే అస్సలు కుదిరేపని కాదు. దేశం స్వావలంబన సాధించాలంటే ప్రభుత్వరంగ సంస్థలను బలోపేతం చేయాలి. అలాంటిది ఆ సంస్థలను ప్రైవేటీకరిస్తూ స్వావలంబన జపం చేయడం పచ్చి మోసం. ఈ వాస్తవాన్ని సిపిఎం ఆందోళనల ద్వారా ప్రజలు గ్రహిస్తున్నారు.
సమర భేరిలో ప్రజలను ఆలోచింపజేసే పలు కీలకాంశాలు, డిమాండ్లు ఉన్నాయి. కోవిడ్ సమయంలో పనుల్లేక పూట గడవని కోట్లాది కుటుంబాలకు నెలకు రూ.7,500 నగదు తోడ్పాటు ఆర్నెల్లపాటు అందించాలన్న డిమాండ్ సహేతుకమైంది. మనిషికి నెలకు పది కిలోల ఉచిత బియ్యం ఇవ్వాలనే ఆకాంక్షలో ఔచిత్యం ఉంది. గ్రామాల్లో ఉపాధి హామీ పని దినాలను పెంచడంతోపాటు, పట్టణ ప్రాంతాలకూ విస్తరించాలన్న నినాదం, వ్యవసాయేతర పనులు కోల్పోయి వలస కార్మికులు పల్లె బాట పట్టడం వలన ఉపాధి అవకాశాలపై పెరిగిన ఒత్తిడిని కొంతైనా పరిష్కరిస్తుంది. ఈ కనీస చర్యలను చేపట్టడానికి సైతం కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావట్లేదంటే ఏమనాలి? కోవిడ్ వలన ఎదురైన అన్ని సవాళ్లను రాష్ట్రాలే చూసుకోవాలని కేంద్రం చేతులెత్తేసింది. వారికున్న బలహీనతల మూలంగా ఎ.పి సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని నిధుల కోసం నిలదీసే ధైర్యం చేయలేకపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అవకాశవాద రాజకీయాలు, నిర్దయలకు ప్రజలు సమిధలవుతున్నారు. రాజ్యాంగ వ్యవస్థల విధ్వంసాలతో తన ఏకరూప సిద్ధాంతాన్ని ముందు పెట్టి, వెనక నుంచి కార్పొరేట్ అనుకూల విధానాలను పక్కాగా అమలు చేస్తున్న బిజెపి ఎజెండాపై సిపిఎం ఆధ్వర్యంలో వారం రోజులుగా ప్రజలు తమ నిరసనలతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. విధానాల్లో మార్పు రాకుంటే బిజెపి సర్కారు, దానికి మద్దతిచ్చే పార్టీలు, ప్రభుత్వాలు మరింతగా జనాగ్రహాన్ని చవి చూస్తాయి.