Oct 27,2021 22:28

సభలో మాట్లాడుతున్నో ఎంఎల్‌సి ఐవి

ప్రజాశక్తి-రాజోలు దాతల సహకారంతో పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన ఎఎఫ్‌డిటి విద్యా సంస్థలపై ప్రజలదే హక్కని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు, రాజోలు ఎంఎల్‌ఎ రాపాక వరప్రసాదరావు అన్నారు. బుధవారం మలికిపురంలోని ఎఎఫ్‌డిటి కళాశాలలో కళాశాల పరిరక్షణ సమితి ఆధ్వర్యాన నిర్వహించిన సభలో ఎంఎల్‌సి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ మేనేజ్మెంట్‌ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని ఈ ప్రాంతంలో ఉన్న బడుగు బడుగు బలహీన వర్గాల అభివద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థలను కాపాడుకోవాలని పిలుపు ఇచ్చారు. ప్రయివేటు వ్యక్తులు ఇప్పటికైనా వారి ఆలోచనను మార్చుకొని ప్రభుత్వం పరం కావడానికి సహకరించాలని అన్నారు. ప్రభుత్వ పరం చేసిన ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రభుత్వంలో కొనసాగించడమే కాక ఈ విద్యా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. విద్యా సంస్థలకు అధిక నిధులు కేటాయించడం ద్వారా మరింత అభివద్ధి చేయాలని అన్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలు అన్నిటినీ ప్రభుత్వపరం చేసి అభివద్ధి చేయాలని అన్నారు. ఎయిడెడ్‌ విద్యాసంస్థల ఆస్తులు కూడా స్వాధీనం చేసుకుని అభివద్ధి చేయాలని చెప్పారు. అధికారులు కూడా స్పందించి ఈ కాలేజీలను ప్రభుత్వం పూర్తిగా స్వాధీనంలోకి తీసుకోవాలని, బయట వ్యక్తుల జోక్యాన్ని అరికట్టాలని అన్నారు. ఎంఎల్‌ఎ వరప్రసాద్‌ మాట్లాడుతూ కనీసం కాలేజీకి ఒక్కసారి కూడా రానివారు సరిహద్దులు కూడా తెలియని వారు కోర్టుకు వెళ్లడం హాస్యాస్పదమన్నారు. కాలేజీ మేనేజ్‌మెంట్‌ ఎంతో స్పూర్తిదాయకమయిన తీర్మానం చేసి ప్రభుత్వానికి అప్పజెప్పారని తెలిపారు. అతి తక్కువ ఫీజులతో ఇప్పటివరకు ఈ కాలేజీలో లక్షలాది మంది విద్యార్థులు చదువుకున్నారని చెప్పారు. కొంతమంది స్వార్థపర శక్తులు ప్రైవేట్‌ పరం చేయాలని, విద్యను వ్యాపార మయం చేయాలనే తలంపుతో ఉన్నారని ఇటువంటి వారి ఆటలను సాగనివ్వబోమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది దేవ రాజేంద్ర ప్రసాద్‌, నేతల నాని, విద్యార్థి జెఎసి చైర్మన్‌ రాపాక మహేష్‌, కాలేజీ కరస్పాండెంట్‌ మంగెన సత్యనారాయణ మూర్తి, జెడ్‌పిటిసిలు బళ్ల ప్రసన్నకుమారి, దొండపాటి అన్నపూర్ణ, ఎంపిపిలు మల్లిబాబు, మేడిచర్ల సత్యవాణి, విద్యా సంస్థల పరిరక్షణ సమితి నాయకులు తోటే ప్రతాప్‌, నల్లి విశ్వనాథ్‌ పలువురు పాల్గొన్నారు.
సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలి : ఎంఎల్‌సి ఐవి
ప్రభుత్వం తక్షణమే సిపిఎస్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని పిడిఎఫ్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు డిమాండ్‌ చేశారు. బుధవారం రాజోలు జెడ్‌పి బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన యుటిఎఫ్‌ మహాసభలోమ ఆయన మాట్లాడారు. ఎపి ప్రభుత్వం 2004 సెప్టెంబర్‌ 1 నుంచి పాత పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. దీఈ మహాసభలో యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి బి.వి.రమణ, చక్రవర్తి, జ్యోతిబసు, కామేశ్వరరావు, నల్లి విశ్వనాథ్‌, బేతినీడి శ్రీనివాస్‌, డి.సత్యనారాయణ, యు.శ్రీనివాస్‌, ఎ.కాశీ విశ్వేశ్వరరావు పాల్గొన్నారు.