Jan 15,2022 11:30

మదనపల్లె (చిత్తూరు) : ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు ... నిన్న రాత్రి వాల్మీకిపురం మండలం చంతపర్తి గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌ (21), అతని స్నేహితుడు సిద్ధిక్‌ (21) లు మదనపల్లె నుంచి బైక్‌పై చింతపర్తికి బయలుదేరారు. మార్గమధ్యంలోని మదనపల్లె రూరల్‌ ఐదో మైలు వద్దకు రాగానే మరో బైక్‌ ఎదురుగా రావడంతో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులతోపాటు మరో బైక్‌పై ఉన్న మదనపల్లె రూరల్‌ కొత్తవారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (40) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108 కి సమాచారమిచ్చారు. క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా శ్రీనివాసులు మార్గమధ్యంలోనే మృతి చెందాడు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు వారిని తిరుపతి ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున ఇస్మాయిల్‌, సిద్దిక్‌ మృతి చెందారు. ఘటనపై మదనపల్లె రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.