Sep 20,2021 00:08

గుంటూరు రూరల్‌ పుల్లడిగుంట మలినేని కాలేజీలో ఓట్ల లెక్కింపు

ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో మున్సిపల్‌ ఎన్నికల్లో మాదిరిగానే పరిషత్‌ ఎన్నికల్లోనూ ఓటర్లు అధికార పార్టీకి పట్టం కట్టారు. ఏప్రిల్‌ 8న జరిగిన ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 10 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం ఎన్నికలు జరిగిన 45 జెడ్‌పిటిసి స్థానాలను వైసిపి గెల్చుకుంది. ఎనిమిది జెడ్‌పిటిసిలను ఇప్పటికే వైసిపి ఏకగ్రీవంగా దక్కించుకుంది. అయితే ఏకగీవ్రంగా గెలుపొందిన కారంపూడి జెడ్‌పిటిసి షేక్‌ ఇమాంసాహేబ్‌ పదవీబాధ్యతలు స్వీకరించకుండానే ఈ ఏడాది ఏప్రిల్‌ 2వ తేదీన మృతి చెందారు. శావల్యాపురం జెడ్‌పిటిసి టిడిపి అభ్యర్థి హైమారావు మృతితో ఇక్కడ ఎన్నిక వాయిదా పడింది. జిల్లా పరిషత్‌లో ప్రస్తుతం గెలిచిన 52 జెడ్‌పిటిసిలను వైసిపి తన ఖాతాలో వేసుకోవడంతో ప్రతిపక్షం లేకుండా పోయింది.
మొత్తం 805 ఎంపిటిసి స్థానాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 571 ఎంపిటిసి స్థానాలకు ఎన్నికలు జరిగాయి. వైసిపి 496 స్థానాల్లో గెలుపొందగా, టిడిపి 57 చోట్ల విజయం సాధించింది. జనసేన 10, సిపిఐ ఒక్క స్థానం, ఇండిపెండెంట్‌ 7 స్థానాల్లో గెలుపొందారు. గతేడాది 226 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇందులో వైసిపి 213 స్థానాలు దక్కించుకోగా టిడిపి నాలుగు, జనసేన ఒక్కటి, ఇతరులు 8 స్థానాలు కైవసం చేసుకున్నారు.
ఎన్నికలు జరిగిన 571 ఎంపిటిసి, 45 జెడ్‌పిటిసి స్థానాలకు ఉదయం 8 గంటలకు ప్రారంభం అయింది. జిల్లా కలెక్టర్‌ వివేక్‌ యాదవ్‌, ప్రత్యేక అధికారి నరసింహర, డిఐజి తివిక్రమ వర్మ, ఎస్‌పిలు ఆరీఫ్‌ హఫీజ్‌, విశాల్‌ గున్నీ ఓట్ల లెక్కింపును పర్యవేక్షించారు. ఓట్ల లెక్కింపులో ఎంపిటిసి ఫలితాలు మధ్యాహ్నం కల్లా వెల్లడి కాగా జెడ్‌పిటిసిల ఓట్ల లెక్కింపు ఫలితాలు సాయంత్రం నుంచి వెల్లడి అయ్యాయి. నామినేషన్‌లు దాఖలు చేసి గతేడాది ప్రచారంలో కూడా పాల్గొన్న టిడిపి ఆ తరువాత జరిగిన అనూహ్య పరిణామాల నేపధ్యంలో ఏప్రిల్‌ ఒకటో తేదీన ఎన్నికల కమిషన్‌ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తూ టిడిపి ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో టిడిపి అభ్యర్థుల పేర్లు బ్యాలెట్‌ పేపరుపై ఉండటంతో కొన్ని చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు కూడా గెలుపొందారు. టిడిపి అధిష్టానం వైఖరిని దిక్కరిస్తూ కొంత మంది ఎంపిటిసిలు పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో కొన్ని చోట్ల టిడిపి ఆశాజనకమైన ఫలితాలను సాధించింది. ప్రధానంగా దుగ్గిరాల మండలంలో టిడిపి ఎంపిటిసిలు 9 మంది గెలుపొందారు. వైసిపి ఏడుగురు, జనసేన ఇద్దరు గెలిచారు. దుగ్గిరాల మండలంలో పెదకొండూరు ఎంపిటిసి స్థానానికి జనసేన అభ్యర్థి జోజిబాబు 29 ఓట్లతో గెలిచినా పలుమార్లు రీకౌంటింగ్‌ చేసి 21 ఓట్లతో వైసిపి అభ్యర్ధి గెలిచినట్టు ప్రకటించారని మంగళగిరి నియోజకవర్గ జనసేన అభ్యర్థి చిల్లపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. దీంతో వైసిపి ఎంపిటిసిల సంఖ్య 8కి పెరిగింది. అయితే మండల కేంద్రమైన వట్టిచెరుకూరులో ఎంపిటిసి స్థానం 27 ఓట్లతో టిడిపి కైవసం చేసుకోగా వైసిపి నేతలు రీకౌంటింగ్‌ కోరడంతో వివాదం ఏర్పడింది. ఇరు వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. రీకౌంటింగ్‌కు అధికారులు అంగీకరించలేదు.
