Oct 19,2020 20:16

       కుడిచేత్తో బొమ్మలు వేయడం చాలామందికి అలవాటు. ఎవరైనా ఎడంచేత్తో వేస్తుంటే ఒకింత ఆశ్చర్యంగా చూస్తాం. కొంతమంది రెండు చేతులతో వేస్తూ అప్పుడప్పుడూ వార్తల్లో కనబడుతుంటారు. అయితే కేరళలోని పాలక్కడ్‌కు చెందిన 19 ఏళ్ల మహమ్మద్‌ అసిఫ్‌ మాత్రం తన శరీరంలోని ఆరు అవయవాలతో ఎంతో సులభంగా పెయింటింగ్‌ వేసేస్తున్నాడు. రెండు పాదాలతో, నోటితో, ముక్కుతో, కళ్లతో చివరికి తన జుట్టుతో కూడా అతను బొమ్మలను గీస్తున్నాడు. ఇది నమ్మలేకుంటే అతని ఇన్‌స్ట్రాగమ్‌ పేజీలోకి వెళ్లండి. అక్కడ మీ కళ్లు నమ్మలేనంత అద్భుతాన్ని చూడొచ్చు.
బాల్యం నుంచే బొమ్మలు గీసే అలవాటున్నా దానిమీద అంతగా శ్రద్ధ పెట్టేవాడు కాదు అసిఫ్‌. అయితే ఏడాది క్రితం తన స్నేహితుడి ఫొటో చాలా వినూత్నంగా గీయాలని ఓ స్నేహితురాలు అసిఫ్‌ను ఒత్తిడి చేసింది. అప్పుడు కూడా అతను అంతగా పట్టించుకోలేదు. కాని డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అసిఫ్‌ 'అనుకోకుండా వచ్చిన కరోనా సెలవుల్లో ఈ కళ ఒంటబట్టించుకున్నా' అంటాడు. 'ఏప్రిల్‌ ఆరు నుంచి నేను ఇంట్లోనే ఉన్నాను. ఖాళీగా చాలా సమయం గడిపాను. అప్పుడే బొమ్మలు గీయడంపై శ్రద్ధ పెట్టాను. అయితే అందరిలా ఒక్క చేత్తో వేయకుండా రెండు చేతులతో బొమ్మలు గీసే వారి వీడియోలు చూశాను. అది ఎలా సాధ్యమైందో ప్రయత్నించాను. వారిలా కాకుండా ఇంకొంత వినూత్నంగా ప్రయత్నించాలని మొదట డ్రాయింగ్‌బ్రష్‌ను నాలుక కింద పెట్టుకొని బొమ్మ గీశాను. అది బాగా వచ్చింది. ఆ తరువాత ముక్కు, కనుబొమ్మలతో బొమ్మలు గీయడం ప్రారంభించాను. అయినా నేను సంతృప్తి చెందకుండా రెండు చేతులతో పాటు జుట్టును కూడా రంగు డబ్బాలో ముంచి వెంట్రుకలతో బొమ్మలు గీయడం ప్రారంభించాను' అంటాడు అసిఫ్‌. ఇటీవల ఏకకాలంలో రెండు చేతులతో, పాదాలతో గీసిన బొమ్మలను ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశాడు. తను ఎంతో ఇష్టపడే హీరో బొమ్మలను తన శరీరంలోని ఆరు భాగాలతో ఏకకాలంలో అలవోకగా గీసేసి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడు. ఈ కళలో అతను 50కు పైగా మెళకువలను సృష్టించాడు. నెలల వ్యవధిలోనే ఏవిధమైన శిక్షణా లేకుండానే అసిఫ్‌ ఈ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. 'ఇదంతా నా స్నేహితుల వల్లే సాధ్యమైంది. వాళ్లు నా కంటే నాలో ఉన్న సామర్థ్యాన్ని బలంగా నమ్మారు. ఒక పెయింటింగ్‌ ముగిసిన తరువాత మరో పెయింటింగ్‌ వేయడంలో నన్ను నేను ఎంతగానో తీర్చిదిద్దుకుంటాడు. అలా నా కళను విభిన్నంగా మార్చుకునేలా వారు నన్ను ఎంతో ప్రోత్సహించారు' అంటాడు అసిఫ్‌.