Jan 18,2021 18:50

పిల్లలూ మీ అందరికీ ఎంతో ఇష్టమైన రంగు రంగుల సీతాకోకచిలుకలను కొన్ని ప్రాంతాల్లో ఎగిరే పువ్వులని కూడా పిలుస్తుంటారు. ఈ సీతాకోకచిలుకలు పువ్వుల మీది వాలి పరపరాగసంపర్కం ద్వారా ఫలదీకరణానికి కారణమవుతాయని మీకు తెలుసుకదా! వాటి గురించి ఈ రోజు మరికొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందామా!
సీతాకోకచిలుకలకు మనకులాగే రెండు కళ్లు ఉంటాయి కదా. అయితే వాటికి కనురెప్పలు ఉండవు. అందుకే అవి నిద్రపోయేటప్పుడు కళ్లు తెరిచేవుంటాయి. ఆ కళ్లలో ఎన్నో లెన్సులు ఉండడం వల్ల ఒకే సమయంలో అనేక దిశలలో అనేక రకాల వస్తువులను పసిగట్టగలవు. ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగుల్లో ఉండేవే కాక ఇతర రంగుల్లో ఉండే సీతాకోకచిలుకలు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూ ఉంటాయి.
వీటికి ముక్కు ఉండదు. తలపై భాగాన ఉండే యాంటినా ద్వారానే వాసన పీల్చుకుంటాయి. నోటిలో స్ట్రా మాదిరి ఉండే భాగం ద్వారా ద్రవపదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. వాటి పాదాల ద్వారా రుచులను గ్రహిస్తాయి. ఏదైనా పదార్థం మీద వాలినప్పుడు అందులో ఉండే రసాయన సమ్మేళనాన్ని గ్రహించే శక్తి ఆ పాదాలకు ఉంటుంది. అలా అవి తినదగినవో కాదో తెలుసుకుంటాయి. పువ్వులో ఉండే నెక్టార్‌ను, పండ్లలో ఉండే జ్యూస్‌ను ఆహారంగా తీసుకుంటాయి. అందులో ఉండే షుగర్‌ వాటికి శక్తినిస్తుంది. ఒక్కోసారి మట్టినేలపై, తడినేలపై వాలి ఖనిజలవణాలను కూడా తీసుకుంటుంటాయి.