ఐదు బ్యాలెట్‌ బాక్సులో తడిసిన బ్యాలెట్‌లు
గుంటూరు జిల్లాలో బ్యాలెట్‌ పేపర్లు తడిసిన నేపధ్యంలో కొల్లూరు, తాడికొండ మండలాల పరిధిలో రెండు ఎంపిటిసి స్థానాలకు ఓట్ల లెక్కింపులో జాప్యం జరిగింది. తాడికొండ మండలం బేజాత్‌పురం ఎంపిటిసి స్థానానికి జరిగిన ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్లు తడవగా వీటిల్లో దాదాపు 400 ఓట్లు చెల్లనవిగా ప్రకటించారు. మిగతా ఓట్లు ఆరబెట్టి రాత్రి 8 గంటల సమయంలో ఓట్ల లెక్కింపు చేపట్టారు. కొల్లూరు మండలం ఈపూరు, చిలుమూరు, అనంతవరం, గాజుల్లంక గ్రామాల ఎంపిటిసి ఓట్లు స్వల్పంగా చెమ్మ పట్టడం వల్ల వాటిని ఆరబెట్టి లెక్కింపు చేపట్టారు.
24 ఎంపిపి, 25న జెడ్‌పి చైర్‌పర్సన్‌ ఎన్నిక
పరిషత్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడి కావడంతో మండల పరిషత్‌ అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ ఆదివారం షెడ్యూలు విడుదల చేసింది. 24న మండల పరిషత్‌ అధ్యక్షులను ఎన్నుకోవాలని నిర్ణయించారు. పరిషత్‌ ఎన్నికల్లో గెలిచిన ఎంపిటిసిలు అధ్యక్షుణ్ణి ఎన్నుకుం టారు.ఈ ఎన్నికలను మండల పరిషత్‌ ప్రత్యేక అధికారులు నిర్వహిస్తారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ను ఎన్నికయిన జెడ్‌పిటిసిలు చైర్‌పర్సన్‌ను ఎన్నుకుం టారు. చైర్‌పర్సన్‌ ఎన్నికను జిల్లా కలెక్టర్‌ నిర్వహిస్తా రు. జిల్లా పరిషత్‌ నూతన చైర్‌పర్సన్‌గా కొల్లిపర జెడ్‌పిటిసి హెన్రీ క్రిస్టీనా ఎన్నిక కానున్నారు. నోటిఫికే షన్‌ వెలువడిన ప్రకారం మొత్తం 54 స్థానా లకు గాను రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఎన్నికలు జరిగిన 45 స్థానాలతో పాటు ఏకగ్రీవంగా ఎన్నికైన 7 స్థానాలు వైసిపి పరం కావడంతో మొత్తం 52 మంది వైసిపి జెడ్‌పిటిసిలు చైర్‌పర్సన్‌ను ఎన్నుకోనున్నారు.