Nov 29,2020 23:44

విలేకర్లతో మాట్లాడుతున్న సిపిఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు

ప్రజాశక్తి-గుంటూరు : తుపానుతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని సిపిఎం తూర్పు గుంటూరు జిల్లా కార్యదర్శి పాశం రామారావు కోరారు. ఈ మేరకు బ్రాడీపేటలోని ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. భారీ వర్షాలకు జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయని, 4 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిన్నదని, కోతకు సిద్ధంగా వున్న వరి పంట నేలకొరిగి, నీట మునిగిందని చెప్పారు. వరికి ఎకరాకు రైతులు రూ.40 వేలు ఖర్చు చేశారని, మరో రూ.30 వేలు కౌలు అదనంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టాన్ని అంచనాను ప్రభుత్వం వెంటనే పూర్తిచేసి ఎకరాకు కనీసం రూ.25 వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. మినుము, తమలపాకులు, కూరగాయలు, ఆకుకూరలు, పత్తి, మిర్చి, అరటి, బొప్పాయి, పెసర పంటలు సుమారు లక్ష ఎకరాల్లో దెబ్బతిన్నాయని తెలిపారు. 10 వేల ఎకరాల మిర్చిలో నీరు నిల్వ వుండి ఉరకెత్తిందని, గతంలో రెండు సార్లు కురిసిన వర్షాలకు, వరదలకు నష్టం జరిగి రెండవసారి మొక్కలు నాటారని, ఎకరాకు ఇప్పటికే కనీసం కౌలుకాక రూ.60 వేలు ఖర్చయిందని, పై పంటలన్నింటికీ ఎకరాకు రూ.50 వేలు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అధిక వడ్డీలకు అప్పు చేసి పంట పండిస్తే చివరకు నీటిపాలయ్యిందని, రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని కోరారు. పొలాల్లో నిల్వ ఉన్న నీటిని ఇంజన్‌ల ద్వారా బయటకు పంపాలన్నారు. భట్టిప్రోలు, కొల్లూరు మండ లాల్లో వరదల్లో నష్టపోయిన రైతుల రుణాలు రద్దు చేయాలని, మిగతా ప్రాంతాల్లో రీషెడ్యూల్‌ చేయాలని, పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో ప్రత్యా మ్నాయ ప్రణాళికను రూపొందించి, ఎరువులు, విత్తనాలు ప్రభుత్వమే సరఫరా చేయాలని, తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో జిల్లా నాయకులు ఇ.అప్పారావు, కె.అజరు కుమార్‌, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.